పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : గురుప్రశంస చేయుట

  •  
  •  
  •  

10.2-1009-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని సమస్త భావాభిజ్ఞుండైన పుండరీకాక్షుండు మందస్మితవదనారవిందుం డగుచు నతనిం జూచి “నీవిచ్చటికి వచ్చునప్పుడు నాయందుల భక్తింజేసి నాకు నుపాయనంబుగ నేమి పదార్థంబు దెచ్చితి? వప్పదార్థంబు లేశమాత్రంబైనఁ బదివేలుగా నంగీకరింతు; నట్లుగాక నీచవర్తనుండై మద్భక్తిం దగులని దుష్టాత్ముండు హేమాచలతుల్యంబైన పదార్థంబు నొసంగిన నది నా మనంబునకు సమ్మతంబు గాదు; కావున.

టీకా:

అని = అని; సాభిప్రాయంబుగాన్ = సాభిప్రాయముగా; పలికిన = చెప్పిన; పలుకులు = మాటలు; విని = విని; సమస్త = ఎల్లవారి; భావ = అభిప్రాయములు; అభిఙ్ఞుండు = తెలిసినవాడు; ఐన = అయిన; పుండరీకాక్షుండు = కృష్ణుడు; మందస్మిత = చిరునవ్వు గల; వదన = మోము అను; అరవిందుండు = పద్మములు కలవాడు; అగుచున్ = ఔతు; అతనిన్ = అతనిని; చూచి = చూసి; నీవు = నీవు; ఇచ్చటి = ఇక్కడ; కి = కి; వచ్చునప్పుడు = వచ్చేటప్పుడు; నా = నా; అందుల = ఎడల; భక్తిన్ = భక్తిచేత; నా = నా; కున్ = కు; ఉపాయనంబు = కానుక; కన్ = అగునట్లు; ఏమి = ఏ; పదార్థంబున్ = పదార్థమును; తెచ్చితి = తీసుకొని వచ్చావు; ఆ = ఆ; పదార్థంబున్ = వస్తువును; లేశమాత్రంబు = రవ్వంత; ఐనన్ = అయినను; పదివేలు = పదివేలు (10000); కాన్ = ఐనట్లు; అంగీకరింతున్ = గ్రహించెదను; అట్లుగాక = అలాకాకుండా; నీచ = అల్పబుద్ధికల; వర్తనుడు = నడవడిక కలవాడు; మత్ = నా యొక్క; భక్తిన్ = భక్తి యందు; తగులని = ఆసక్తి లేని; దుష్టాత్ముండు = దుష్టుడు; హేమా = బంగారపు; అచల = కొండ; తుల్యంబు = అంత; ఐనన్ = అయినట్టి; పదార్థంబున్ = వస్తువును; ఒసంగినన్ = ఇచ్చినను; అది = అది; నా = నా; మనంబున్ = మనస్సున; కున్ = కు; సమ్మతంబు = అంగీకారము; కాదు = కాదు; కావునన్ = కాబట్టి.

భావము:

గోవిందుడు సకల ప్రాణుల మనసులోని భావాలను ఎరిగిన వాడు, కనుక సాభిప్రాయంగా కుచేలుడు పలికిన ఈ పలుకులలోని అంతర్యాన్ని గ్రహించాడు. మందస్మిత వదనారవిందుడై కుచేలుడితో “నీ విక్కడికి వస్తూ నా కోసం ఏమి తెచ్చావు? ఆ వస్తువు లేశమైనా పదివేలుగా స్వీకరిస్తాను. నాపై భక్తి లేని నీచుడు మేరుపర్వత మంత పదార్థం ఇచ్చినా, అది నాకు అంగీకారం కాదు. అందుచేత...