పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : దంతవక్త్రుని వధించుట

  •  
  •  
  •  

10.2-919-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తత్‌క్షణంబ పర్వతాకారంబగు దేహంబుతో నొఱలుచు నేలంగూలి కేశపాశంబులు సిక్కువడఁ దన్నుకొనుచుఁ బ్రాణంబులు విడిచె; నప్పుడు నిఖిల భూతంబులు నాశ్చర్యంబు వొందఁ దద్గాత్రంబున నుండి యొక్క సూక్ష్మతేజంబు వెలువడి గోవిందునిదేహంబుఁ బ్రవేశించె; నయ్యవసరంబున నగ్రజు మరణంబు గనుంగొని కుపితుండై కనుఁగవల నిప్పులుప్పతిల్ల విదూరథుండు గాలానల జ్వాలాభీలకరాళంబైన కరవాలంబును బలకయుం గేలందాల్చి దామోదరు దెసకుఁ గవయుటయుం గనుంగొని.

టీకా:

తత్క్షణంబ = వెంటనే; పర్వత = పర్వతము వంటి; ఆకారంబు = ఆకారము కలది; అగు = ఐన; దేహంబున్ = శరీరమును; తోన్ = తోటి; ఒఱలుచున్ = మొరపెట్టుచు; నేలన్ = నేలమీద; కూలి = పడిపోయి; కేశపాశంబులు = జుట్టుముడి; చిక్కుపడన్ = చిక్కుపడిపోగా; తన్నుకొనుచున్ = తన్నుకొంటు; ప్రాణంబుల్ = జీవములను; విడిచెన్ = వదలిపెట్టెను; అప్పుడు = అప్పుడు; నిఖిల = సర్వ; భూతంబులున్ = ప్రాణులు; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యమును; ఒందన్ = పొందగా; తత్ = అతని; గాత్రంబు = దేహము; నుండి = నుండి; ఒక్క = ఒకానొక; సూక్ష్మ = సూక్ష్మమైన; తేజంబు = తేజస్సు; వెలువడి = బయటకువచ్చి; గోవిందుని = కృష్ణుని; దేహంబు = శరీరములో; ప్రవేశించెన్ = ప్రవేశించినది; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; అగ్రజు = అన్న యొక్క; మరణంబున్ = చావును; కనుంగొని = చూసి; కుపితుండు = కోపించినవాడు; ఐ = అయ్యి; కనుగవలన్ = రెండు కన్నుల నుండి; నిప్పులు = అగ్నికణములు; ఉప్పతిల్ల = పుట్టగా; విదూరథుండు = విదూరథుడు; కాలా = ప్రళయకాలపు; అనల = అగ్ని; జ్వాలా = మంటల; ఆభీల = భయంకరమైన; కరాళంబు = పెద్దది భయంకరమైనది; ఐన = అయినట్టి; కరవాలంబునున్ = కత్తిని; పలకయున్ = డాలు; కేలన్ = చేతి అందు; తాల్చి = ధరించి; దామోదరు = కృష్ణుని; దెస = వైపున; కున్ = కు; కవయుటయున్ = సమీపించుటను; కనుంగొని = చూసి.

భావము:

తక్షణమే పర్వతంవంటి దేహంతో దంతవక్త్రుడు నేలపడి శిరోజాలు విడివడి చిక్కులు పడేలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు. అప్పుడు, వాడి దేహం లోంచి ఒక సూక్ష్మతేజం వెలువడి శ్రీకృష్ణుడి శరీరంలో ఐక్యం అయింది. సకల జీవులూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో విదూరథుడు అను వాడు అన్న మరణం చూసి అతి కోపంతో ప్రళయకాలపు అగ్నిజ్వాలవంటి భయంకరమైన కత్తి, డాలు ధరించి శ్రీకృష్ణుడి పైకి దూకాడు. చక్రి అది చూసి.....