పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శ్రుతి గీతలు

  •  
  •  
  •  

10.2-1220-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి నిన్నుఁ బరమాణుకారణవాదులైన కణ్వ గౌతమాదులును, బ్రకృతి కారణవాదులయిన సాంఖ్యులును, దేహాత్మవాదులయిన బౌద్ధులును, వివిధంబులైన కుతర్కంబులచేతం బరస్పరావ్యాహతంబులైన మతంబులు దమతమ కుతర్కవాదంబుల సమర్థించుచు నిన్నుం దెలియలేరు; మహాభాగ్యవంతులయిన యోగీంద్రులకు నీవు ప్రత్యక్షం బైన నివి యన్నియు నసత్యంబు లని కానవచ్చు; వెండియుఁ గొందఱీ సచరాచర వస్తుజాతంబులకు నంతర్యామివై సర్వంబు నీవ యగుటం దెలియలేక నిత్యం బనియు, ననిత్యం బనియు విపరీతబుద్ధిం దెలియుదురు; గాని భవదీయ దివ్యతత్త్వంబు నిక్కంబుగఁ దెలియజాలరు; కొందఱు జగచ్ఛరీరుండవుగాన జగద్రూపకుండవైన నిన్నుం గటకమకుటకర్ణికాది వివిధ భూషణభేదంబులం గనకంబు నిజస్వరూపంబు విడువక వర్తించు చందంబున జగద్వికారానుగతుండ వయ్యును నిఖిల హేయప్రత్యనీక కల్యాణగుణాత్మకుండవై యుండుదు వని యాత్మ విదులయిన వారు దెలియుదు; రదియునుం గాక.

టీకా:

అట్టి = అటువంటి; నిన్నున్ = నిన్ను; పరమాణుకారణ వాదులు = కణవాదులు {పరమాణుకారణవాదులు - పరమాణు స్వరూపుడే పరబ్రహ్మ జగత్తుకి మాలకారణభూతుడు అనెడివారు}; ఐన = అయినట్టి; కణ్వ = కణ్వుడు {అణువు - శ్లో. జాలసూర్యమరీచిస్థం యచ్ఛసూక్ష్మ తమంరజః, తస్య షష్టాష్టమో భాగస్త్వణురిత్యభి ధీయతే. తస్యమష్టాష్టమోభాగః పరమాణుః ప్రకీర్తితః. తా. కిటికీ కన్నం లోనుండి వచ్చెడి సూర్యకిరణంలోని చిన్న దుమ్ము కణంలో ఆరవైలోఎనిమిదవ (షష్ట - అరవై కనుక 60x8, 480వ వంతు) పాలు అణువు. ఆ అణువులో ఆరవైఎనిమిదవ పాలు (60x8, 480వ వంతు)పరమాణువు.}; గౌతమ = గౌతముడు; ఆదులును = మొదలగువారు; ప్రకృతికారణవాదులు = ప్రకృతివాద మతస్థులు {ప్రకృతికారణ వాదులు - అవ్యక్త నామక ప్రకృతియే మూల కారణభూతము అనెడివారు)}; ఐన = అయినట్టి; సాంఖ్యులును = సాంఖ్య మతస్థులు; దేహ = దేహమే; ఆత్మ = తాము; ఆదులు = అనెడివారు; అయిన = ఐన; బౌద్ధులును = బౌద్ధమతస్థులు; వివిధంబులున్ = నానా విధములు; ఐన = అయిన; కుతర్కంబులన్ = చెడ్డ తర్కముల; చేతన్ = చేత; పరస్పర = ఒండొరులచేత; అవ్యాహతంబులు = పెద్దతేడాలేనివి {అవ్యాహతంబులు - అవ్యవహితములైనవి, వ్యవహితము (వ్యవధానమైనవి, తేడాకలవి) కానివి}; అయిన = ఐన; మతంబులున్ = మార్గములలో; తమతమ = వారివారి; కుతర్క = కుత్సిత తర్కపు; వాదంబులన్ = వాదములతో; సమర్థించుచున్ = సమర్థించుకొనుచు; నిన్నున్ = నిన్ను; తెలియ = తెలిసికొన; లేరు = చాలరు; మహా = గొప్ప; భాగ్యవంతులు = అదృష్టవంతులు; అయిన = ఐన; యోగి = ఋషి; ఇంద్రుల్ = ఉత్తముల; కున్ = కు; నీవు = నీవు; ప్రత్యక్షంబు = ఎదురుగా కనబడువాడవు; ఐనన్ = అయినచో; ఇవి = ఇవి; అన్నియున్ = అన్నీ; అసత్యంబులు = నిజమైనవి కాదు; అని = అని; కానవచ్చున్ = తెలియవచ్చును; వెండియున్ = ఇంకను; కొందఱు = కొంతమంది; సచరాచర = సర్వప్రాణుల, చేతన; వస్తు = అచేతన వస్తువుల; జాతంబుల్ = సమూహముల; కున్ = కు; అంతర్యామివి = లోనుండువాడవు {అంతర్యామి - విష్ణువు, శ్రుతి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారయణ స్థితః.}; ఐ = అయ్యి; సర్వంబున్ = సమస్తము; నీవ = నీవే; అగుటన్ = ఐ ఉండుటను; తెలియన్ = తెలిసికొన; లేక = చాలక; నిత్యంబు = సత్తు; అనియున్ = అని; అనిత్యంబు = చిత్తు; అనియున్ = అని; విపరీత = వ్యతిరిక్త; బుద్ధిన్ = బుద్ధితో; తెలియుదురు = అనుకొనెదరు; కాని = కాని; భవదీయ = నీ యొక్క; దివ్య = అప్రాకృత, దివ్యమైన; తత్వంబున్ = తత్వమును; నిక్కంబుగన్ = నిజానికి; తెలియన్ = తెలిసికొన; చాలరు = సమర్థులు కారు; కొందఱు = కొంతమంది; జగత్ = లోకమే; శరీరుండవు = దేహముగా కలవాడవు; కానన్ = కాబట్టి; జగత్ = లోకమే; రూపకుండవు = స్వరూప మైనవాడవు; ఐన = అయినట్టి; నిన్నున్ = నిన్ను; కటక = చేతికడియములు; మకుట = కిరీటములు; కర్ణిక = కర్ణాభరణాలు, దుద్దులు; ఆది = మున్నగు; వివిధ = నానా విధములైన; భూషణ = అలంకారముల; భేదంబులన్ = వేర్పాటుల వలన; కనకంబు = బంగారము; నిజ = తన; స్వరూపంబున్ = ఆకృతిని; విడువక = వదలకుండ; వర్తించున్ = నడచెడెడి; చందంబునన్ = విధముగా; జగత్ = లోకము యొక్క; వికార = మార్పులను; అనుగతుండువు = అనుసరించి పోవువాడవు; అయ్యును = అయినప్పటికిని; నిఖిల = సమస్తమైన; హేయప్రత్యనీక = రోతపుట్టించని; కల్యాణ = శుభకరమైన; గుణ = గుణములు; ఆత్మకుండవు = స్వరూపములైన వాడవు; ఐ = అయ్యి; ఉండుదువు = ఉండెదవు; అని = అని; ఆత్మవిదులు = బ్రహ్మతత్వవేత్తలు; అయిన = ఐన; వారున్ = వారు; తెలియుదురు = తెలిసికొందురు; అదియునున్ = అంతే; కాక = కాకుండ.

భావము:

పరమాణువులే ఈ సృష్టికి కారణమని భావించే కణ్వ గౌతమాదులు, ప్రకృతే కారణమని వాదించే సాంఖ్యులు, దేహాత్మ వాదులు అయిన బౌద్ధులు మున్నగు వారు తమ తమ పరస్పర విరుద్ధము లైన కుతర్కాలతో కొట్టుమిట్టు లాడుతూ అట్టి సచ్చిదానంద స్వరూపుడవైన నిన్ను తెలుసుకోలేరు; నిన్ను సాక్షాత్కరించుకున్న మాహా భాగ్యవంతులు అయిన పరమ యోగులకు ఈ సృష్టిలో నీవు తప్ప ఇతర పదార్థాలు సమస్తము అసత్యాలు అనిపిస్తాయి; చరాచర ప్రపంచం అంతటా ఉండే నిన్ను సక్రమంగా తెలుసుకోలేక కొందరు విపరీత బుద్ధులతో నిత్యానిత్య వాదాలు వాదించుకుంటూ ఉంటారే తప్ప నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేరు; కటక కంకణ కిరీటాది నానావిధ భూషణాలలో సువర్ణం తన స్వరూపాన్ని విడువక వర్తించునట్లు నీవు విశ్వాత్ముడవు, సమస్త కల్మషాలకు అతీతుడవు, శుభరూపుడవు, కల్యాణ గుణాత్మకుడవు అని ఆత్మతత్వం తెలిసినవారే తెలుసుకుంటారు. అంతేకాకుండా....