పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : వృకాసురుండు మడియుట

  •  
  •  
  •  

10.2-1252-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కనుంగొని యమ్మహాస్థానంబు డాయంజనుటయు, నప్పుండరీ కాక్షుం డఖండవైభవంబునం గుండలీశ్వర భోగతల్పంబునం బరమానంద కందళితహృదయారవిందుం డై యిందిరానయన చకోరకంబుల నిజమందహాస సాంద్ర చంద్రికావితతిం దేల్చుచు, నార్తభక్తజన రక్షణంబు పనిగా మెలంగుచు, వివిధ వినోదంబులం దగిలి యుండియు, ఫాలలోచనుం డద్దనుజపాలునకుం దలంపక యిచ్చిన వరంబు దన తలమీఁదవచ్చినం గలంగి చనుదెంచుట తన దివ్యచిత్తంబున నెఱింగి, యక్కాలకంధరుని యవస్థ నివారింపం దలంచి యయ్యిందిరాదేవి తోడి వినోదంబు సాలించి యప్పుడు.

టీకా:

కనుంగొని = చూసి; ఆ = ఆ దివ్యమైన; మహాస్థానంబున్ = గొప్పవైకుంఠమును; డాయన్ = దగ్గరకు; చనుటయున్ = వెళ్ళగా; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పుండరీకాక్షుండు = విష్ణుమూర్తి; అఖండ = పరిపూర్ణమైన; వైభవంబునన్ = వైభవముతో; కుండలీశ్వర = ఆదిశేషుని {కుండలీశ్వరుడు - కుడలీ ఆకారము కలవాని (సర్పములకు) ప్రభువు, శేషుడు}; భోగ = దేహము అను; తల్పంబునన్ = పాన్పుపైన; పరమ = ఉత్కృష్టమైన; ఆనంద = ఆనందముచేత; కందళిత = వికసించిన; హృదయ = హృదయము అను; అరవిందుండు = పద్మము కలవాడు; ఐ = అయ్యి; ఇందిరా = లక్ష్మీదేవి యొక్క; నయన = కన్నులు అను; చకోరంబులన్ = చకోరపక్షులను; నిజ = తన; మందహాస = చిరునవ్వులు అనెడి; సాంద్ర = దట్టమైన; చంద్రికా = వెన్నెలల; వితతిన్ = సమూహము నందు; తేల్చుచున్ = ఆనందింపజేయుచు; ఆర్త = పీడితులైన; భక్త = భక్తులైన; జన = వారి; రక్షణంబు = కాపుటను; పనిగా = ముఖ్యమైనపనిగా; మెలంగుచున్ = వర్తించుచు; వివిధ = నానా విధములైన; వినోదంబులన్ = వేడుకలతో; తగిలి = ఆసక్తుడై; ఉండియున్ = ఉన్నప్పటికిని; ఫాలలోచనుండు = శివుడు; ఆ = ఆ యొక్క; దనుజపాలున్ = రాక్షసరాజున; కున్ = కు; తలంపక = యోచించకుండా; ఇచ్చిన = ప్రసాదించిన; వరంబున్ = వరము; తన = అతని, శివుని; తల = నెత్తి; మీదన్ = మీదికి; వచ్చినన్ = రాగా; కలంగి = కలతచెంది; చనుదెంచుట = వచ్చుట; తన = తన యొక్క; దివ్యచిత్తంబునన్ = దివ్యదృష్టితో; ఎఱింగి = తెలిసికొని; ఆ = ఆ; కాలకంధరుని = శివుని; అవస్థ = దుర్దశను; నివారింపన్ = తప్పించవలెనని; తలంచి = భావించి; ఆ = ఆ; ఇందిరాదేవి = లక్ష్మీదేవి; తోడి = తోటి; వినోదంబులన్ = వేడుకలు; చాలించి = నిలిపి; అప్పుడు = పిమ్మట.

భావము:

అలా దివ్యమైన వైకుంఠం ప్రవేశించిన శంకరుడు శ్రీమహావిష్ణువును దర్శించాడు. ఆ సమయంలో పుండరీకాక్షుడు అయిన శ్రీహరి మహా వైభవంతో ఆదిశేషుడిపై పవళించి ఉన్నాడు. తన మందహాసం అనే వెన్నెలతో లక్ష్మీదేవి కన్నులు అనే చకోరాలను అలరిస్తున్నాడు. ఈ విధంగా ఎన్నో వినోదాలలో తేలియాడుతూ ఉండి కూడ, పరమశివుడు ఆ రాక్షసుడికి దానమిచ్చి ఆపదలపాలైన విషయాన్ని విష్ణువు తన దివ్యదృష్టితో తెలుసుకున్నాడు. నీలకంఠునికి వాటిల్లిన ఉపద్రవాన్ని పోగొట్టాలని హరి నిశ్చయించుకుని, లక్ష్మీదేవితో సాగిస్తున్న వినోదాలను ఆపాడు.