పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బలరాముని తీర్థయాత్ర

  •  
  •  
  •  

10.2-941-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెండియుఁ గ్రొమ్మెఱుంగు లుడువీథి వెలుంగఁగ నుల్లసద్గదా
దంముఁ గేలఁ ద్రిప్పుచు నుదారత రా బలభద్రుఁ డాసురో
ద్దంవిఘాతులౌ ముసలదారుణలాంగలముల్‌ దలంప మా
ర్తాంనిభంబులై యెదురఁ దత్‌క్షణమాత్రన తోఁచినన్ వెసన్.

టీకా:

వెండియున్ = మఱియును; క్రొత్త = కొత్త; మెఱుంగులు = మెరుపులు; ఉడువీథిన్ = ఆకాశము నందు {ఉడువీథి - నక్షత్రములు తిరిగెడి ప్రదేశము, ఆకాశము}; వెలుంగగన్ = ప్రకాశించుచుండగా; ఉల్లసత్ = మెరయుచున్న; గదాదండమున్ = గదను; కేలన్ = చేతితో; త్రిప్పుచున్ = తిప్పుతు; ఉదారతన్ = దిట్టతనముతో; రాన్ = రాగా; బలభద్రుడు = బలరాముడు; అసుర = రాక్షసుల; ఉద్దండ = అతిశయమును; విఘాతులు = అణగగొట్టునవి; ఔ = అగు; ముసల = రోకటి ఆయుధమును; దారుణ = భీకరమైన; లాంగలముల్ = నాగేటి ఆయుధములు; తలంపన్ = తలచుకొనగానే; మార్తాండ = సుర్యుని {మార్తాండుడు - బ్రహ్మాండము పగిలినప్పుడు పుట్టిన వాడు, సూర్యుని సుష్మమ్న అను రశ్మి యొక్క అవతారము}; నిభంబులు = సమానములైనవి; ఐ = అయ్యి; ఎదురన్ = ఎదుట; తత్ = ఆ; క్షణమాత్రన = క్షణ మాత్రపు కాలములో; తోచినన్ = కనబడగా; వెసన్ = శీఘ్రముగా.

భావము:

అంతే కాకుండా ఆకాశంలో మెరుపులు మెరిసేలా చేతిలోని గదను త్రిప్పుతూ పల్వలుడు తన మీదకు రావడం చూసి, బలరాముడు రాక్షస సంహార సమర్థములైన రోకలినీ నాగలినీ స్మరించాడు. తక్షణమే అవి సూర్య సమాన తేజస్సుతో బలరాముడి ఎదుట ప్రత్యక్షమయ్యాయి.