పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : ఆవిర్హోత్రుని భాషణ

  •  
  •  
  •  

11-60-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని యందావిర్హోత్రుం డిట్లనియెఁ; “గర్మాకర్మ వికర్మ ప్రతిపాదకంబు లగు శ్రుతివాదంబులలౌకికవర్ణితంబు; లట్టి యామ్నాయంబులు సర్వేశ్వరస్వరూపంబులు గాన విద్వాంసులు నెఱుంగ లే; రవి కర్మాచారంబు లనంబడు; మోక్షంబుకొఱకు నారాయణ భజనంబు పరమపావనంబు; వేదోక్తంబుల నాచరింపక ఫలంబులకు వాంఛ సేయువార లనేక జన్మాంతరంబులం బడయుదురు; మోక్షంబు నపేక్షించు వాఁడు విధిచోదిత మార్గంబున హరిం బూజింపవలయు; నట్టి పూజాప్రకారం బెట్లనినఁ, బవిత్రగాత్రుం డయి జనార్దను సన్నిధిం బూతచిత్తుండై, షోడశోపచారంబులఁ జక్రధరు నారాధించి, గంధ పుష్ప ధూప దీప నైవేద్యంబులు సమర్పించి, సాష్టాంగదండ ప్రణామంబు లాచరించి, భక్తిభావనా విశేషుండగు నతండు హరింజేరు” నని చెప్పిన విని విదేహుం డిట్లనియె; “నీశ్వరుం డేయే కర్మంబుల నాచరించె, నంతయు నెఱిగింపు” మనినఁ ద్రమిళుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అని అడుగగా; విని = విని; అందున్ = వారిలో; అవిర్హోత్రుండు = అవిర్హోత్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; కర్మ = కర్మము; అకర్మ = అకర్మము; వికర్మ = వికర్మములను; ప్రతిపాదికంబులు = నిరూపించెడివి; అగు = ఐన; శ్రుతి = వేదములలోని; వాదంబులు = వాదనలు; అలౌకిక = లౌకికాలకతీతులచేత; వర్ణింతంబులు = వివరించిబడినవి; అట్టి = అటువంటి; ఆమ్నాయంబులు = వేదములు; సర్వేశ్వర = భగవంతుని {సర్వేశ్వరుడు - సర్వుల పైన ఈశత్వము కలవాడు, విష్ణువు}; స్వరూపంబులు = స్వరూపములు; కాన = కావున; విద్వాంసులున్ = పండితులు కూడ; ఎఱుంగలేరు = తెలిసికొనలేరు; అవి = అవి; కర్మాచారంబులు = కర్మాచారములు; అనంబడున్ = అంటారు; మోక్షంబు = ముక్తి; కొఱకు = కోసము; నారాయణ = విష్ణు; భజనంబు = భక్తి; పరమ = మిక్కిలి; పావనంబు = పవిత్రముచేయునది; వేద = వేదములందు; ఉక్తంబులన్ = చెప్పబడినవి; ఆచరింపక = చేయకుండ; ఫలంబులు = ఫలితముల; కున్ = కి; వాంఛచేయు = ఆశించు; వారల = వారు; అనేక = ఎన్నో; జన్మ = జన్మములు; అంతరంబులన్ = ఇతరములను; పడయుదురు = పొందెదరు; మోక్షంబు = మోక్షమును; అపేక్షించు = కోరుకొనెడి; వాడు = వాడు; విధి = శాస్త్రము; చోదిత = నడిపించెడి; మార్గంబునన్ = విధముగ; హరిన్ = విష్ణుని; పూజింపవలయున్ = సేవించవలెను; అట్టి = అటువంటి; పూజా = పుజించెడి; ప్రకారంబు = విధానము; ఎట్లు = ఏ విధముగ; అనినన్ = అన్నచో; పవిత్ర = పరిశుద్ధమైన; గాత్రుండు = దేహము కలవాడు; అయి = అయ్యి; జనార్దనున్ = నారాయణుని; సన్నిధిన్ = సన్నిధిలో; పూత = పవిత్రమైన; చిత్తుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; షోడశోపచారంబులన్ = షోడశోపచారములతో {షోడశోపచారములు - 1ఆవాహనము 2ఆసనము 3పాద్యము 4అర్ఘ్యము 5ఆచమనీయము 6 స్నానము 7వస్త్రము 8యఙ్ఞోపవీతము 9గంధము 10పుష్పము 11ధూపము 12దీపము 13నైవేద్యము 14తాంబూలము 15నమస్కారము 16ప్రదక్షిణము}; చక్రధరున్ = హరిని; ఆరాధించి = సేవించి; గంధ = గంధము; పుష్ప = పూలు; ధూప = ధూపము; దీప = దీపము; నైవేద్యంబులు = నైవేద్యములు; సమర్పించి = అర్పించి; సాష్టాంగదండప్రణామంబులు = సాష్టాంగనమస్కారములు {సాష్టాంగదండప్రణామము - 8 అవయవములు (2 చేతులు 2పాదములు 2భుజాగ్రమములు 1రొమ్ము 1నొసలు) భూమికి తాకునట్లుగా దండ (కఱ్ఱవలె) పడి చేసిడి నమస్కారము}; ఆచరించి = చేసి; భక్తిపావనా = భక్తిభావన; విశేషుండు = అధికముగా కలవాడు; అగు = ఐన; అతండు = అతను; హరిన్ = నారాయణుని; చేరును = చేరును; అని = అని; చెప్పిన = చెప్పగా; విని = విని; విదేహుండు = విదేహుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ఈశ్వరుండు = భగవంతుడు; ఏయే = ఎట్టిఎట్టి; కర్మంబులన్ = కర్మలను; ఆచరించెన్ = చేసెనో; అంతయున్ = సమస్తము; ఎఱింగింపు = తెలుపుము; అనినన్ = అని అడుగగా; ద్రమిళుండు = ద్రమిళుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా అడుగగా ఆవిర్హోత్రుడనే మహాముని విదేహప్రభువుతో ఈ విధంగా చెప్పసాగాడు. “కర్మ అకర్మ వికర్మ వీటిని ప్రతిపాదించే శ్రుతివాదులు లౌకికులు చెప్పినవి కాదు. అటువంటి వేదాలు సర్వేశుని స్వరూపాలు వాటిని పండితులు కూడ తెలుసుకోలేరు. వాటిని కర్మాచారాలు అంటారు. మోక్షంకోసం నారాయణ భజనం అన్నిటి కంటే పవిత్రమైనది. వేదం చెప్పినట్లు చేయక ఫలాలు కోరేవారు ఎన్నో జన్మలు ఎత్తుతారు. మోక్షాన్ని కోరేవారు శాస్త్రం చెప్పినవిధంగా హరిని పూజించాలి. ఆ పూజావిధానం ఎటువంటిదంటే పరిశుద్ధమైన దేహంతో భగవంతుని సన్నిధిలో పవిత్రచిత్తుడై ప్రవర్తించాలి. షోడశోపచారాలతో చక్రధరుని ఆరాధించాలి. గంథం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అర్పించి సాష్టాంగదండప్రణామాలు చేయాలి. విశేషమైన భక్తిభావం మనసున నింపుకోవాలి. అట్టివాడు పరమాత్మను జేరుతాడు.” అని వివరించగా విని విదేహమహారాజు ఇలా అన్నాడు. “ఈశ్వరుడు ఏ లీలలు ఆచరించాడు. ఆ వివరం అంతా తెలుపవలసింది.” అనగా ద్రమిళుడనే మునివర్యుడు ఇలా అన్నాడు.