పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : యదు వృష్ణి భో జాంధక వంశంబు

  •  
  •  
  •  

10.2-1333-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి యన్వయంబు నందు మాధవునకు రుక్మిణీదేవి యందుఁ బితృసముండును, సమగ్ర భుజావిజృంభణుండును నై ప్రద్యుమ్నుండు జనియించె; నతనికి రుక్మికూఁతురగు శుభాంగివలన ననిరుద్ధం డుదయించె; నతనికి మౌసలావశిష్టుండైన ప్రజుండు సంభవించె; నతనికిఁ బ్రతిబాహుండుపుట్టె; వానికి సుబాహుండు జన్మించె; నతనికి నుగ్రసేనుండుప్రభవించె; నతనికి శ్రుతసేనుండు గలిగె; నిట్లు యదు వృష్టి భోజాంధక వంశంబులు పరమ పవిత్రంబులై పుండరీకాక్షుని కటాక్షవీక్షణ శయ్యాసనానుగత సరసాలాప స్నానాశన క్రీడావినోదంబుల ననిశంబునుం జెందుచు, సర్వదేవతార్థంబు సమస్తంబైన క్రతువు లొనరింపుచుఁ బరమానంద కందళిత చిత్తులై యుండి" రని చెప్పి వెండియు.

టీకా:

అట్టి = అటువంటి; అన్వయంబున్ = వంశము; అందున్ = లో; మాధవున్ = కృష్ణుని; కున్ = కి; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; అందున్ = తో; పితృ = తండ్రితో; సముండును = సమానమైనవాడు; సమగ్ర = సంపూర్ణమైన; భుజా = భుజబలముల; విజృంభణుండును = ఆటోపము కలవాడును; ఐ = అయ్యి; ప్రద్యుమ్నుండు = ప్రద్యుమ్నుండు; జనియించెన్ = పుట్టెను; రుక్మి = రుక్మి; కూతురు = పుత్రిక; అగు = ఐన; శుభాంగి = శుభాంగి; వలన = అందు; అనిరుద్ధుండున్ = అనిరుద్ధుండు; ఉదయించెన్ = పుట్టెను; అతని = అతని; కిన్ = కి; మౌసలా = ముసలము తరువాత; అవశిష్టుండు = మిగిలినవాడు; ఐన = అయిన; ప్రజుండు = ప్రజుడు; సంభవించెన్ = పుట్టెను; అతని = అతని; కిన్ = కి; ప్రతిబాహుండు = ప్రతిబాహుడు; పుట్టెన్ = పుట్టెను; వాని = అతని; కిన్ = కి; సుబాహుండు = సుబాహుడు; జన్మించెన్ = పుట్టెను; అతని = అతని; కిన్ = కి; ఉగ్రసేనుండు = ఉగ్రసేనుడు; ప్రభవించెన్ = పుట్టను; అతని = అతని; కిన్ = కి; శ్రుతసేనుండు = శ్రుతసేనుండు; కలిగెన్ = పుట్టెను; ఇట్లు = ఈ విధముగ; యదు = యదు; వృష్ణి = వృష్ణి; భోజ = భోజ; అంధక = అంధక; వంశంబులున్ = వంశములు; పరమ = మిక్కిలి; పవిత్రంబులు = పావనములు; ఐ = అయ్యి; పుండరీకాక్షు = కృష్ణుని; నిరీక్షణ = చూపులు; శయ్యా = పడకలు, పండుకొనుట; ఆసన = పీటలు, కూర్చొనుట; అనుగత = వెనుక తిరుగుట; సరస = రసవంతమైన; ఆలాప = ముచ్చట్లు చెప్పుకొనుట; స్నాన = స్నానములు చేయుట; అశన = భోజనములు చేయుట; క్రీడా = ఆటలాడుట; వినోదంబులన్ = వేడులలో పాల్గొనుటలలో; అనిశంబు = ఎల్లప్పుడు; చెందుతు = పొందుతు; సర్వ = ఎల్ల; దేవతా = దేవతల; అర్థంబున్ = కోసము; సమస్తంబైన = సమస్తమైన; క్రతువులున్ = యఙ్ఢములు; ఒనరింపుచున్ = చేయుచు; పరమ = మిక్కిలి; ఆనంద = ఆనందముచేత; కందళిత = వికసించిన; చిత్తులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; ఉండిరి = ఉన్నారు; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరియును.

భావము:

అలాంటి వంశంలో శ్రీకృష్ణునికి రుక్మిణివల్ల ప్రద్యుమ్నుడు పుట్టాడు. అతడు అన్నిటా తండ్రి వంటివాడు మహాభుజబలం కలవాడు అతని భార్య రుక్మి కూతురు శుభాంగి. ఆమెకు అనిరుద్ధుడు జన్మించాడు. అతనికి ప్రజుడు పుట్టాడు. ఇతను మాత్రమే ముసలం బారినుండి తప్పించుకున్నాడు. ఆ ప్రజుడికి ప్రతిబాహుడు, ప్రతిబాహుడికి సుబాహుడు పుట్టారు. అతనికి ఉగ్రసేనుడు జన్మించాడు. ఈ విధంగా యదు, వృష్ణి, భోజ, అంధక, వంశాలు పవిత్రాలు అయ్యాయి. కృష్ణుడితో సహవాసంచేస్తూ ఆయన కటాక్షవీక్షణలు అందుకుంటు, ఆయనతో కంచాలు మంచాలు ఆసనాలు పంచుకుంటు, కలిసి స్నానాలు భోజనాలు చేస్తు, వినోదాలలో పాల్గొంటు, సకల దేవతలను ఉద్దేశించి యాగాలు చేస్తూ యాదవులు పరమానందం పొందుతూ జీవించారు.” అని చెప్పిన శుకమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు.