పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : లక్షణ ద్రౌపదీ సంభాషణంబు

  •  
  •  
  •  

10.2-1096-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యవసరంబున నేనుం బరితుష్టాంతరంగనై పరమానందవికచ వదనారవింద నగుచు,నిందిందిర సన్నిభంబులగు చికురబృందంబులు విలసదలిక ఫలకంబునం దళుకులొలుకు ఘర్మజల కణంబులం గరంగు మృగమద తిలకంపు టసలున మసలుకొనినం గరకిసలయంబున నోసరించుచు మిసమిస మను మెఱుంగుగములు గిఱికొన నెఱిగౌను వడవడ వడంక నప్పుడు మందగమనంబున.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; నేనున్ = నేనుకూడ; పరితుష్ట = తృప్తిచెందిన; అంతరంగను = మనసు కలామెను; పరమ = మిక్కిలి; ఆనంద = ఆనందముతో; వికచ = వికసించిన; వదన = ముఖము అను; అరవిందన్ = పద్మము కలామెను; ఇందిందిర = తుమ్మెదలను; సన్నిభంబులు = పోలునవి; అగు = ఐన; చికుర = ముంగురుల; బృందంబులున్ = సమూహములు; విలసత్ = ప్రకాశించుచున్న; అలికఫలకంబునన్ = నొసటిపట్టె యందు; తళుకులు = మెరుపులు; ఒలుకు = వ్యాపించెడి; ఘర్మ = చెమట; జల = నీటి; కణంబులన్ = బిందువులను; కరంగు = కరగిపోవుచున్న; మృగమద = కస్తూరి; తిలకము = తిలకపు; అసలునన్ = ముద్దకు; మసలుకొనినన్ = అంటుకొనగా; కర = చేయి అను; కిసలయంబునన్ = చిగురులతో; ఓసరించుచున్ = తొలగించుచు; మిసమిస = మిసమిస; అను = అనెడి; మెఱుంగు = మెరుపుల; గములు = సమూహములు; గిఱికొనన్ = ఆవరింపగా; నెఱి = నిండైన; కౌను = నడుము; వడవడ = వడవడ అని; వడకన్ = వణుకుతుండగా; అప్పుడు = అప్పుడు; మంద = మెల్లని; గమనంబునన్ = నడకతో.

భావము:

అప్పుడు నాకు పరమానందం కలిగింది. ఒళ్ళంతా చెమర్చింది. చెమటకి తడిసి కరగిన నా నుదుటి కస్తూరితిలకంలో ముంగురులు అతుక్కున్నాయి. వాటిని నా మృదువైన చేతులతో సరిచేసుకుంటూ, మిసమిలలాడే నా సన్నని నడుము వడ వడ వణకుతుండగ, మందగమనంతో ముందుకు నడిచాను.