పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బలరాముని తీర్థయాత్ర

  •  
  •  
  •  

10.2-927-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు సని మొదలం ప్రభాసతీర్థంబున నవగాహంబు సేసి, యందు దేవర్షిపితృతర్పణంబులు సంప్రీతిం గావించి విమలతేజోధను లగు భూసురప్రవరులు దనతో నరుగుదేరం గదలి చని క్రమంబున సరస్వతియు బిందుసరోవరంబును వజ్రతీర్థంబును విశాలానదియు సరయువును యమునయు జాహ్నవీతీర్థంబును గనుంగొనుచు నచటనచట నవగాహన దేవర్షిపితృతర్పణ బ్రాహ్మణ సంతర్పణంబు లను భూసుర యుక్తుండై నడపుచుం జని సకలలోకస్తుత్యంబును నిఖిలముని శరణ్యంబు నగు నైమిశారణ్యంబు సొచ్చి; యందు దీర్ఘసత్త్రంబు నడపుచున్న ముని జనంబులం గనుం గొనిన; వారును ప్రత్యుత్థానంబు సేసి రామునకు వినతులై యాసన పూజా విధానంబులు గావించిన నతండును బ్రముదిత మానసుం డగుచు సపరివారంబుగాఁ గూర్చున్న యెడ.

టీకా:

అట్లు = ఆ విధముగా; చని = వెళ్ళి; మొదలన్ = ముందుగా; ప్రభాసతీర్థంబునన్ = ప్రభాసతీర్థము నందు; అవగాహనంబు = స్నానము చేయుట; చేసి = చేసి; అందున్ = దానిలో; దేవ = దేవతల కొరకు; ఋషి = ఋషుల కొరకు; పితృ = పితృదేవతల కొరకు; తర్పణంబులున్ = తర్పణములను; సంప్రీతిన్ = మంచి ఇష్టముతో; కావించి = చేసి; విమల = నిర్మలమైన; తేజోధనులు = గొప్పతేజస్సు కలవారు; అగు = ఐన; భూసుర = బ్రాహ్మణ; ప్రవరులున్ = వంశస్థులు; తన = అతని; తోన్ = తోటి; అరుగుదేరన్ = రాగా; కదిలి = బయలుదేరి; చని = వెళ్ళి; క్రమంబునన్ = వరుసగా; సరస్వతియున్ = సరస్వతీనది; బిందు = బిందు; సరోవరంబును = సరస్సు; వజ్రతీర్థంబును = వజ్రతీర్థము; విశాలా = విశాలా; నదియున్ = నది; సరయువును = నది సరయువు; యమునయున్ = యమున నది; జాహ్నవీ = గంగా; తీర్థంబునున్ = తీర్థములు; కనుంగొనుచు = చూస్తూ; అచటనచట = అక్కడక్కడ; అవగాహన = స్నానము చేయుట; దేవ = దేవతలు కొరకు; ఋషి = ఋషుల కొరకు; పితృ = పితృ దేవతల కొరకు; తర్పణ = తర్పణములు; బ్రాహ్మణ = బ్రాహ్మణులకు; సంతర్పణ = సమారాధనము; భూసుర = బ్రాహ్మణులతో; యుక్తుడు = కూడి ఉన్నవాడు; ఐ = అయ్యి; నడపుచున్ = జరిపించుచు; చని = వెళ్ళి; సకల = ఎల్ల; లోక = లోకము లందు; స్తుత్యంబును = పొగడబడ తగినది; నిఖిల = సర్వ; ముని = మునులకు; శరణ్యంబున్ = రక్షకముగా నుండునది; అగు = ఐన; నైమిశారణ్యంబు = నైమిశారణ్యము; చొచ్చి = ప్రవేశించి; అందున్ = దానిలో; దీర్ఘసత్త్రంబున్ = దీర్ఘసత్త్రమును; నడుపుచున్న = చేయుచున్న; ముని = మునుల; జనంబులన్ = సమూహములను; కనుంగొనిన = చూడగా; వారును = వారు; ప్రత్యుత్థానంబు = లేచి ఎదురువెళ్ళుట; చేసి = చేసి; రామున్ = బలరాముడి; కున్ = కి; వినతులు = నమస్కరించినవారు; ఐ = అయి; ఆసన = ఆసనము ఇచ్చుట; ఆది = మున్నగు; పూజా = సన్మానించు; విదానంబులున్ = క్రియలను; కావించినన్ = చేయగా; అతండును = అతను; ప్రముదిత = మిక్కిలి సంతోషించిన; మానసుండు = మనసు కలవాడు; అగుచున్ = ఔతు; సపరివారంబుగా = పరివారముతోకూడి; కూర్చున్న = కూరుచుండి ఉన్న; ఎడ = సమయము నందు.

భావము:

అలా తీర్ధయాత్రలకు అని బయలుదేరిన బలరాముడు, ప్రభాసతీర్ధానికి వెళ్ళి స్నానం చేసి ప్రీతితో దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. బ్రాహ్మణోత్తములు కూడా వస్తుండగా అతడు అక్కడ నుండి బయలుదేరాడు. క్రమముగా సరస్వతి, బిందుసరోవరం, వజ్రతీర్థం, విశాలానది, సరయువు, యమున, గంగ మున్నగు పుణ్యనదుల్లో స్నానాలు చేసి, దేవతలకు, ఋషులకు, పితృగణాలకు తర్పణాలు సమర్పించాడు. బ్రాహ్మణులకు సంతర్పణలు చేసాడు. పిమ్మట బలరాముడు లోకములు సమస్తము నందు స్తుతిపాత్రము, మునీంద్రులకు నివాసస్థానము అయిన నైమిశారణ్యం ప్రవేశించాడు. అప్పుడు అక్కడి మునులు దీర్ఘసత్రయాగం జరుపుతూ ఉన్నారు. వారందరూ బలరాముడికి ఎదురేగి వినయంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. బలరాముడు సంతోషించి సపరివారంగా ఆసీనుడయ్యాడు.