పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : అటుకు లారగించుట

  •  
  •  
  •  

10.2-1012-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అవ్విప్రుండు సనుదెంచిన కార్యంబు కృష్ణుండు దన దివ్యచిత్తంబున నెఱింగి “యితండు పూర్వభవంబున నైశ్వర్యకాముండై నన్ను సేవింపండైన నిక్కుచేలుండు నిజకాంతాముఖోల్లాసంబుకొఱకు నా యొద్దకుఁ జనుదెంచిన వాఁ; డితనికి నింద్రాదులకుం బడయ రాని బహువిధంబులైన సంపద్విశేషంబు లీక్షణంబ యొడఁగూర్పవలయు” నని తలంచి యతండు జీర్ణవస్త్రంబు కొంగున ముడిచి తెచ్చిన యడుకుల ముడియఁ గని “యిది యేమి” యని యొయ్యన నమ్ముడియఁ దనకరకమలంబుల విడిచి యయ్యడుకులు కొన్ని పుచ్చుకొని “యివియ సకల లోకంబులను, నన్నును బరితృప్తిం బొందింపఁ జాలు” నని యప్పుడు.

టీకా:

ఆ = ఆ; విప్రుండు = బ్రాహ్మణుడు; చనుదెంచిన = వచ్చిన; కార్యంబున్ = పని; కృష్ణుండు = కృష్ణుడు; తన = తన; దివ్య = దివ్యమైన; చిత్తంబునన్ = మనసు నందు; ఎఱింగి = తెలిసి; ఇతండు = ఇతను; పూర్వ = ముందటి; భవంబునన్ = జన్మము నందు; ఐశ్వర్యకాముండు = సంపదలు కోరినవాడు; ఐ = అయ్యి; నన్నున్ = నన్ను; సేవింపండు = సేవించినవాడు కాడు; ఐన = అయినట్టి; ఈ = ఈ; కుచేలుండు = కుచేలుడు; నిజ = తన; కాంతా = భార్య యొక్క; ముఖ = ముఖమున; ఉల్లాసంబు = సంతోషము; కొఱకున్ = కోసము; నా = నా; ఒద్ద = దగ్గర; కున్ = కు; చనుదెంచినాడు = వచ్చాడు; ఇతని = ఇతని; కిన్ = కి; ఇంద్ర = ఇంద్రుడు; ఆదుల = మున్నగువారి; కున్ = కి; పడయరాని = పొందలేని; బహు = పెక్కు; విధంబులు = విధములు; ఐన = అయిన; సంపత్ = సంపదల; విశేషంబులున్ = అధికములు కలుగుట; ఈ = ఈ; క్షణంబు = క్షణములోనే; ఒడగూర్పన్ = కలుగజేయవలెను; అని = అని; తలంచి = అనుకొని, ఆలోచించి; అతండు = అతను; జీర్ణ = శిధిలమౌతున్న; వస్త్రంబున్ = బట్ట యొక్క; కొంగునన్ = మూల యందు; ముడిచి = ముడివేసి; తెచ్చిన = తీసుకు వచ్చినట్టి; అడుకులున్ = అటుకులను; ముడియన్ = మూటను; కని = చూసి; ఇది = ఇది; ఏమి = ఏమిటి; అని = అని; ఒయ్యనన్ = మెల్లిగా; ఆ = ఆ; ముడియన్ = ముడిని; తన = తన యొక్క; కర = చేతులు అను; కమలంబులన్ = కమలములతోటి; విడిచి = విప్పి; ఆ = ఆ; అడుకులున్ = అటుకులను; కొన్ని = కొన్నిటిని; పుచ్చుకొని = తీసుకొని; ఇవియ = ఇవే; సకల = ఎల్ల; లోకంబులను = లోకములను; నన్నున్ = నన్ను; పరితృప్తిం = సంతృప్తి; పొందింపన్ = పొందించుటకు; చాలును = సరిపడును; అని = అని; అప్పుడు = అప్పుడు.

భావము:

కుచేలుడు వచ్చిన కారణాన్ని శ్రీకృష్ణుడు గ్రహించాడు. పూర్వజన్మ నుండి ఇతడు ఐశ్వర్యాన్ని కోరి నన్ను సేవించినవాడు కాదు. ఇప్పుడు తన భార్య సంతోషం కోసం నా దగ్గరకు వచ్చాడు. కావున ఇంద్రాదులకు సైతం లభించని సకల సంపదల్ని ఈక్షణమే ఇతనికి ఇవ్వాలని భగవంతుడు భావించాడు. తన చినిగిన ఉత్తరీయంలో ముడివేసి కుచేలుడు తీసుకువచ్చిన అటుకులను చూసి, కృష్ణుడు ఆలా అన్నాడు. ఇదేమిటి అని అడుగుతూ ముడి విప్పి అటుకులు గుప్పెడు తీసుకున్నాడు, “నాకూ సమస్త లోకాలకూ సంతృప్తి కలిగించడానికి ఇవి చాలు.” అంటూ కృష్ణుడు ఆ అటుకుల్ని ఆరగించాడు.