పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నందాదులు చనుదెంచుట

  •  
  •  
  •  

10.2-1063-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు నమస్కృతులుసేసి, యాలింగనంబులు గావించి, నయనారవిందంబుల నానందబాష్పంబుల దొరఁగ నఱలేని స్నేహంబులు చిత్తంబుల నత్తమిల్ల నేమియుం బలుకకుండి; రంత నయ్యశోదాదేవి రామకృష్ణుల నిజాంకపీఠంబుల నునిచి యక్కునం గదియందిగిచి, చెక్కిలి ముద్దుగొని, శిరంబులు మూర్కొని, చిబుకంబులు పుడుకుచుఁ, బునఃపునరాలింగనంబులు గావించి, పరమానందంబునం బొందుచు నున్నంతఁ బదంపడి.

టీకా:

అట్లు = ఆ విధముగ; నమస్కృతులు = నమస్కరించుటలు; చేసి = చేసి; ఆలింగనములు = కౌగలింతలు; కావించి = చేసి; నయన = నేత్రములు అను; అరవిందంబులన్ = పద్మము లందు; ఆనంద = ఆనందముతోటి; బాష్పంబులన్ = కన్నీళ్ళు; తొరగన్ = కారగా; అఱలేని = అరమరికలేని, భేదము లేని; స్నేహంబులున్ = స్నేహములు; చిత్తంబులన్ = మనసు లందు; అత్తమిల్లన్ = పరవశములు కాగా; ఏమియున్ = ఏమీ; పలుకక = అనకుండా; ఉండిరి = ఉన్నారు; అంతన్ = అంతట; ఆ = ఆ; యశోదాదేవి = యశోదాదేవి; రామ = బలరాముడు; కృష్ణులన్ = కృష్ణులను; నిజ = తన; అంకపీఠంబులన్ = ఒడి అను పీఠము నందు; ఉనిచి = కూర్చుండబెట్టుకొని; అక్కునన్ = వక్షస్థలము నందు; కదియన్ = దగ్గరకు; తిగిచి = తీసుకొని; చెక్కిలి = బుగ్గలమీద; ముద్దుగొని = ముద్దుపెట్టుకొని; శిరంబులన్ = తలను; మూర్కొని = వాసనచూసి; చిబుకంబులున్ = గడ్డములు; పుడుకుచున్ = పట్టుకొనుచు; పునః = మరల; పునః = మరల; ఆలింగనంబులు = కౌగలింతలు; కావించి = చేసి; పరమ = మిక్కుటమైన; ఆనందంబునన్ = ఆనందమును; పొందుచున్నంత = పొందుతు ఉండగా; పదంపడి = పిమ్మట;

భావము:

అలా నందయశోదలకు బలరామకృష్ణులు మ్రొక్కిన పిమ్మట. వారిని కౌగలించుకుని నిండుగా స్నేహభావాలు, భక్త్యనురాగాలు పెల్లుబికి కనుల వెంట అనందబాష్పాలు పొంగిపొరలగా మాటలురాక మౌనంగా ఉన్నారు. అంతట, యశోదాదేవి బలరామకృష్ణులను ఒడిలో కుర్చుండపెట్టుకున్నది; వారిని తన గుండెలకు హత్తుకున్నది; చెక్కిలి ముద్దాడింది; మూర్ధం ఆఘ్రాణించింది; చిబుకాలు నిమురుతూ పలుమార్లు కౌగలించుకొని పరమానందం పొందింది. ఆ తరువాత