పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : లక్షణ ద్రౌపదీ సంభాషణంబు

  •  
  •  
  •  

10.2-1082-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టియెడఁ గృష్ణకథావిశేషంబులు పరితోషంబున నుగ్గడించుచుఁ బ్రసంగ వశంబున నా రుక్మిణీదేవి మొదలగు శ్రీకృష్ణుభార్యలం గనుంగొని పాంచాలి యిట్లనియె. “మిమ్ముఁ బుండరీకాక్షుండు వివాహంబయిన తెఱంగులు వినిపింపుఁడన వారును దమ పరిణయంబుల తెఱంగులు మున్ను నే నీకుం జెప్పిన విధంబున వినిపించి; రందు సవిస్తరంబుగాఁ దెలియం బలుకని మద్రరాజకన్యకా వృత్తాంతం బా మానిని పాంచాలికిం జెప్పిన విధంబు విను మని శుకుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.

టీకా:

అట్టి = అటువంటి; ఎడన్ = సమయము నందు; కృష్ణ = కృష్ణుని; కథా = వర్తన; విశేషంబులున్ = విశేషములను; పరితోషంబుననున్ = సంతోషముతో; ఉగ్గడించుచున్ = చెప్పుకొనుచు; ప్రసంగ = ప్రస్తావన; వశంబునన్ = వశముచేత; ఆ = ఆ; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; మొదలగు = మున్నగు; శ్రీకృష్ణు = శ్రీకృష్ణుని; భార్యలన్ = భార్యలను; కనుంగొని = చూసి; పాంచాలి = ద్రౌపది {పాంచాలి - పాంచాలదేశపు రాకుమారి, ద్రౌపది}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మిమ్మున్ = మిమ్ములను; పుండరీకాక్షుండు = కృష్ణుడు; వివాహంబయిన = పెండ్లాడిన; తెఱంగులున్ = విధములు; వినిపింపుడు = చెప్పండి; అనన్ = అనగా; వారునున్ = వారు; తమ = వారివారి; పరిణయంబులన్ = పెళ్ళిళ్ళుకు చెందిన; తెఱంగులున్ = విధములను; మును = మునుపు; నేన్ = నేను; నీ = నీ; కున్ = కు; చెప్పిన = చెప్పినట్టి; విధంబునన్ = విధముగ; వినిపించిరి = చెప్పిరి; అందున్ = వాటిలో; సవిస్తరంబుగా = విశదముగా; తెలియన్ = తెలియునట్లు; పలుకని = చెప్పని; మద్రరాజకన్యక = లక్షణ యొక్క {మద్రరాజకన్యక - మద్రదేశపు రాకుమారి, లక్షణ}; వృత్తాంతంబు = వర్తమానము; ఆ = ఆ; మానిని = యువతి; పాంచాలి = ద్రౌపది; కిన్ = కి; చెప్పిన = తెలిపినట్టి; విధంబున్ = విధమును; వినుము = వినుము; అని = అని; శుకుండు = శుకుడు; పరీక్షిత్ = పరీక్షిత్తు; నరేంద్రున్ = మహారాజున; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ సమయంలో ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని గాథలను సంతోషంతో చెప్తూ ఉంది. అలా చెప్తూ రుక్మిణి మొదలైన అంతఃపుర కాంతలతో. “కలువకన్నుల కన్నయ్య మిమ్మల్ని కల్యాణమాడిన కబుర్ల వివరాలు అన్నీ చెప్పండి.” అని కోరింది. ఒక్క లక్షణ తప్ప తక్కిన శ్రీకృష్ణుని భార్యలు అందరి వివాహ వృత్తాంతాలను పరీక్షిత్తూ! ఇంతకు మునుపు నేను నీకు చెప్పి ఉన్నాను కదా. వారు ఆ వివరాలే ద్రౌపదికి చెప్పారు. మద్రదేశాధిపతి బృహత్సేనుడి పుత్రి లక్షణ తనను కృష్ణుడు పరిణయ మాడిన సన్నివేశాన్ని ద్రౌపదికి చెప్పిన వివరాలు చెప్తాను, వినుము.” అని శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పసాగాడు.