పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సాల్వుండు ద్వారక న్నిరోధించుట

  •  
  •  
  •  

10.2-837-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని అభ్యర్థించినం బ్రసన్నండై హరుండు వాని కోర్కి కనురూపం బైన పురంబు నిర్మింప మయుని నియోగించిన నతండును “నట్ల చేసెద” నని కామగమనంబును నతివిస్తృతంబునుగా లోహంబున నిర్మించి సౌభకంబను నామంబిడి సాల్వున కిచ్చిన వాఁడును బరమానందంబునం బొంది తద్విమానారూఢుండై యాదవుల వలని పూర్వవైరంబుఁ దలంచి దర్పాంధచేతస్కుండై ద్వారకానగరంబుపైఁజని నిజసేనాసమేతంబుగాఁ దత్పురంబు నిరోధించి.

టీకా:

అని = అని; అభ్యర్థించినన్ = కోరగా; ప్రసన్నుండు = అనుగ్రహము కలవాడు; ఐ = అయ్యి; హరుండు = శివుడు; వాని = అతని; కోర్కి = కోరిక; కున్ = కు; అనురూపంబు = అనుగుణమైనది; ఐన = అయిన; పురంబున్ = నిర్మాణము; నిర్మింపన్ = తయారుచేయుటకు; మయుని = మయుడిని {మయుడు - దానవ శిల్పి}; నియోగించినన్ = నియమించగా; అతండును = అతను; అట్ల = ఆ విధముగా; చేసెదను = చేస్తాను; అని = అని; కామ = కోరినట్లు; గమనంబును = నడచుట; అతి = మిక్కిలి; విస్తృతంబునున్ = పెద్దది; కాన్ = అగునట్లు; లోహంబునన్ = ఇనుముతో; నిర్మించి = తయారుచేసి; సౌభకంబు = సౌభకము; అను = అనెడి; నామంబున్ = పేరు; ఇడి = పెట్టి; సాల్వున్ = సాల్వున; కున్ = కు; ఇచ్చినన్ = ఇవ్వగా; వాడును = అతను; పరమ = మిక్కుటమైన; ఆనందంబునన్ = ఆనందమును; ఒంది = పొంది; తత్ = ఆ; విమాన = విమానము నందు; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; యాదవుల = యాదవుల; వలని = అందలి; పూర్వ = పూర్వపు; వైరంబున్ = పగను; తలంచి = గుర్తుచేసుకొని; దర్ప = గర్వముచేత; అంధ = కళ్ళు కనిపించని; చేతస్కుండు = మనస్సు కలవాడు; ఐ = అయ్యి; ద్వారకా = ద్వారకా; నగరంబున్ = పట్టణము; పైన్ = మీదకి; చని = దండెత్తి వెళ్ళి; నిజ = తన; సేనా = సైన్యాల; సమేతంబుగా = సహా; తత్ = ఆ; పురంబున్ = పట్టణమును; నిరోధించి = ముట్టడించి.

భావము:

అలా సాల్వుడు కోరిన విధమైన విమానాన్ని ఈశ్వరుడు “అతడి కోరికకు తగిన పురము నిర్మించి యి” మ్మని మయుడిని ఆదేశించాడు. అతడు చిత్తమని కామగమనమూ మిక్కిలి వెడల్పూ పొడవూ కలిగి లోహమయమైన ఒక విమానాన్ని నిర్మించి దానికి “సౌభకము” అని పేరుపెట్టి సాల్వుడికి ఇచ్చాడు. వాడు పరమానందంతో దానిని ఎక్కి యాదవుల మీద తనకు ఉన్న పూర్వ శత్రుత్వం గుర్తుచేసుకుని గర్వంతో కన్నుమిన్ను గానక తన సేనలతో వెళ్ళి ద్వారకాపట్టణాన్ని ముట్టడించాడు.