పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : అటుకు లారగించుట

  •  
  •  
  •  

10.2-1031-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠులైన సజ్జనులు లేశమాత్రంబగు పదార్థంబైన భక్తి పూర్వకంబుగా సమర్పించిన నది కోటిగుణితంబుగాఁ గైకొని మన్నించుటకు నిదియ దృష్టాంతంబు గాదె! మలిన దేహుండును, జీర్ణాంబరుండు నని చిత్తంబున హేయంబుగాఁ బాటింపక నా చేనున్న యడుకు లాదరంబున నారగించి నన్నుం గృతార్థునిం జేయుట యతని నిర్హేతుక దయయ కాదె! యట్టి కారుణ్యసాగరుండైన గోవిందుని చరణారవిందంబుల యందుల భక్తి ప్రతిభవంబునఁ గలుగుంగాక!” యని యప్పుండరీకాక్షుని యందుల భక్తి తాత్వర్యంబునం దగిలి పత్నీసమేతుండై నిఖిల భోగంబులయందు నాసక్తిం బొరయక, రాగాది విరహితుండును నిర్వికారుండును నై యఖిలక్రియలందు ననంతుని యనంత ధ్యాన సుధారసంబునం జొక్కుచు విగత బంధనుండై యపవర్గ ప్రాప్తి నొందె; మఱియును.

టీకా:

అట్టి = అటువంటి; పురుషోత్తముండు = కృష్ణుడు {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; భక్తి = భక్తి యందు; నిష్ఠులు = నిష్ఠ కలవారు; ఐన = అయిన; సజ్జనులు = సత్పురుషులు; లేశమాత్రంబు = రవ్వంత; అగు = ఐన; పదార్థంబు = వస్తువు; ఐనన్ = అయినప్పటికి; భక్తి = భక్తి; పూర్వకంబు = తోకూడినది; కాన్ = అగునట్లు; సమర్పించినన్ = ఇచ్చినట్లైతే; అది = దానిని; కోటి = వందలక్షలు (1,00,00,000); గుణితంబు = రెట్లు; కాన్ = ఐనట్లు; కైకొని = పరిగ్రహించి; మన్నించుట = మన్ననచేయు ననుట; కున్ = కు; ఇదియ = ఇదే; దృష్టాంతంబు = ఉదాహరణ; కాదె = కాదా, అవును; మలిన = మాసిపోయిన; దేహుండును = శరీరము కలవాడు; జీర్ణ = చిరిగిపోయిన; అంబరుండును = బట్టలు కట్టుకున్నవాడు; అని = అని; చిత్తంబునన్ = మనస్సు నందు; హేయంబుగాన్ = రోతగా; పాటింపక = తలపక; నా = నా; చేన్ = చేతిలో; ఉన్న = ఉన్నట్టి; అడుకులున్ = అటుకులను; ఆదరంబునన్ = మన్ననతో; ఆరగించి = తిని; నన్నున్ = నన్ను; కృతార్థునిన్ = ధన్యునిగా; చేయుట = చేయుట; అతని = అతని యొక్క; నిర్హేతుక = అకారణమైన; దయయ = కృపయే; కాదె = కాదా, అవును; అట్టి = అటువంటి; కారుణ్య = దయకు; సాగరుండు = సముద్రమువంటివాడు; ఐన = అయిన; గోవిందుని = కృష్ణుని; చరణ = పాదములను; అరవిందంబులన్ = పద్మముల; అందులన్ = ఎడలి; భక్తి = భక్తి; ప్రతి = ప్రతీ ఒక్క; భవంబునన్ = జన్మ యందు; కలుగుంగాక = కలగవలెను; అని = అని; ఆ = ఆ; పుండరీకాక్షున్ = కృష్ణుని; అందులన్ = ఎడల; భక్తి = భక్తి; తాత్పర్యంబులన్ = భావన లందు; తగిలి = లగ్నమై; పత్నీ = భార్యతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; నిఖిల = సర్వ; భోగంబుల = సౌఖ్యముల; అందున్ = లోను; ఆసక్తిన్ = ఆపేక్ష యందు; పొరయక = పొర్లక, పొందకుండ; రాగ = తగులములు; విరహితుండును = లేనివాడు; నిర్వికారుండునున్ = వికారము లేని వాడు; ఐ = అయ్యి; అఖిల = సమస్తమైన; క్రియలు = పనులు; అందున్ = లోను; అనంతుని = కృష్ణుని {అనంతుడు - దేశ కాల వస్తు భేదము లందును అంతము లేని వాడు, విష్ణువు}; అనంత = ఎడతెగని; ధ్యాన = ధ్యానించుటలోని; సుధారసంబునన్ = అమృతము నందు; చొక్కుచు = సోలుతు; విగత = తొలగిన; బంధనుడు = బంధనములు కలవాడు; ఐ = అయ్యి; అపవర్గప్రాప్తిన్ = మోక్షమును {అపవర్గప్రాప్తి - పరలోకము లభించుట, మోక్షము}; ఒందెన్ = పొందెను; మఱియును = ఇంకను.

భావము:

భగవంతుడు, భక్తితత్పరులైన సజ్జనులు సమర్పించిన వస్తువు రవ్వంతే అయినా దానిని కోటానుకోట్లుగా స్వీకరించి, భక్తులను అనుగ్రహిస్తాడు అనడానికి నా వృత్తాంతమే తార్కాణం. మాసిన నా శరీరాన్ని చినిగిన బట్టలను చూసి శ్రీకృష్ణుడు మనస్సులో నైనా ఏవగించుకోలేదు. నా దగ్గర ఉన్న అటుకులను ప్రీతిగా ఆరగించాడు. నన్ను ధన్యుణ్ణి చేయడం దామోదరుని నిర్హేతుకవాత్సల్యం మాత్రమే. అంతటి కరుణాసాగరుడైన గోవిందుని పాదారవిందాల మీద నాకు నిండైన భక్తి నెలకొని ఉండు గాక.” అని ఈ మాదిరి తలుస్తూ హరిస్మరణం మరువకుండా కుచేలుడు తన ఇల్లాలితో కలసి జీవించాడు. భోగాలపై ఆసక్తి లేకుండా, రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారస వాహినిలో ఓలలాడుతూ, భవబంధాలను బాసి మోక్షాన్ని అందుకున్నాడు. మఱియును...