పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మృతులైన సహోదరులఁ దెచ్చుట

  •  
  •  
  •  

10.2-1140-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యనేక విధంబుల వినుతించుచు నిట్లనియె; “మీరలు మహానుభావులరు; మీరు తొల్లి యనేకకాలంబు సనినక్రిందట మృతుండై, దండధరుమందిరంబున నున్న గురుకుమారుని మీ మహాప్రభావంబులు లోకంబులఁ బరిపూర్ణంబులై ప్రకాశింప; నక్కాలుని చెంతనుండి మగుడందెచ్చి గురుదక్షిణగా నొసంగితి; రివ్విధంబునం గంసునిచేత హతులైన మత్పుత్త్రులనందఱ మరలం దెచ్చి నా మనంబున నున్న దుఃఖంబు నివారింపవలయు” నని దేవకీదేవి ప్రార్థించినం దమతల్లి యాడిన మృదుమధురవాక్యంబు లత్యాదరంబున నాదరించి, యప్పుడు బలకృష్ణులు దమ యోగమాయా మహత్త్వంబున సుతలంబునకుం జని; రట్టి యెడ.

టీకా:

అని = అని; అనేక = పెక్కు; విధంబులన్ = భంగుల; వినుతించుచు = శ్లాఘించుచు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను; మీరలు = మీరు; మహానుభావులరు = గొప్పవారు; మీరు = మీరు; తొల్లి = మునుపు; అనేక = చాలా; కాలంబు = కాలము; చనిన = పోయిన; కిందట = ముందు; మృతుండు = చనిపోయినవాడు; ఐ = అయ్యి; దండధరు = యముని; మందిరంబునన్ = ఇంటిలో; ఉన్న = ఉన్నట్టి; గురు = గురువు యొక్క; కుమారుని = పుత్రుని; మీ = మీ యొక్క; మహా = గొప్ప; ప్రభావంబులున్ = మహత్వములు; లోకంబులన్ = ఎల్లలోకములలోను; పరిపూర్ణములు = నిండుగా ఉన్నవి; ఐ = అయ్యి; ప్రకాశింపన్ = ప్రకాశించునట్లుగా; ఆ = ఆ; కాలుని = యముని; చెంత = వద్ద; నుండి = నుండి; మగుడన్ = తిరిగి; తెచ్చి = తీసుకువచ్చి; గురుదక్షిణ = గురుదక్షిణ; కాన్ = అగునట్లు; ఒసంగితిరి = ఇచ్చితిరి; ఈ = ఈ; విధంబునన్ = రీతిగనే; కంసుని = కంసుడి; చేతన్ = చేతిలో; హతులు = చంపబడినవారు; ఐన = అయిన; మత్ = నా యొక్క; పుత్రులన్ = కొడుకులను; అందఱన్ = అందరిని; మరలన్ = తిరిగి; తెచ్చి = తీసుకువచ్చి; నా = నా యొక్క; మనంబునన్ = మనసులో; ఉన్న = ఉన్నట్టి; దుఃఖంబున్ = దుఃఖమును; నివారింపవలయును = పోగొట్టవలెను; అని = అని; దేవకీదేవి = దేవకీదేవి; ప్రార్థించినన్ = వేడుకొనగా; తమ = వారి యొక్క; తల్లి = అమ్మ; ఆడిన = పలికిన; మృదు = మృదువైన; మధుర = ఇంపైన; వాక్యంబులన్ = మాటలను; అతి = మిక్కిలి; ఆదరంబునన్ = ఆదరణతో; ఆదరించి = మన్నించి; అప్పుడు = పిమ్మట; బల = బలరాముడు; కృష్ణులున్ = కృష్ణులు; తమ = వారి యొక్క; యోగమాయా = యోగమాయ యొక్క; మహత్వంబునన్ = గొప్పదనముచేత; సుతలంబున్ = సుతలలోకమునకు; చనిరి = వెళ్ళిరి; అట్టి = అటువంటి; ఎడన్ = సమయము నందు.

భావము:

అని ఇలా బలరామకృష్ణులను స్తుతిస్తూ దేవకీదేవి వారితో ఇలా అన్నది. “మహానుభావులారా! మీరు చాలా కాలం క్రితం మృతుడై యమలోకంలో ఉన్న గురువు యొక్క కుమారుని తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పించిన మహాత్ములు. మీ గొప్పదనం లోకులు వేనోళ్ళ పొగడుతున్నారు. అలాగే కంసుడు సంహరించిన నా బిడ్డలను తీసుకువచ్చి నా శోకాన్ని నివారించండి.” ఇలా తల్లి దేవకీదేవి వేడుకోగా బలరామకృష్ణులు ఆదరంతో విన్నారు. తమ యోగ మాయా ప్రభావంతో సుతలలోకానికి వెళ్ళారు. అప్పుడు....