పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సుభద్రా పరిణయంబు

  •  
  •  
  •  

10.2-1166-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు సుభద్రా దర్శనోత్సాహంబు దన మనంబున సందడిగొనం, ద్రిదండివేషంబు ధరియించి, ద్వారకాపురంబునకుం జనుదెంచి, యప్పౌరజనంబులు భక్తిస్నేహంబుల ననిశంబుఁ బూజింపం దన మనోరథసిద్ధి యగునంతకుం గనిపెట్టుకొని, వానకాలంబు సనునంతకు నప్పట్టణంబున నుండు సమయంబున.

టీకా:

అట్లు = ఆ విధముగ; సుభద్రా = సుభద్రాదేవిని; దర్శన = చూడవలె నని; ఉత్సాహంబున్ = కుతూహలముతో; తన = తన యొక్క; మనంబునన్ = మనసు నందు; సందడిగొనన్ = తొందరపెట్టగా; త్రిదండి = త్రిదండసన్యాసి {త్రిదండి - మనోదండము (శిక్షించుట) వాగ్దండము కర్మదండము అను మూడు దండములు కల సన్యాసి}; వేషంబున్ = వేషము; ధరియించి = వేసికొని; ద్వారకాపురంబున్ = ద్వారకానగరమున; కున్ = కు; చనుదెంచి = వచ్చి; ఆ = ఆ; పురజనంబులున్ = పౌరులు; భక్తి = భక్తితో; స్నేహంబులన్ = మైత్రితో; అనిశంబున్ = ఎల్లప్పుడు; పూజింపన్ = కొలుచుచుండగా; తన = తన యొక్క; మనోరథ = కోరిక; సిద్ధి = నెరవేరుట; అగున్ = అయ్యే; అంతకున్ = అంతవరకు; కనిపెట్టుకొని = ఎదురు చూచుచు; వానకాలంబు = వర్షాకాలము; చనున్ = వెళ్లిపోవు; అంతకున్ = అంతవరకు; ఆ = ఆ; పట్టణంబునన్ = పట్టణములో; ఉండు = ఉండెడి; సమయంబునన్ = సమయము నందు.

భావము:

ప్రేమాతిశయం వలన సుభద్రను చూడాలని మిక్కుటమైన ఉబలాటం అర్జునునికి కలిగింది. అతడు సన్యాసివేషం ధరించి ద్వారకాపురి ప్రవేశించాడు. అక్కడి పౌరులు అతనిని సేవించసాగారు. తన సంకల్పం సఫలం చేసుకోవటం కోసం వర్షాకాలం దాటిపోయే టంత వరకూ ఆ ద్వారకా పట్టణంలోనే ఉన్నాడు.