పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : ఆవిర్హోత్రుని భాషణ

  •  
  •  
  •  

11-62-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు గావున నాత్మసృష్టంబైన పంచభూతనికరంబును పురం బొనరించి, యందు నిజాంశంబునం బ్రవేశించి, సగుణనిష్ఠుండై నారాయణాభిధానంబు గల ఋషీశ్వరుం డగు పరమేశ్వరుండు వెలుఁగొందె; నతని దశేంద్రియంబులచేఁ బాలితంబులైన దేహంబులు ధరించి, జగద్రక్షకత్వ సంహారకత్వాది గుణంబులు గలుగుటం జేసి గుణనిష్ఠుండయి రజస్సత్త్వతమో గుణంబుల బ్రహ్మ విష్ణు రుద్ర మూర్తులనం బరఁగి, త్రిగుణాత్మకుం డనంబడు నారాయణాఖ్యుని చరిత్రం బెఱింగించెద; నాకర్ణింపుము.

టీకా:

అట్లు = ఆ విధముగ; కావున = కనుక; ఆత్మ = తనచేత; సృష్టంబు = సృష్టింపబడినది; ఐన = అయిన; పంచభూత = పంచమహాభూతముల; నికరంబును = సమూహములుచేత; పురంబున్ = పురమును; ఒనరించి = చేసి; అందు = దానిలో; నిజ = తన; అంశంబునన్ = అంశతో; ప్రవేశించి = చేరి; సగుణ = త్రిగుణాలతోకూడి; నిష్ఠుండు = ఉన్నవాడు; ఐ = అయ్యి; నారాయణా = నారాయణుడు; అభిదానంబు = అనెడి పేరు; కల = కలిగిన; ఋషి = మునులలో; ఈశ్వరుండు = శ్రేష్ఠుడు; పరమేశ్వరుండు = భగవంతుడు {పరమేశ్వరుడు - సర్వోత్కృష్టమైన మరియు సర్వుల (బ్రహ్మాది పిపీలకపర్యంతము)ను నియమించు వాడు, విష్ణువు}; వెలుగొందెన్ = ప్రకాశించెను; అతని = అతని యొక్క; దశేంద్రియంబుల = దశేంద్రియములు {దశేంద్రియములు - 5 పంచఙ్ఞానేంద్రియములు 5 పంచకర్మేంద్రియములు}; చేన్ = చేత; పాలితంబులు = నియమించబడునవి; ఐన = అయిన; దేహంబులున్ = శరీరములలో; ధరించి = అవతరించి; జగత్ = లోకమును; రక్షకత్వ = కాపాడుట; సంహారకత్వా = సంహరించుట; ఆది = మున్నగు; గుణంబులున్ = గుణములు, కార్యక్రమాలు; కలుగుటన్ = కలిగి ఉండుట; చేసి = వలన; గుణ = త్రిగుణములను; నిష్ఠుండు = నిష్ఠగా గ్రహించినవాడు; అయి = ఐ; రజస్ = రజోగుణము; సత్త్వ = సత్వగుణము; తమోగుణంబులన్ = తమోగుణములచే; బ్రహ్మ = బ్రహ్మదేవుని; విష్ణు = విష్ణుమూర్తిని; రుద్ర = పరమశివుని; మూర్తులన్ = స్వరూపములు; అనన్ = అనబడుతూ; పరగి = ప్రసిద్ధుడై; త్రిగుణాత్మకుండు = త్రిగుణాత్మకుండు; అనంబడున్ = అనబడెడి; నారాయణ = నారాయణ; ఆఖ్యుని = పేరు కలవాని; చరిత్రంబు = చరిత్రమును; ఎఱింగించెదన్ = తెలియజెప్పెదను; ఆకర్ణింపుము = వినుము.

భావము:

భగవంతుడు తాను సృష్టించిన పంచభూతాలతో సంభూతమైన పురమును చేసి, దానిలో తన అంశతో ప్రవేశించి పిమ్మట సగుణనిష్ఠుడై నారాయణుడు అను పేరు కల ఋషీశ్వరుడుగా విరాజిల్లాడు. ఆయన పది ఇంద్రియాలతో నిర్మితాలైన శరీరాలను దాల్చి జగత్తును సృష్టించటం రక్షించటం సంహరించటం మొదలైన కార్యాలు చేయటం వలన రజస్సత్త్వతమోగుణాలతో బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనే పేర్లతో ఒప్పుతుంటాడు. త్రిగుణాత్మకుడు అనబడే ఆ నారాయణుని చరిత్ర చెబుతాను విను.