పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శిశుపాలుని వధించుట

  •  
  •  
  •  

10.2-789-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దప్పిన తెఱం గెట్టనినఁ బాత్రాపాత్ర వివేకంబు సేయనేర్చిన విజ్ఞాననిపుణులు, నున్నతసత్త్వ గరిష్ఠులు, బహువిధ తపోవ్రత నియమశీలురు, ననల్పతేజులు, మహైశ్వర్యశక్తిధరులుఁ, బరతత్త్వవేదులు, నఖిలలోకపాలపూజితులు, విగతపాపులుఁ, బరమయోగీంద్రులు నుండ వీరిం గైకొనక వివేకరహితులై గోపాలబాలునిం బూజసేయుటకు నెట్లు సమ్మతించిరి; పురోడాశంబు సృగాలంబున కర్హంబగునే? యదియునుంగాక.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; తప్పిన = తప్పినట్టి; తెఱంగు = క్రమము; ఎట్టు = ఏ విధముగా; అనినన్ = అనగా; పాత్రాపాత్ర = యుక్తాయుక్తములు; వివేకంబు = విడమరచి తెలియు తెలివి; చేయ = ఉపయోగించు; నేర్చిన = నేర్పు కలిగిన; విజ్ఞన = విశేష ఙ్ఞానము నందు; నిపుణులున్ = నైపుణ్యము కలవారు; ఉన్నత = అధికమైన; సత్త్వ = సాత్విక గుణముచేత; గరిష్ఠులు = గొప్పవారు; బహువిధ = అనేక విధములైన; తపః = తపస్సులు చేయు టందు; వ్రత = వ్రతనిష్ఠ లందు; నియమ = నియమ పాలన లందు; శీలురు = మెలగువారు; అనల్ప = మిక్కిలి; తేజులు = తేజస్సు కలవారు; మహత్ = మహత్తు; ఐశ్వర్య = అష్టైశ్వర్యములు (అణిమాది); శక్తి = సర్వశక్తులు (సర్వజ్ఞత్వాది); ధరులు = పొందినవారు; పరతత్వ = పరబ్రహ్మను; వేదులు = తెలిసినవారు; అఖిల = సర్వ; లోకపాల = ఎల్ల లోకములలోని ప్రభులచేత; పూజితులు = గౌరవింపబడువారు; విగత = తొలగిన; పాపులు = పాపములు కలవారు {త్రివిధపాపములు - 1అంహ (దోషము) 2ఆగము (తప్పు) 3ఏనస్సు (అపరాధము)}; పరమ = ఉత్కృష్టమైన; యోగి = ఋషి; ఇంద్రులు = శ్రేష్ఠులు; ఉండన్ = ఉండగా; వీరిన్ = వీరెవరిని; కైకొనక = లక్ష్యపెట్టకుండ; వివేకరహితులు = తెలివిలేనివారు; ఐ = అయ్యి; గోపాల = గొల్ల; బాలునిన్ = పిల్లవానిని; పూజచేయుటకున్ = పూజించుటకు; ఎట్లు = ఏ విధముగ; సమ్మతించిరి = ఒప్పుకొన్నారు; పురోడాశంబున్ = యజ్ఞ శిష్ట హవిస్సునకు; సృగాలంబున్ = నక్క; కున్ = కు; అర్హంబు = తగినది; అగునే = ఔతుందా, కాదు; అదియునున్ = అంతే; కాక = కాకుండా.

భావము:

నీతి తప్పాయని ఎలా అంటున్నావు అంటారా! యోగ్యత అయోగ్యతలనూ నిర్ణయించ గలిగిన మహా వివేకులు, గొప్ప సత్త్వగుణ సంపన్నులు, పాపరహితులు, సకల విధ మహా తపస్సులు, వ్రతశీలులు, మహా నియమ పాలకులు, అమిత తేజోశాలురు, గొప్ప ఐశ్వర్యవంతులు, బ్రహ్మజ్ఞానులు, సమస్త లోకపాలుర చేత పూజింపబడువారు, యోగీశ్వరులు ఎందరో ఈ సభలో ఉన్నారు. వీరందరినీ లెక్కించక బుద్ధిహీనుడైన ఒక గొల్లపిల్లవాడిని పూజించటానికి ఎలా సమ్మతించారు. యజ్ఞం కోసం ఉద్దేశించిన పురోడాశం నక్కకు ఎలా అర్హమవుతుంది? అంతేకాకుండా...