పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బలుడు పల్వలుని వధించుట

 •  
 •  
 •  

10.2-943-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నమునం జరించు సురకంటకు కంఠము చేఁతినాగటం
గిలిచి రోఁక లెత్తి బెడిదం బడరన్ నడునెత్తి మొత్తినన్
బుబుగ నెత్తు రొల్క నిలఁ బోరగిలం బడె వజ్రధారచేఁ
దెగి ధరఁ గూలు భూరి జగతీధరముం బురుడింప బెట్టుగాన్.

టీకా:

గగనమునన్ = ఆకాశము నందు; చరించు = తిరుగుతున్న; సురకంటకున్ = రాక్షసుని; కంఠమున్ = కంఠమును; చేతి = చేతిలో నున్న; నాగటన్ = నాగలితో; తగిలిచి = తగిలించి; రోకలిన్ = రోకలిని; ఎత్తి = పైకెత్తి; బెడిదంబు = కఠినత్వము; అడరన్ = అతిశయించగా; నడునెత్తిని = నడినెత్తిమీద; మొత్తినన్ = మోదగా; బుగబుగన్ = బుగబుగ మని; నెత్తురు = రక్తము; ఒల్కన్ = కారుతుండగా; ఇలన్ = నేలపై; బోరగిలన్ = బోర్లా {బోరగిలపడుట - బోర (పొట్ట) కిందపడేలా పడుట, బోర్లాపడుట}; పడెన్ = పడిపోయెను; వజ్ర = వజ్రాయుధము; ధార = అంచుల; చేన్ = చేత; తెగి = రెక్కలు తెగి; ధరన్ = నేలపై; కూలు = పడిపోవు; భూరి = అతి పెద్దవైన; జగతీధరమున్ = పర్వతమును; పురుడింపన్ = పోలుచుండగా; బెట్టుగాన్ = భయంకరముగా.

భావము:

ఆకాశంలో సంచరిస్తున్న దేవతల పాలిటి పీడగా ఉన్న పల్వలుడి కంఠానికి నాగలిని తగిలించి క్రిందకు లాగి, బలరాముడు రోకలితో వాడి నడినెత్తి మీద బలంగా మొత్తాడు. ఆ దెబ్బకు ఇంద్రుని వజ్రాయుధం వేటుకు విరిగిపడే పర్వతంలాగ, పల్వలుడు బుగబుగ నెత్తురు కక్కుకుంటూ భూమిపై బోరగిలా పడ్డాడు.

10.2-944-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అట్లు పల్వలుండు మడిసిన.

టీకా:

అట్లు = అలా; పల్వలుండు = పల్వలుడు; మడిసినన్ = చావగా.

భావము:

ఆ విధంగా పల్వలుడు నేలకూలడం చూసి.

10.2-945-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మునివరులు గామపాలుని
వినుతించిరి వేయువేల విధముల వృత్రుం
దునిమిన యింద్రుని నమరులు
వినుతించిన రీతి నపుడు విమలచరిత్రా!

టీకా:

ముని = ముని; వరులు = ఉత్తములు; కామపాలుని = బలరాముని; వినుతించిరి = స్తుతించిరి; వేయువేల = బహు {వేయువేలు - వెయ్యివెయ్యిలు, పదిలక్షలు, (1,000,000)లు}; విధములన్ = విధములుగా; వృత్రున్ = వృత్రాసురుని; తునిమిన = చంపిన; ఇంద్రుని = ఇంద్రుడిని; అమరులు = దేవతలు; వినుతించిన = స్తుతించిన; రీతిన్ = విధముగా; అపుడు = అప్పుడు; విమలచరిత్రా = నిర్మల వర్తన కలవాడ.

భావము:

వృత్రాసురుడిని సంహరించిన దేవేంద్రుడిని దేవతలు అందరు స్తుతించిన విధంగా మును లందరూ బలరాముణ్ణి అనేక విధములుగా స్తుతించారు

10.2-946-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత నభిషిక్తుఁ జేసి యత్యంత సురభి
మంజులామ్లాన కంజాత మాలికయును
నంచితాభరణములు దివ్యాంబరములు
ర్థి నిచ్చినఁ దాల్చి యా లధరుండు.

టీకా:

అంతన్ = పిమ్మటన్; అభిషిక్తున్ = అభిషేకింపబడినవానిగా {అభిషేకము - స్నానము చేయించుట}; చేసి = చేసి; అత్యంత = మిక్కుటమైన; సురభి = పరిమళము కల; మంజుల = మనోజ్ఞమైన; అమ్లాన = వాడని; కంజాత = తామరపూల; మాలికయునున్ = దండ; అంచిత = చక్కటి; ఆభరణములున్ = అలంకారములు; దివ్య = దివ్యమైన; అంబరములు = వస్త్రములు; అర్థిన్ = ప్రీతితో; ఇచ్చినన్ = ఇవ్వగా; తాల్చి = ధరించి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; హలధరుండు = బలరాముడు.

భావము:

మునులు బలరాముడిని పవిత్ర తీర్ధజలాలతో అభిషిక్తుణ్ణి చేసారు. సుగంధాలు విరజిమ్మే సుందర సుకుమార పద్మమాలికతో అలంకరించారు. చక్కని ఆభరణాలనూ ప్రశస్తములైన వస్త్రాలనూ ప్రీతితో ఇచ్చారు బలరాముడు వాటిని ధరించాడు.

10.2-947-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దేవేంద్రుఁ బోలి యొప్పెను
ధీవిలసితుఁ డగుచు మునితతిన్ వీడ్కొని తన్
సేవించుచుఁ గతిపయ వి
ప్రాలి సనుదేరఁ గౌశికాఖ్యంబునకున్.

టీకా:

దేవేంద్రున్ = దేవేంద్రుని; పోలి = వలె; ఒప్పెను = చక్కగా ఉండెను; ధీవిలసితుడు = ప్రతిభావంతుడు; అగుచున్ = ఔతు; ముని = మునుల; తతిన్ = సమూహము; వీడ్కొని = సెలవు తీసుకొని; తన్ = తనను; సేవించుచున్ = కొలుచుచు; కతిపయ = కొంతమంది; విప్ర = బ్రాహ్మణ; అవలి = సమూహము; చనుదేర = రాగా; కౌశిక = కౌశిక తీర్థంబు; ఆఖ్యంబున = పేరు కలదాని {ఆఖ్యంబు + కున్ = ఆఖ్యంబునకున్. నుగాగమ సంధి... కున్ పరమగుట వలన నుగామమయింది. }; కున్ = కి.

భావము:

ఆ ప్రతిభావంతుడైన బలరాముడు అనంతరం దేవేంద్రుడిలా ప్రకాశిస్తూ మునులవద్ద వీడ్కొని బ్రాహ్మణులు కొందరు వెంటరాగా కౌశికి అనే నదికి వెళ్ళి....

10.2-948-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చని యమ్మహానదిం గృతస్నానుండై యచ్చోటు వాసి సరయువు నందుఁ గ్రుంకులిడి ప్రయాగ నవగాహనంబు సేసి దేవర్షి పితృతర్పణంబు లాచరించి పులస్త్యాశ్రమంబు సొచ్చి గోమతిం దర్శించి గండకీనది నుత్తరించి విదళితభవపాశయగు విపాశయందుఁదోఁగి శోణనదంబున నాప్లావితుండై గయనాడి గంగాసాగరసంగమంబు దర్శించి మహేంద్రనగంబున కరిగి.

టీకా:

చని = వెళ్ళి; ఆ = ఆ; మహా = పెద్ద; నదిన్ = నది యందు; కృతస్నానుండు = స్నానము చేసినవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; చోటున్ = స్థలమును; పాసి = విడిచి; సరయువున్ = సరయూనది అందు; క్రుంకులు = స్నానము; ఇడి = చేసి; ప్రయాగన్ = ప్రయాగ (త్రివేణీసంగమం); అవగాహనము = స్నానము; చేసి = చేసి; దేవ = దేవతలకు; ఋషి = ఋషులకు; పితృ = పితృదేవతలకు; తర్పణంబులు = తర్పణలు; ఆచరించి = చేసి; పులస్త్య = పులస్త్యుని; ఆశ్రమంబున్ = ఆశ్రమమును; చొచ్చి = ప్రవేశించి; గోమతిన్ = గోమతీనదిని; దర్శించి = చూసి; గండకీనదిన్ = గండకీనదిని; ఉత్తరించి = దాటి; విదళిత = తెంపబడిన; భవ = సంసార; పాశ = పాశములు కలిగించునది; అగు = ఐన; విపాశ = విపాశనది; అందున్ = లో; తోగి = స్నానముచేసి; శోణనదంబునన్ = శోణ అను నదమును {నదము - పడమర వైపు ప్రవహించు పెద్ద యేరు}; ఆప్లావితుండు = స్నానము చేసినవాడు; ఐ = అయ్యి; గయన్ = గయాక్షేత్రము నందు; ఆడి = స్నానముచేసి; గంగా = గంగానది; సాగర = సముద్రమున; సంగమంబు = కలియుచోటును; దర్శించి = చూసి; మహేంద్రనగంబున్ = మహేంద్రగిరికి; అరిగి = వెళ్ళి.

భావము:

ఆ మహానదికౌశికీలో బలరాముడు స్నానం చేసాడు. అక్కడ నుండి బయలుదేరి సరయూనదిలోను స్నానం చేసి, పిమ్మట ప్రయాగలో స్నానం చేసాడు. దేవర్షి పితృతర్పణాలు కావించాడు. అటు తరువాత పులస్త్యాశ్రమం ప్రవేశించాడు. అటుపిమ్మట గోమతిని దర్శించి గండకీనదిని దాటి పరమపావని అయిన విపాశలో స్నానంచేసి, శోణనదిలోనూ తర్వాత గయలోనూ స్నానమాడి గంగాసాగరసంగమం సందర్శించి. పిమ్మట బలరాముడు మహేంద్రపర్వతం చేరాడు.

10.2-949-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రాముఁడుఁ గనుఁగొనె భార్గవ
రామున్ రజనీశ కులధరావరనగ సు
త్రామున్ సన్నుత సుగుణ
స్తోముం గారుణ్యసీము సుజనలలామున్.

టీకా:

రాముడు = బలరాముడు; కనుగొనెన్ = చూసెను; భార్గవరామున్ = పరశురాముడిని {భార్గవరాముడు - భార్గవుని కొడుకైన రాముడు, పరశురాముడు}; రజనీశ = చంద్ర {రజనీశుడు - రాత్రికి నాయకుడు, చంద్రుడు}; కుల = వంశపు; ధరావర = రాజులు అను; నగ = పర్వతములకు; సుత్రామున్ = ఇందుని వంటివాడు {సుత్రాముడు - లోకములను చక్కగా రక్షించువాడు, ఇంద్రుడు}; సన్నుత = శ్లాఘింపబడిన; సుగుణ = సుగుణముల; స్తోమున్ = సమూహము కలవానిని; కారుణ్య = దయకు; సీమున్ = మేరయైనవానిని; సుజన = సజ్జనులలో; లలామున్ = శ్రేష్ఠుని.

భావము:

ఆ మహేంద్రగిరి మీద క్షత్రియ కులాన్ని మట్టుపెట్టినవాడూ, స్తుతింపబడే సద్గుణాలు కలవాడూ, దయాశాలి, సత్ప్రవర్తక శ్రేష్ఠుడు అయిన పరశురాముడిని బలరాముడు దర్శించాడు.

10.2-950-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని నమస్కరించి కౌతుకం బలరార
తని వీడుకొని హలాయుధుండు
గొమరుమిగిలి సప్తగోదావరికి నేఁగి
యందుఁ దీర్థమాడి చటు గదలి.

టీకా:

కని = చూసి; నమస్కరించి = నమస్కారముచేసి; కౌతుకంబు = కుతూహలము; అలరారన్ = ఒప్పగా; అతనిన్ = అతడిని; వీడుకొని = సెలవు తీసుకొని; హలాయుధుండు = బలరాముడు; కొమరుమిగిలి = అంద మతిశయించు నట్టి; సప్తగోదావరి = సప్తగోదావరి {సప్తగోదావరి - సప్తర్షుల నామములతో ఏడు పాయలుగా ప్రవహిస్తున్నట్టి సముద్రమున కలియుటకు ముందరి గోదావరి}; కిన్ = కి; ఏగి = వెళ్ళి; అందున్ = దానిలో; తీర్థము = జల స్నానము; ఆడి = చేసి; అచటున్ = అక్కడనుండి; కదలి = బయలుదేరి.

భావము:

పరశురాముడికి ప్రణామాలర్పించి, బలరాముడు అతడి వద్ద సెలవు తెలుసుకుని సప్తగోదావరికి వెళ్ళి అందులో స్నానం చేసాడు. అక్కడ నుండి బయలుదేరి....

10.2-951-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వేణీపంపాసరస్సులంజూచి, భీమనదికేఁగి యందుఁ గుమారస్వామిని దర్శించి, శ్రీశైలంబునకుఁ జని, వేంకటాచలంబు దర్శించి, కామకోటి శక్తిని నిరీక్షించి, కాంచీపురంబుం గాంచి, కావేరికిం జని యమ్మహావాహిని నవగాహనంబు సేసి.

టీకా:

వేణీ = వేణి; పంపా = పంపా; సరస్సులన్ = సరోవరములను; చూచి = చూసి; భీమనది = భీమనది; కిన్ = కి; ఏగి = వెళ్ళి; అందున్ = అక్కడ; కుమారస్వామిని = కుమారస్వామిని; దర్శించి = చూసి; శ్రీశైలంబున్ = శ్రీశైలమున; కున్ = కు; చని = వెళ్ళి; వేంకటాచలంబున్ = వేంకటాచలమును (తిరుపతి); దర్శించి = చూసి; కామకోటిన్ = కామకోటి లోని; శక్తిని = అమ్మవారిని; నిరీక్షించి = చూసి; కాంచీపురంబున్ = కంచి; కాంచి = చూసి; కావేరి = కావేరీనది; కిన్ = కి; చని = వెళ్ళి; ఆ = ఆ; మహా = పెద్ద; వాహినిన్ = నది యందు; అవగాహనంబు = స్నానముచేయుట; చేసి = చేసి.

భావము:

బలరాముడు పిమ్మట వేణీనదిని పంపానదిని దర్శించాడు. భీమానది చేరి అక్కడ వెలసిన కుమారస్వామి దర్శనం చేసుకుని, శ్రీశైలం, తిరుమల దర్శించాడు. కాంచీపురం కామాక్షిని చూసాడు. అక్కడనుండి కావేరికి వెళ్ళి ఆ మహానదిలో స్నానం చేసాడు.

10.2-952-స్రగ్ద.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

సేవించెన్ రంగధామున్ శ్రితనివహపయస్సింధుసంపూర్ణసోముం
గావేరీ మధ్యసీమున్ నకలుష మహాకాలకూటోగ్ర భీమున్
దేవారిశ్రీ విరామున్ దివిజవినుత సందీపితానంత నామున్
ధీవిజ్ఞానాభిరాముం ద్రిభువన విలసద్దేవతా సార్వభౌమున్.

టీకా:

సేవించెన్ = పూజించెను; రంగధామున్ = శ్రీరంగనాయకుని {రంగధాముడు - రంగ (శ్రీరంగము) ధామున్ (నివాసముగా ఉండువాడు), శ్రీరంగనాయకుడు}; శ్రిత = ఆశ్రయించిన; నివహ = సమూహములు అను; పయస్సింధు = పాలసముద్రమునకు; పూర్ణసోమున్ = నిండు చంద్రు డైన వానిని; కావేరీ = కావేరీనది; మధ్య = నడుమ; సీమున్ = ఉండువానిని; ఘన = అధికములైన; కలుష = పాపములు అను; మహా = గొప్ప; కాలకూట = కాలకూటమునకు; ఉగ్రభీమున్ = శివుడైనవానిని; దేవారి = రాక్షసుల {దేవారి - దేవతలకు అరి, రాక్షసుడు}; శ్రీన్ = కలిమిని; విరామున్ = అణచినవానిని; దివిజ = దేవత; వినుత = స్తుతులతో; సందీపిత = వెలిగిపోవునట్టి; అనంత = అంతము లేనన్ని; నామున్ = పేర్లు కలవానిని; ధీ = ఙ్ఞానులులకు; విఙ్ఞాన = విఙ్ఞులకు; అభిరామున్ = సంతోషము కలుగ జేయువానిని; త్రిభువన = ముల్లోకములలోని; విలసత్ = విలసిల్లినట్టి; దేవతా = సర్వదేవతలకు; సార్వభౌమున్ = చక్రవర్తి యైనవానిని.

భావము:

బలరాముడు ఆ కావేరీ నదీమధ్యంలో వెలసిన శ్రీరంగం చేరాడు. ఆశ్రితులనే పాలసముద్రానికి పూర్ణచంద్రుని వంటివాడూ; కలుషాలను కబళించేవాడూ; రాక్షసుల సంపదలను హరించేవాడూ; జ్ఞానుల మనసులు అలరించేవాడు; అమరులు వినుతించే అనంత నామాలు కలవాడూ; ముల్లోకాల లోని సకల దేవతలకు అధినాథుడూ; అయిన శ్రీరంగనాథుడిని సేవించాడు.

10.2-953-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అచ్చోటు వాసి వృషభాద్రి నెక్కి, హరిక్షేత్రంబు ద్రొక్కి, మధురాపురంబున కరిగి, సేతుబంధనంబు మెట్టి, యచటం బదివేల పాఁడిమొదవుల భూసురుల కిచ్చి, రామేశ్వరుం దర్శించి, తామ్రపర్ణికిం జని, మలయాచలంబెక్కి, యగస్త్యునింగని నమస్కరించి, దక్షిణసముద్రంబు దర్శించి, కన్యాఖ్యదుర్గాదేవి నుపాసించి, పంచాప్సరంబను తీర్థంబున నాప్లవనం బాచరించి, గోకర్ణంబున నిందుమౌళిని దర్శించి, ద్వీపవతి యైన కామదేవిని వీక్షించి, తాపింబయోష్ణిని దర్శించి, నిర్వింధ్యంబు గడచి, దండకావనంబున కరిగి, మాహిష్మతీపురంబున వసియించి, మనుతీర్థం బాడి, క్రమ్మఱం బ్రభాసతీర్థంబునకు వచ్చి యచ్చటి బ్రాహ్మణ జనంబుల వలనఁ బాండవధార్తరాష్ట్రుల భండనంబు నందు సకలరాజలోకంబు పరలోకగతు లగుటయు, వాయునందన సుయోధనులు గదాయుద్ధ సన్నద్ధులై యుండుటయు నెఱింగి వారల వారించు తలంపున నచటికిం జని.

టీకా:

ఆ = ఆ; చోటున్ = ప్రదేశమును; పాసి = విడిచి; వృషభాద్రిన్ = వృషభాద్రి అను కొండను; ఎక్కి = ఎక్కి; హరిక్షేత్రమున్ = హరిక్షేత్రము అనుచోటు; త్రొక్కి = పోయి; మధురాపురంబు = మధుర; కున్ = కు; అరిగి = వెళ్ళి; సేతుబంధనమున్ = రాముడు కట్టిన సేతువు; మెట్టి = చేరి; అచటన్ = అక్కడ; పదివేల = పదివేల (10000); పాడి = పాలిచ్చు; మొదవులన్ = ఆవులను; భూసురల = బ్రాహ్మణుల; కున్ = కు; ఇచ్చి = దానముచేసి; రామేశ్వరున్ = రామేశ్వరుని; దర్శించి = చూసి; తామ్రపర్ణి = తామ్రపర్ణి; కిన్ = కి; చని = వెళ్ళి; మలయాచలంబున్ = మలయమను కొండను; ఎక్కి = ఎక్కి; అగస్త్యుని = అగస్త్యమహర్షిని; కని = చూసి; నమస్కరించి = నమస్కారముచేసి; దక్షిణసముద్రంబున్ = హిందూమహాసముద్రాన్ని; దర్శించి = చూసి; కన్య = కన్యాకుమారి అను; ఆఖ్యన్ = పేరుతో ఉన్న; దుర్గాదేవిన్ = దుర్గాదేవిని; ఉపాసించి = పూజించి; పంచాప్సరంబు = పంచాప్సరము; అను = అనెడి; తీర్థంబునన్ = పుణ్యతీర్థము నందు; ఆప్లవనంబు = స్నానము చేయుట; ఆచరించి = చేసి; గోకర్ణంబున్ = గోకర్ణము నందు; ఇందుమౌళిని = చంద్రశేఖరుడైన శివుని; దర్శించి = చూచి; ద్వీపవతి = నది; ఐన = అయినట్టి; కామదేవిని = కామదేవిని; వీక్షించి = చూసి; తాపిన్ = తాపి యందు; పయోష్ణిన్ = పయోష్ణిని; దర్శించి = చూసి; నిర్వింధ్యంబున్ = నిర్వింధ్యను నదిని; గడచి = దాటి; దండకావనంబున్ = దండకారణ్యమున; కున్ = కు; అరిగి = వెళ్ళి; మహిష్మతీ = మహిష్మతీ; పురంబున్ = పట్టణము నందు; వసియించి = ఉండి; మనుతీర్థంబున్ = మనుతీర్థము నందు; ఆడి = స్నానముచేసి; క్రమ్మఱన్ = మరల; ప్రభాసతీర్థంబున్ = ప్రభాసతీర్థమున; కున్ = కు; వచ్చి = వచ్చి; అచ్చటి = అక్కడ ఉన్న; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; జనంబుల = సమూహము; వలన = వలన; పాండవ = పాండురాజు కొడుకుల; ధార్తరాష్ట్రులు = ధృతరాష్ట్రుని కొడుకుల; భండనంబున్ = యుద్ధము; అందున్ = లో; సకల = ఎల్ల; రాజ = రాజుల; లోకంబున్ = అందరును; పరలోకగతులు = చచ్చిపోయినవారు; అగుటయున్ = అగుట; వాయునందన = భీముడు; సుయోధనులు = దుర్యోధనులు; గదాయుద్ధ = గదలతో చేయు పోరుకి; సన్నద్ధులు = సిద్ధపడినవారు; ఐ = అయ్యి; ఉండుటయు = ఉండుట; ఎఱింగి = తెలిసి; వారలన్ = వారిని; వారించు = ఆపవలె ననెడి; తలంపునన్ = ఉద్దేశముతో; అచటి = అక్కడ; కిన్ = కి; చని = వెళ్ళి;

భావము:

బలరాముడు అక్కడ నుండి వృషభాద్రికి వెళ్ళి, హరిక్షేత్రము, మధుర, సేతుబంధం దర్శించి, అక్కడ బ్రాహ్మణులకు పదివేల పాడిఆవులను దానం చేసాడు. రామేశ్వరం తామ్రపర్ణి చూసాడు. మలయాచలం ఎక్కి, అక్కడ అగస్త్యుడికి మ్రొక్కాడు. దక్షిణసముద్రము చేరి, కన్యాకుమారి పేర వెలసి ఉన్న దుర్గాదేవిని దర్శించి, గోకర్ణక్షేత్రంలో పరమేశ్వరుడిని దర్శించి, కామదేవి నదిని, తాపి యందలి పయోష్ణి నదిని దర్శించి. నిర్వింధ్యను దాటి, దండకాటవిని గడచి, మహిష్మతీ పురము ప్రవేశించాడు. మనుతీర్థంలో స్నానం చేసి పిమ్మట ప్రభాసతీర్థానికి వెళ్ళాడు. అక్కడి బ్రాహ్మణుల వలన కౌరవపాండవ సంగ్రామంలో రాజులు అందరూ హతులు అయ్యారనీ, భీమదుర్యోధనులు గదాయుద్ధానికి సన్నద్ధులు అవుతున్నారనీ తెలుసుకుని, వారిని చూడడానికి వెళ్ళాడు.

10.2-954-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ర్మనందనుఁ దనకు వంనము సేయు
కృష్ణు నరు మాద్రిసుతుల నీక్షించి యేమి
లుక కుగ్ర గదాదండపాణు లగుచుఁ
గ్రోధమునఁ బోరు భీమ దుర్యోధనులను.

టీకా:

ధర్మనందనున్ = ధర్మరాజును; తన = అతని; కున్ = కు; వందనము = నమస్కారము; చేయు = చేయుచున్న; కృష్ణున్ = కృష్ణుని; నరున్ = అర్జునుని; మాద్రిసుతులన్ = నకుల సహదేవులను; ఈక్షించి = చూసి; ఏమి = ఏమాత్రము; పలుకక = మాట్లాడకుండ; ఉగ్ర = భయంకరమైన; గదాదండ = గదాయుధము; పాణులు = చేతిలో కలవారు; అగుచున్ = ఔతు; క్రోధమునన్ = కోపముతో; పోరు = యుద్ధము చేయుచున్న; భీమ = భీముడు; దుర్యోధనులను = దుర్యోధనులను.

భావము:

అక్కడ ధర్మరాజుని మఱియు తనకు నమస్కరిస్తున్న శ్రీకృష్ణ, అర్జున, నకుల, సహదేవాదులను గమనించి కూడ మాట్లాడకుండా, భీకరమైన గదలు చేతబట్టి కయ్యానికి కాలు దువ్వుతున్న భీమదుర్యోధనులను చూసి...

10.2-955-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చూచి వారల డాయం జని యిట్లనియె.

టీకా:

చూచి = చూసి; వారల = వారి; డాయన్ = దగ్గరకు; చని = వెళ్ళి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా యుద్ధ సన్నధులు అయిన భీమదుర్యోధనుల వద్దకు బలరాముడు వెళ్ళి ఇలా అన్నాడు.

10.2-956-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"వీరపుంగవులార! వినుఁడు; మీలోపల-
భూరిభుజాసత్త్వమున నొకండు
ప్రకటితాభ్యాస సంద్విశేషంబున-
నొక్కండు యధికుఁడై యుంటఁ జేసి
మబలు; లటు గాన ర్చింపఁగా నిందు-
య మొక్కనికి లేదు మరమందుఁ;
గాన యూరక పోరఁగా నేల మీ"కని-
వారింప నన్యోన్య వైరములను

10.2-956.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

డరి తొల్లింటి దుర్భాష లాత్మలందుఁ
లఁచి తద్భాషణము లపథ్యములు గాఁగ
మొక్కలంబునఁ బోర నా ముష్టికాసు
రారి వీక్షించి "వీరి శుభాశుభములు,

టీకా:

వీర = వీరులలో; పుంగవులారా = శ్రేష్ఠులైనవారా; వినుడు = వినండి; మీ = మీ; లోపలన్ = మధ్యన; భూరి = మిక్కుటమైన; భుజాసత్త్వమునన్ = భుజబలమున; ఒకండు = ఒకడు; ప్రకటిత = ప్రసిద్ధమైన; అభ్యాస = అభ్యాసము అను; సంపద = కలిమి; విశేషంబునన్ = అధికముగా ఉండుటలో; ఒక్కండు = ఒకడు; అధికుడు = గొప్పవాడు; ఐ = అయ్యి; ఉంటన్ = ఉండుట; చేసి = వలన; సమబలులు = సమానమైన బలశాలులు; కాన = కాబట్టి; చర్చింపగాన్ = విచారించినచో; ఇందున్ = దీనిలో; జయము = గెలుపు; ఒక్కని = ఏఒక్కడి; కిన్ = కి; లేదు = కలుగదు; సమరము = పోరుట; అందున్ = లో; కాన = కాబట్టి; ఊరక = ఉత్తినే; పోరగాన్ = యుద్ధముచేయుట; ఏలన్ = ఎందుకు; మీ = మీ; కున్ = కు; అని = అని; వారింపన్ = ఆపగా; అన్యోన్య = పరస్పర; వైరములను = విరోధములను; అడరి = విజృంభించి; తొల్లింటి = మునుపటి; దుర్భాషలన్ = నిందావాక్యములను; ఆత్మలు = మనస్సుల; అందున్ = లో; తలచి = గుర్తుచేసుకొని; తత్ = ఆ యొక్క; భాషణములు = మాటలు; అపథ్యములు = అయిష్టములు; కాగన్ = అగుటచేత; మొక్కలంబునన్ = మూర్ఖత్వముతో; పోరన్ = పోరుచుండగా; ఆ = ఆ; ముష్టికాసురారి = బలరాముడు {ముష్టికాసురారి - ముష్టికాసురుని చంపినవాడు, బలరాముడు}; వీక్షించి = చూసి; వీరి = వీరి యొక్క; శుభా = మేలు; అశుభములు = కీడులు.

భావము:

“మేటివీరులారా! నా మాట వినండి. మీలోఒకడు భుజబలంలో అధికుడు; మరొకడు అభ్యాస నైపుణ్యంలో శ్రేష్ఠుడు. మీరిద్దరూ సమానులు మీలో ఎవరూ ఎవరినీ గెలువలేరు. అయినా ఊరక యుద్ధానికి పూనుకోవడం దేనికి” అంటూ బలరాముడు వారిని వారింప చూసాడు. కాని, పాత పగలను మనసులో ఉంచుకున్న భీమదుర్యోధనులు బలరాముడి హితవచనాలను ఆలకించ లేదు. వారు పౌరుషంతో పోరాడటానికే నిశ్చయించారు. అది గమనించిన బలరాముడు వారి గురించి...

10.2-957-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఎట్లుగావలయు నట్ల యయ్యెడుం గాక" యని; యచ్చోట నిలువక యుగ్రసేనాది బంధుప్రకరంబులు పరితోషంబున నెదుర్కొన ద్వారకాపురంబు సొచ్చి; యందుండి మగిడి నైమిశారణ్యంబు నకుం జని; యందుల మునిపుంగవు లనుమతింప నచ్చట నొక మఖంబు గావించి బహుదక్షిణ లొసంగి; యంచితజ్ఞానపరిపూర్ణు లగునట్లుగా వరంబిచ్చి; రేవతియునుం దానును బంధు జ్ఞాతి యుతంబుగా నవభృథస్నానం బాచరించి; యనంతరంబ.

టీకా:

ఎట్లు = ఎలా; కావలయున్ = కానున్నదో; అట్ల = అలానే; అయ్యెడుంగాక = ఔగాక; అని = అని; ఆ = ఆ; చోటన్ = చోటు నందు; నిలువక = ఆగకుండా; ఉగ్రసేన = ఉగ్రసేనుడు; ఆది = మున్నగు; బంధు = బంధువుల; ప్రకరంబులున్ = సమూహములు; పరితోషంబునన్ = సంతోషముతో; ఎదుర్కొన్ = ఎదురురాగా; ద్వారకాపురంబున్ = ద్వారకానగరము; చొచ్చి = ప్రవేశించి; అందున్ = అందులో; ఉండి = ఉండి; మగిడి = మరల; నైమిశారణ్యంబున్ = నైమిశారణ్యమున; కున్ = కు; చని = వెళ్ళి; అందులన్ = దానిలో; ముని = ముని; పుంగవులు = ఉత్తములు; అనుమతింపన్ = అంగీకరించగా; అచ్చటన్ = అక్కడ; ఒక్క = ఒక; మఖంబున్ = యాగమును; కావించి = చేసి; బహు = పెక్కు; దక్షిణలున్ = దక్షిణలను {దక్షిణ - యాగాది నిర్వహించిన పురోహితులకు ఇచ్చెడి ధనాదికము}; ఒసంగి = ఇచ్చి; అంచిత = చక్కటి; ఙ్ఞాన = ఙ్ఞానముచేత; పరిపూర్ణులు = నిండుగా కలవారు; అగునట్లుగా = అయ్యేలాగ; వరంబున్ = వరము; ఇచ్చి = ఇచ్చి; రేవతియును = రేవతీదేవి; తానును = అతను; బంధు = బంధువులతో; ఙ్ఞాతి = ఙ్ఞాతులతో; యుతంబుగా = సహా, కూడి; అవబృథస్నానంబు = అవబృథ స్నానము; ఆచరించి = చేసి; అనంతరంబ = తరువాత.

భావము:

“వీరు పోరు విడుచుట లేదు, శుభాశుభములు ఏమగునో? కానున్నది కాకమానదు కదా.” అని, అక్కడ నిలువలేక ద్వారకానగరానికి వెళ్ళిపోయాడు. ఉగ్రసేనాది బంధువులు అందరు బలరాముడికి ఆదరంగా స్వాగతం పలికారు. అతడు అక్కడ కొన్నాళ్ళుండి, మళ్ళీ నైమిశారణ్యానికి వెళ్ళాడు. అక్కడ యజ్ఞంచేసి భూరిదక్షిణలతో బ్రాహ్మణులను సంతృప్తి పరచాడు. వారికి సుజ్ఞానులు కమ్మని వరం అనుగ్రహించాడు. పిమ్మట, భార్య రేవతితోనూ, బంధువులతోనూ కలసి అవభృథస్నానం చేసాడు. అటు తరువాత...

10.2-958-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విసిత మాల్య చందన నవీన విభూషణ రత్న వస్త్రముల్‌
పొలుపుగఁ దాల్చి యంచిత విభూతిఁ దలిర్చెను బూర్ణచంద్రికా
లిత సుధాంశురేఖ నెసకం బెసఁగన్ నిజబంధులోచనో
త్పచయ ముల్లసిల్లఁ బరిపాండుర చారు యశోవిలాసుఁడై.

టీకా:

విలసిత = ప్రకాశిస్తున్న; మాల్య = పూలదండలు; చందన = మంచిగంధము; నవీన = కొత్త; విభూషణ = ఆభరణములు; రత్న = మణులు; వస్త్రముల్ = బట్టలు; పొలుపుగన్ = చక్కగా; తాల్చి = ధరించి; అంచిత = చక్కటి; విభూతిన్ = వైభవముతో; తలిర్చెనున్ = అతిశయించి ఉండెను; పూర్ణచంద్రికా = నిండు పున్నమి వెన్నెల; కలిత = కలిగిన; సుధాంశ = చంద్రుని; రేఖన్ = విధముగా; ఎసకన్ = అతిశయముతో; బెసగన్ = తుళ్లగా; నిజ = తన; బంధు = బంధువుల; లోచన = కన్నులు అను; ఉత్పల = కలువల; చయము = సమూహములు; ఉల్లసిల్ల = వికసించగా; పరి = మిక్కిలి; పాండుర = తెల్లని; చారు = చక్కటి; యశః = కీర్తి యొక్క; విలాసుడు = విలాసము కలవాడు; ఐ = అయ్యి.

భావము:

బలరాముడు పూలదండలు వేసుకుని, చందనం అలదుకొని, వినూత్న వస్త్రాభరణాలను ధరించాడు. అప్పుడు బలరాముడు నిండు పున్నమి చంద్రుడిలా, పరిపూర్ణ యశోభిరాముడై, బందువుల నేత్రాలనే కలువలకు వికాసం కలిగించాడు.

10.2-959-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇవ్విధంబున ననంతుండు నప్రమేయుండును మాయామానుష విగ్రహుండు నసంఖ్యబలశాలియు నైన బలదేవుం డతివైభంబున నిజపురంబు ప్రవేశించి సుఖంబుండె” నని చెప్పి యిట్లనియె.

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = రీతిని; అనంతుండున్ = బలరాముడు {అనంతుడు - అంతము లేనివాడు, ఆదిశేషుడు}; అప్రమేయుండును = బలరాముడు {అప్రమేయుడు - మేరలేనివాడు, ఆదిశేషుడు}; మాయా = మాయచేత; మానుష = మానవునిగా; విగ్రహుండున్ = ఆకృతి కలవాడు; అసంఖ్య = లెక్కలేనంత; బలశాలియున్ = మిక్కిలి బలము కలవాడు; ఐన = అయిన; బలదేవుండు = బలరాముడు; అతి = మిక్కిలి; వైభవంబునన్ = వైభవముతో; నిజ = తన; పురంబున్ = అంతఃపురమును; ప్రవేశించి = ప్రవేశించి; సుఖంబు = సుఖముగా; ఉండెన్ = ఉండెను; అని = అని; చెప్పి = చెప్పి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ విధంగా అంతులేని మహాబలశాలీ, మాయా మానుష వేషధారీ, అనంతుడు, మేరలేని వాడు, ఆదిశేషుని అపర అవతారుడు అయిన బలరాముడు మిక్కిలి వైభవంతో ద్వారకానగరం ప్రవేశించి సుఖంగా ఉన్నాడు. అని శుకబ్రహ్మ చెప్పి, మరల పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు.