పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మరాజాదుల అవబృథంబు

  •  
  •  
  •  

10.2-802-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు యదు, సృంజయ, కాంభోజ, కురు, కేకయ, కోసల, భూపాల ముఖ్యులు చతుర్విధ సేనాసమేతులై ధరణి గంపింప వెన్నడి నడతేర, ఋత్విఙ్నికాయంబును సదస్యులను బ్రహ్మ ఘోషంబు లొలయ మున్నిడికొని, శోభమానానూన ప్రభాభాసమాన సువర్ణమయమాలికా దివ్యమణిహారంబులు గంఠంబునం దేజరిల్ల, నున్నత జవాశ్వంబులం బూన్చిన పుష్పరథంబుఁ గళత్ర సమేతుండై యెక్కి, యతిమనోహర విభవాభిరాముండై చనుదెంచు చుండె; నప్పుడు వారాంగనా జనంబులు దమ తమ వారలం గూడికొని.

టీకా:

మఱియున్ = ఇంకను; యదు = యదువంశపు; సృంజయ = సృంజయ దేశములకు; కాంభోజ = కాంభోజ దేశమునకు; కురు = కురువంశపు; కేకయ = కేకయ దేశములకు; కోసల = కోసల దేశములకు; భూపాల = రాజలు; ముఖ్యులు = మొదలగువారు; చతుర్విధ = గజరథహయపదాతి దళ; సేనా = సేనలతో; సమేతులు = కూడినవారు; ఐ = అయ్యి; ధరణి = భూమి; కంపింపన్ = కంపిస్తుండగా; వెన్నడి = వెన్నంటి; నడతేరన్ = నడచి రాగా; ఋత్విక్ = ఋత్విక్కుల; నికాయంబును = సమూహములను; సదస్యులను = యజ్ఞ విధి పరీక్షాధికారులను; బ్రహ్మ = వేదపఠన; ఘోషంబులు = ధ్వనులు; ఒలయన్ = వ్యాపిస్తుండగా; మున్ను = ముందుపక్క; ఇడికొని = ఉంచుకొని; శోభమాన = వెలుగుతున్న; అనూన = మిక్కుటమైన; ప్రభా = కాంతులతో; భాసమైన = తేజరిల్లుతున్న; సువర్ణ = బంగరముతో; మయ = నిండుగా గల; మాలికా = దండలు; దివ్య = దివ్యమైన; మణి = రత్నాల; హారంబులు = కంఠహారములు; కంఠంబునన్ = మెడల యందు; తేజరిల్లన్ = మెరుస్తుండగా; ఉన్నత = ఎత్తైన; జవ = మిక్కిలి వేగము కల; అశ్వంబులన్ = గుఱ్ఱములను; పూన్చిన = కట్టిన; పుష్పరథంబున్ = పూలరథమును; కళత్ర = భార్యలతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; ఎక్కి = ఎక్కి; అతి = మిక్కిలి; మనోహర = అందమైన; విభవ = వైభవములచే; అభిరాముండు = చక్కటివాడు; ఐ = అయ్యి; చనుదెంచుచుండెను = వస్తూ ఉండెను; అప్పుడు = ఆ సమయము నందు; వారాంగనా = వేశ్యల; జనంబులున్ = సమూహములు; తమ = వారికి కావలసిన; వారలన్ = వారితో; కూడికొని = చేరుకొని;

భావము:

అంతేకాకుండా, ఆ అవభృథ స్నానానికి యదు, సృంజయ, కాంభోజ, కేకయ, కోసల దేశాల రాజులు చతురంగ బలాలతో వెంట వస్తున్నారు. ఋత్విక్కులు సదన్యులు వేదపారాయణం చేస్తూ ముందు నడుస్తున్నారు. ఆ విధంగా ధర్మరాజు సువర్ణమయమైన దివ్యమణిహారాలు దేదీప్యమానంగా కంఠంలో ప్రకాశిస్తుండగా, మిక్కిలి వేగవంతమైన గుఱ్ఱాలను పూన్చిన పుష్పరథాన్ని భార్యాసమేతంగా అధిరోహించి మహావైభవంతో ప్రయాణం సాగించాడు