పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సకలరాజుల శిక్షించుట

  •  
  •  
  •  

10.2-1114-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు మహనీయతేజోనిధియైన మాధవు దయాపరిలబ్ధనిఖిల వస్తువిస్తారుం డయ్యును, నిజాధికారశుద్ధికొఱకు మరలఁ గన్యారత్నంబును, వినూత్నరత్నవ్రాతంబును సమర్పించె; నని భూసుర విసరంబులు వినుతింప మా తండ్రియైన బృహత్సేనుండు నన్నును సమస్త వస్తువులను గృష్ణునకు సమర్పించి, క్రమంబున సకల యాదవులనుం బూజించి మరలి నిజపురంబునకుం జనియె” నని చెప్పినఁ గుంతియు గాంధారియుఁ గృష్ణయు, నఖిల నృపాలకాంతాజనంబులును, గోపికలుం దమతమ మనంబుల సర్వభూతాంతర్యామియు, లీలామానుష విగ్రహుండును నైన పుండరీకాక్ష చరణారవింద స్మరణానంద పరవశలై కృష్ణుం బ్రశంసించి; రంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; మహనీయ = గొప్ప; తేజస్ = తేజస్సునకు; నిధి = ఉనికిపట్టు; ఐన = అయిన; మాధవున్ = కృష్ణుని; దయా = కృపచేత; పరిలబ్ధ = చక్కగా లభించిన; నిఖిల = సర్వ; వస్తు = పదార్థముల; విస్తారుండు = సమృద్ధి కలవాడు; అయ్యునున్ = అయినప్పటికి; నిజ = తన; అధికార = యోగ్య బాధ్యత; శుద్ధి = పవిత్రముగా చేయుట; కొఱకు = కోసము; మరలన్ = తిరిగి; కన్యా = యువతులలో; రత్నంబును = ఉత్తమురాలను; వినూత్న = సరికొత్త; రత్న = మణుల; వ్రాతంబును = సమూహమును; సమర్పించెను = ఇచ్చెను; అని = అని చెప్పి; భూసుర = విప్ర; విసరంబులు = సమూహములు; వినుతింపన్ = స్తుతించగా; మా = మా; తండ్రి = నాన్నగారు; ఐన = అయిన; బృహత్సేనుండు = బృహత్సేనుడు; నన్నును = నన్ను; సమస్త = ఎల్ల; వస్తువులనున్ = వస్తువులను; కృష్ణున్ = కృష్ణుని; కున్ = కి; సమర్పించి = ఇచ్చి; క్రమంబునన్ = పద్ధతి ప్రకారముగా; సకల = ఎల్ల; యాదవులన్ = యాదవులను; పూజించి = సన్మానించి; మరలి = వెనుదిరిగి; నిజ = తన; పురంబున్ = పట్టణమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; అని = అని; చెప్పినన్ = చెప్పగా; కుంతియున్ = కుంతీదేవి; గాంధారియున్ = గాంధారీదేవి; కృష్ణయున్ = ద్రౌపది; అఖిల = ఎల్ల; నృపాలకాంతా = రాణులు {నృపాలకాంతలు - రాజుల భార్యలు, రాణులు}; జనంబులును = సమూహములు; గోపికలున్ = గొల్లస్త్రీలు; తమతమ = వారివారి; మనంబులన్ = మనస్సులలో; సర్వ = ఎల్ల; భూతా = జీవుల; అంతర్యామి = లోపల వ్యాపించు వానిని; లీలా = క్రీడార్థము; మానుష = మానవ; విగ్రహుండును = స్వరూపము కలవాడు; ఐన = అయిన; పుండరీకాక్ష = కృష్ణుని; చరణ = పాదములు అను; అరవింద = పద్మములను; స్మరణ = స్మరించుట యందలి; ఆనంద = ఆనందముతో; పరవశలు = చొక్కినవారు; ఐ = అయ్యి; కృష్ణున్ = కృష్ణుని; ప్రశంసించిరి = శ్లాఘించిరి; అంత = అంతట;

భావము:

మహా తేజోనిథి అయిన శ్రీకృష్ణుని అనుగ్రహం వలననే గొప్ప వైభవ సంపత్తులు మా నాన్నగారికి ప్రాప్తించాయి. అయినా తన అధికారానికి అనుగుణంగా కన్యారత్నంతోపాటు అనేక అనర్ఘరత్నాలను మాతండ్రి శ్రీకృష్ణుడికి సమర్పించాడు. బ్రాహ్మణోత్తములు ఆశీస్సులతో కొనియాడుతుండగా, మా తండ్రి బృహత్సేనుడు యథోచితంగా యాదవ ప్రముఖులను పూజించి తన నగరానికి తిరిగి వెళ్ళాడు." అంటూ లక్షణ తన పరిణయ వృత్తాంతాన్ని ద్రౌపదికి తెలిపింది. అంతట, గాంధారీ, కుంతీ, ద్రౌపదీ, తక్కిన రాజపత్నులూ గోపికలూ తమ తమ హృదయాలలో సర్వాంతర్యామి, లీలామానుష రూపుడు అయిన శ్రీకృష్ణుడి పాదపద్మాలను స్మరిస్తూ ఆనందంతో పరవశించారు. వాసుదేవుని ప్రస్తుతించారు. అటు పిమ్మట కొంతకాలానికి....