పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : నారయణఋషి భాషణ

  •  
  •  
  •  

11-75-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు గావున గృహ క్షేత్ర పుత్త్ర కళత్ర ధనధాన్యాదులందు మోహితుండయి ‘ముక్తిమార్గంబు లప్రత్యక్షంబు’ లని నిందించువాఁడును, హరి భక్తివిరహితుండును, దుర్గతిం గూలుదు” రని మునివరుం డానతిచ్చిన విదేహుం డిట్లనియె.

టీకా:

అట్లుగావున = అందుచేత; గృహ = ఇళ్ళు; క్షేత్ర = పొలాలు; పుత్ర = కొడుకులు; కళత్ర = భార్య; ధన = సంపదలు; ధాన్య = ధాన్యము; ఆదుల = మున్నగువాటి; అందు = ఎడల; మోహితుండు = వ్యామోహము కలవాడు; అయి = ఐ; ముక్తిమార్గంబులు = మోక్షపదములు; అప్రత్యక్షంబులు = కంటికికనబడనివి; అని = అని; హరి = విష్ణు; భక్తి = భక్తి యందు; విరహితుండును = లేనివాడు; దుర్గతిన్ = నరకములో; కూలుదురు = పడిపోవుదురు; అని = అని; ముని = మునులలో; వరుండు = ఉత్తముడు; ఆనతిచ్చినన్ = చెప్పగా; విదేహుండు = విదేహుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అందుచేత, ఇండ్లు పొలాలు, సంతానం, భార్య, ధనం, ధాన్యం మున్నగు వాటిమీద వ్యామోహంతో మోక్షం కంటికి కనపడేదికాదు. కనుక లేదని నిందించే వారు; హరిభక్తి లేనివారు దుర్గతిలో కూలిపోతారు.” అని మునిశ్రేష్ఠుడు అనగా విదేహుడు ఇలా అడిగాడు.