పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజసూయంబు నెఱవేర్చుట

  •  
  •  
  •  

10.2-777-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూజించునప్పు డందగ్రపూజార్హు లెవ్వరని యడిగిన సదస్యులు దమకుఁ దోఁచిన విధంబులం బలుక వారి భాషణంబులు వారించి వివేకశీలుండును, జతురవచనకోవిదుండును నగు సహదేవుండు భగవంతుండును, యదుకులసంభవుండును నైన శ్రీకృష్ణునిం జూపి “యిమ్మహాత్ముని సంతుష్టుంజేసిన భువనంబు లన్నియుం బరితుష్టిం బొందు” నని చెప్పి ధర్మజుం జూచి యిట్లనియె.

టీకా:

పూజించున్ = గౌరవించు; అప్పుడు = సమయము నందు; అందున్ = వారందరిలోను; అగ్ర = మొట్టమొదటిగా, ఉన్నతునిగా; పూజన్ = సన్మానించుటకు; అర్హులు = తగినవారు; ఎవ్వరు = ఎవరు; అని = అని; అడిగినన్ = అడుగగా; సదస్యులు = సభికులు; తమ = వారల; కున్ = కు; తోచిన = తట్టిన; విధంబులన్ = విధములుగా; పలుకన్ = చెప్పుతుండగా; వారి = వారల; భాషణంబులు = మాటలను; వారించి = అడ్డుకొని; వివేకశీలుండును = యుక్తాయుక్త విచక్షణుడు; చతుర = నేర్పుగా; వచన = మాట్లాడుట; కోవిదుండును = బాగా తెలిసినవాడు; అగు = ఐన; సహదేవుండు = సహదేవుడు; భగవంతుండును = షడ్గుణైశ్వర్య సంపన్నుడు; యదు = యదువు యొక్క; కుల = వంశమున; సంభవుండును = పుట్టినవాడు; ఐన = అయిన; శ్రీకృష్ణునిన్ = శ్రీకృష్ణుడిని; చూపి = చూపించి; ఈ = ఈ దివ్యమైన; మహాత్ముని = మహాత్ముడిని; సంతుష్టున్ = తృప్తిపడినవానిగా; చేసినన్ = చేసినచో; భువనంబులు = లోకములు; అన్నియున్ = ఎల్ల; పరితుష్టిన్ = తృప్తిని; పొందును = పొందుతాయి; అని = అని; చెప్పి = చెప్పి; ధర్మజున్ = ధర్మరాజును; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా యాగాంతంలో పెద్దలను పూజించే సందర్భంలో అగ్రపూజకు అర్హులు ఎవరు అని అడుగగా, సభలో ఉన్నవారు ఎవరికి తోచినట్లు వారు తలకొక రకంగా చెప్పసాగారు. వారి మాటలను వారించి, వాక్ చాతుర్యం కలవాడు, బుద్ధిమంతుడు ఐన సహదేవుడు కృష్ణుడిని చూపించి “ఈ మహాత్ముడిని సంతుష్టుణ్ణి చేస్తే సమస్త లోకాలూ సంతోషిస్తాయి.” అని పలికి ధర్మరాజుతో ఇలా అన్నాడు.