పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : అటుకు లారగించుట

  •  
  •  
  •  

10.2-1017-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రికింపఁ గృపణస్వభావుండ నై నట్టి-
యే నేడ? నిఖిలావనీశ్వరి యగు
నిందిరాదేవికి నెనయంగ నిత్య ని-
వాసుఁడై యొప్పు న వ్వాసుదేవుఁ
డే? న న్నర్థిమైఁ దోడఁబుట్టిన వాని-
కైవడిఁ గౌఁగిటఁ దియఁ జేర్చి
దైవంబుగా నన్ను భావించి నిజతల్ప-
మున నుంచి సత్క్రియల్‌ పూనినడపి

10.2-1017.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చారు నిజవధూ కరసరోజాత కలిత
చామరానిలమున గతశ్రమునిఁ జేసి
శ్రీకుచాలిప్త చందనాంచితకరాబ్జ
లములను నడ్గు లొత్తె వత్సలత మెఱసి.

టీకా:

పరికింపన్ = తరచిచూసినచో; కృపణ = లోభపూరితమైన; స్వభావుండన్ = లక్షణములు కలవాడను; ఐన = అయినట్టి; ఏన్ = నేను; ఏడన్ = ఎక్కడ; నిఖిల = సమస్తమైన; అవనీ = లోకములకు; ఈశ్వరి = సర్వనియామకురాలు; అగు = ఐన; ఇందిరాదేవి = లక్ష్మీదేవి; కిన్ = కి; ఎనయంగన్ = పొందికగా; నిత్య = శాశ్వతమైన; నివాసుడు = నివాసస్థానమైనవాడు; ఐ = అయ్యి; ఒప్పు = ఉండెడి; ఆ = ఆ; వాసుదేవుడు = కృష్ణుడు; ఏడన్ = ఎక్కడ; అర్థిమైన్ = ప్రీతితో; తోడబుట్టిన = సహోదరుడైన; వాని = అతని; కైవడిన్ = వలె; కౌగిటన్ = కౌగిట్లో; కదియన్ = దగ్గరకు; చేర్చి = తీసుకొని; దైవంబు = దేవుని; కాన్ = ఐనట్లు; నన్నున్ = నన్ను; భావించి = అనుకొని; నిజ = తన; తల్పమునన్ = పాన్పుపైన; ఉంచి = కూర్చుండపెట్టి; సత్క్రియల్ = మర్యాదలు; పూని = పట్టుగా; నడపి = జరిపించి.
చారు = మనోజ్ఞమైన; నిజ = తన; వధూ = భార్య యొక్క; కర = చేయి అను; సరోజాత = పద్మమునందు; కలిత = ఉన్నట్టి; చామర = వింజామర, విసనకఱ్ఱ; అనిలమునన్ = గాలి వలన; గత = తొలగిన; శ్రముని = శ్రమకలవానిని; చేసి = చేసి; శ్రీ = లక్మీ అంశయైన రుక్మిణి; కుచ = స్తనములందు; ఆలిప్త = పూయబడిన; చందన = మంచిగంధముచేత; అంచిత = అలంకరింపబడిన; కర = చేతులను; అబ్జములను = కమలములచేత; అడ్గులు = కాళ్ళు, అడుగులు; ఒత్తెన్ = పిసికెను; వత్సలతన్ = ప్రేమతో; మెఱసి = అతిశయించి.

భావము:

మందుడను అయిన నే నెక్కడ? లక్ష్మికి నిత్యనివాస మైన వాసుదేవు డెక్కడ? అచ్యుతుడు అనురాగంతో నన్ను తన తోడబుట్టినవాడిలా కౌగిట చేర్చాడు. దేవుడితో సమానమైన వాడిలా భావించి తన పానుపు మీద కూర్చోబెట్టుకున్నాడు. పూని నన్ను గొప్పగా సత్కరించాడు. ఆయన పట్టపుదేవి రుక్మిణీదేవి నాకు వింజామర వీచింది. నా శ్రమను పోగొట్టింది. అతిశయించిన వాత్సల్యంతో శ్రీకృష్ణుడే సాక్షాత్తూ లక్ష్మీదేవిని లాలించే తన చందనాలు అలదిన పాణిపల్లవాలతో ఆప్యాయంగా నా పాదా లొత్తాడు.