పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : అటుకు లారగించుట

  •  
  •  
  •  

10.2-1019-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీనిధి యిట్లు నన్నుఁ బచరించి ఘనంబుగ విత్త మేమియు
న్నీని తెఱంగు గానఁబడె; నెన్న దరిద్రుఁడు సంపదంధుఁడై
కాక తన్నుఁ జేరఁ డని కాక శ్రితార్తి హరుండు సత్కృపాం
భోనిధి సర్వవస్తుపరిపూర్ణునిఁగా ననుఁ జేయకుండునే? "

టీకా:

శ్రీనిధి = కృష్ణుడు {శ్రీనిధి - సంపదలకు నిలయమైనవాడు, కృష్ణుడు}; ఇట్లు = ఈ విధముగా; నన్నున్ = నన్ను; పచరించి = గౌరవించి; విత్తము = ధనము, డబ్బులు; ఏమియున్ = ఏమికూడ; ఈని = ఇవ్వని; తెఱంగు = విధము; కానబడెన్ = కనబడుతున్నది; ఎన్నన్ = తరచిచూడగా; దరిద్రుడు = పేదవాడు; సంపద = సంపదలచేత; అంధుడు = కళ్ళు కనబడనివాడు; ఐ = అయ్యి; కానక = తెలిసికొనలేక; తన్నున్ = తనను; చేరడు = ఆశ్రయించడు; అని = అని; కాక = తప్పించి; శ్రిత = ఆశ్రయించినవారి; ఆర్తిన్ = ఆర్తిని; హరుండు = తొలగించువాడు; సత్ = మిక్కిలి; కృపా = దయకు; అంభోనిధి = సముద్రుడు; సర్వ = సమస్తమైన; వస్తు = పదార్థములు; పరిపూర్ణునిన్ = సమృద్ధిగా కలవాని; కాన్ = ఔనట్లు; ననున్ = నన్ను; చేయకుండునె = చేయకుండా ఉండునా.

భావము:

మహా సంపన్నుడు అయిన శ్రీకృష్ణుడు నన్ను గొప్పగా సత్కరించాడు. కానీ దరిద్రుడుకి సంపదలు లభిస్తే గర్వాంధుడై తనను సేవించడని కాబోలు ధనము మాత్రం ఏమీ ఇవ్వలేదు అనుకుంటాను. లేకపొతే ఆశ్రితజనుల ఆర్తిని బాపే అంబుజాక్షుడు, అపార కృపా సముద్రుడు, నాకు సకల సంపదలు అనుగ్రహించకుండా ఉంటాడా?”