పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజసూయంబు నెఱవేర్చుట

  •  
  •  
  •  

10.2-785-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పూజించి యానందబాష్పజల బిందుసందోహకందళిత నయనారవిందంబులం గోవిందుని సుందరాకారంబు దర్శింపఁ జాలకుండె; నట్లు పూజితుండై తేజరిల్లు పుండరీకాక్షు నిరీక్షించి హస్తంబులు నిజమస్తకంబుల ధరించి వినుతుల సేయుచు, నఖిలజనంబులు జయజయ శబ్దంబు లిచ్చిరి; దేవతలు వివిధ తూర్యఘోషంబులతోడం బుష్పవర్షంబులు గురియించి; రయ్యవసరంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; పూజించి = అర్చించి; ఆనంద = ఆనందపు; బాష్పజల = కన్నీటి; బిందు = బిందువుల; సందోహ = సమూహముల; కందళిత = అంకురించిన; నయన = కన్నులు అను; అరవిందంబులన్ = పద్మములతో; గోవిందుని = కృష్ణుని; సుందర = అందమైన; ఆకారంబు = స్వరూపమును; దర్శింపజాలక = చూడలేకుండా; ఉండెన్ = ఉండెను; అట్లు = ఆ విధముగా; పూజితుండు = అర్చింపబడినవాడు; ఐ = అయ్యి; తేజరిల్లు = ప్రకాశించు; పుండరీకాక్షున్ = కృష్ణుని; నిరీక్షించి = చూసి; హస్తంబులున్ = చేతులు; నిజ = తమ; మస్తకంబులన్ = తలలమీద; ధరించి = పెట్టుకొని; వినుతులన్ = స్తోత్రములు; చేయుచున్ = చేస్తూ; అఖిల = ఎల్ల; జనంబులున్ = వారు; జయజయ = జయముజయము అను; శబ్దంబులున్ = ధ్వానములు; ఇచ్చిరి = చేసారు; దేవతలు = దేవతలు; వివిధ = నానా రకముల; తూర్య = వాద్యముల; ఘోషంబుల = మోతల; తోడన్ = తోటి; పుష్ప = పూల; వర్షంబులున్ = వానలు; కురియించిరి = కురిపించిరి; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు;

భావము:

ఆ విధంగా ధర్మరాజు గోవిందుడిని పూజించి ఆనందబాష్పాలు కనుల నిండా కమ్ముటచే, ఆయన సుందరాకారాన్ని సరిగా చూడలేకపోయాడు. ఈ విధంగా పూజించబడి ప్రకాశించే పుండరీకాక్షుడు శ్రీకృష్ణుని చూసి సమస్త ప్రజలూ చేతులుజోడించి అనేక విధాల పొగడుతూ, జయజయ ధ్వానాలు చేశారు. దేవతల వివిధ మంగళ వాద్యాలు మ్రోగిస్తూ పుష్పవర్షం కురిపించారు.