పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సుయోధనుడు ద్రెళ్ళుట

  •  
  •  
  •  

10.2-827-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దామోదరానుమోదితులయి మహారవంబుగాఁ బరిహాసంబులు చేసిన సుయోధనుండు లజ్ఞావనతవదనుండై కుపితమానసుం డగుచు నయ్యెడ నిలువక వెలువడి నిజపురంబునకరిగె; నయ్యవసరంబున ధీవిశాలు రైన సభాసదులగు నచ్చటి జనంబుల కోలాహలంబు సంకులంబైన నజాతశత్రుండు చిత్తంబున విన్ననై యుండె; నప్పుండరీకాక్షుండు భూభార నివారణకారణుం డగుటంజేసి దుర్యోధను నపహాసంబునకుం గాదనండయ్యె; నంత.

టీకా:

దామోదర = కృష్ణునిచే; అనుమోదితులు = అంగీకరింపబడినవారు; అయి = ఐ; మహారవంబుగాన్ = బిగ్గరగా; పరిహాసంబులు = నవ్వుటలు; చేసినన్ = చేయగా; సుయోధనుండు = దుర్యోధనుడు; లజ్జ = సిగ్గుచేత; అవనత = వంచబడిన; వదనుండు = ముఖము కలవాడు; ఐ = అయ్యి; కుపిత = కోపించిన; మానసుండు = మనసు కలవాడు; అగుచున్ = ఔతు; ఆ = ఆ; ఎడన్ = చోటు నందు; నిలువక = ఉండకుండా; వెలువడి = బయలుదేరి; నిజ = తన; పురంబున్ = నగరమున; కున్ = కు; అరిగెన్ = వెళ్ళిపోయెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; ధీవిశాలురు = విశేషమైనబుద్ధి కలవారు; ఐన = అయిన; సభాసదులు = సభికులు; అగున్ = అయిన; అచ్చటి = అక్కడి; జనంబులన్ = వారల; కోలాహలంబు = సందడి; సంకులంబు = కలత నొందినది; ఐనన్ = కాగా; అజాతశత్రుండు = ధర్మరాజు; చిత్తంబునన్ = మనసు; విన్నను = చిన్నపోయినవాడు; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ దివ్యుడైన; పుండరీకాక్షుండు = కృష్ణుడు; భూ = భూమి యొక్క; భార = భారమును; నివారణ = పోగుట్టు; కారణుండు = కారణము కలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; దుర్యోధనున్ = దుర్యోధనుని ఎడ; అపహాసంబున్ = నవ్వుట; కున్ = కు; కాదు = వద్దు; అనడు = అననివాడు; అయ్యెన్ = అయ్యెను; అంత = పిమ్మట.

భావము:

కృష్ణుడి ఆమోదంతో అక్కడున్న రాజులు స్త్రీ జనము భీముడితోపాటు పెద్దగా పకపకా నవ్వారు. మయసభలో తనకు జరిగిన ఘోరమైన అవమానానికి సిగ్గుపడి దురాగ్రహంతో దుర్యోధనుడు తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సభాసదుల వేళాకోళంతో కూడిన కోలాహలాన్ని చూసిన ధర్మరాజు చిన్నపోయాడు. భూభారాన్ని నివారించడానికి అవతారం ధరించిన శ్రీకృష్ణుడు దుర్యోధనునికి జరిగిన అవమానాన్ని ఖండించ లేదు.