పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : జాంబవతి పరిణయంబు

  •  
  •  
  •  

10.2-71-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని సంతసించి జాంబవంతుఁడు మణియునుం, దన కూఁతు జాంబవతి యను కన్యకామణియునుం దెచ్చి హరికిం గానికఁగా సమర్పించె; నటమున్న హరివెంట వచ్చిన వారలు బిలంబువాకిటం బండ్రెండు దినంబులు హరిరాక కెదురుచూచి వేసరి వగచి పురంబునకుం జని; రంత దేవకీవసుదేవులును రుక్మిణియును మిత్ర బంధు జ్ఞాతి జనులును గుహ సొచ్చి కృష్ణుండు రాక చిక్కె నని శోకించి.

టీకా:

అనినన్ = అనగా; విని = విని; సంతసించి = సంతోషించి; జాంబవంతుడు = జాంబవంతుడు; మణియునున్ = శమంతకమణిని; తన = తన; కూతున్ = కుమార్తెను; జాంబవతి = జాంబవతి; అనున్ = అనెడి; కన్యకా = కన్యలలో; మణియునున్ = ఉత్తమురాలిని; తెచ్చి = తీసుకువచ్చి; హరి = కృష్ణుని; కిన్ = కి; కానిక = బహుమతి; కాన్ = అగునట్లు; సమర్పించెన్ = ఇచ్చెను; అట = అంతకు; మున్న = పూర్వము; హరి = కృష్ణుని; వెంటన్ = కూడా; వచ్చినన్ = వచ్చినట్టి; వారలు = జనులు; బిలంబు = గుహ; వాకిటన్ = గుమ్మం ముందు; పండ్రెండు = పన్నెండు; దినంబులున్ = రోజులపాటు; హరి = కృష్ణుని; రాక = వచ్చుట; కిన్ = కు; ఎదురుచూచి = ప్రతీక్షించి; వేసరి = విసిగిపోయి; వగచి = దుఃఖించి; పురంబున్ = నగరమున; కున్ = కు; చనిరి = వెళ్ళిపోయిరి; అంతన్ = అంతట; దేవకీ = దేవకీదేవి; వసుదేవులును = వసుదేవుడు; రుక్మిణియునున్ = రుక్మిణీదేవి; మిత్ర = హితులు; బంధు = బంధువులు; ఙ్ఞాతి = ఙ్ఞాతులు; జనులున్ = ప్రజలు; గుహన్ = బిలమునందు; చొచ్చి = ప్రవేశించి; కృష్ణుండు = కృష్ణుడు; రాక = తిరిగిరాలేక; చిక్కెను = చిక్కుబడిపోయెను; అని = అని; శోకించి = దుఃఖించి.

భావము:

అలా శ్రీకృష్ణుడు చెప్పడంతో. జాంబవంతుడు సంతోషించి, శమంతకమణిని ఆ మణితోపాటే తన కుమార్తె అయిన జాంబవతి అనే పేరు కల కన్యకామణిని తెచ్చి హరికి కానుకగా ఇచ్చాడు. అక్కడ శ్రీకృష్ణుడితో పాటు వచ్చి గుహద్వారం దగ్గర నిలచిన వారందరూ పన్నెండు రోజులు శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూసి, వేసారి, దుఃఖించి, ద్వారకకు తిరిగివెళ్ళారు. దేవకీ వసుదేవులు రుక్మిణి తక్కిన బంధుమిత్రులు దాయాదులు గుహలో ప్రవేశించిన కృష్ణుడు తిరిగిరా నందుకు శోకించి...