పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజ బంధ మోక్షంబు

  •  
  •  
  •  

10.2-758-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లయిన మీరలు బ్రహ్మసాయుజ్య ప్రాప్తులయ్యెదురు; మదీయ పాదారవిందంబులందుఁ జలింపని భక్తియుఁ గలుగు"నని యానతిచ్చి యా రాజవరుల మంగళస్నానంబులు సేయించి, వివిధ మణి భూషణ మృదులాంబర మాల్యానులేపనంబు లొసంగి, భోజన తాంబూలాదులం బరితృప్తులం జేసి, యున్నత రథాశ్వ సామజాధిరూఢులం గావించి, నిజరాజ్యంబులకుఁ బూజ్యులంచేసి, యనిచిన.

టీకా:

అట్లు = అలా; అయినన్ = అయినచో; మీరలు = మీరు; బ్రహ్మ = పరబ్రహ్మము నందు; సాయుజ్యము = కూడి ఉండుట, లీనమగుట; ప్రాప్తులు = పొందినవారు; అయ్యెదరు = ఔతారు; మదీయ = నా యొక్క; పాద = పాదములు అను; అరవిందంబుల్ = పద్మముల; అందున్ = ఎడల; చలింపని = నిశ్చలమైన; భక్తియున్ = భక్తి; కలుగును = లభించును; అని = అని; ఆనతిచ్చి = చెప్పి; ఆ = ఆ యొక్క; రాజ = రాజ; వరులన్ = ఉత్తములను; మంగళ = పరిశుద్ధ; స్నానంబులు = స్నానములు; చేయించి = చేయించి; వివిధ = నానా విధములైన; మణి = రత్నాలు; భూషణ = అలంకారములు; మృదుల = మెత్తని; అంబర = వస్త్రములు; మాల్య = పూలదండలు; అనులేపనంబులు = మైపూతలు; ఒసంగి = ఇచ్చి; భోజన = భోజనము; తాంబూల = తాంబూలములు; ఆదులన్ = మున్నగువానిచేత; పరితృప్తులన్ = సంతృప్తి చెందినవారిగా; చేసి = చేసి; ఉన్నత = ఉత్తమమైన; రథ = రథములు; అశ్వ = గుఱ్ఱములు; సామజ = ఏనుగులు; అధిరూఢులన్ = ఎక్కినవారిగా; కావించి = చేసి; నిజ = తమతమ; రాజ్యంబుల్ = రాజ్యముల; కున్ = కు; పూజ్యులన్ = గౌరవింపదగినవారిగా; చేసి = చేసి; అనిచినన్ = పంపించగా.

భావము:

మీరు కనక అలా నడచుకుంటే ముక్తిని పొందుతారు. నా పాదాలపై మీకు అచంచలమైన భక్తి సిద్ధిస్తుంది.” అని ఆనతి ఇచ్చి, శ్రీకృష్ణుడు ఆ రాజులకు అందరికీ మంగళస్నానాలు చేయించాడు. మణిభూషణాలూ, మాల్య వస్త్ర గంధాలనూ బహుకరించాడు. సుష్ఠుగా భోజన తాంబూలాదులు పెట్టించాడు. వారిని సంతృప్తులను చేసాడు. రథాలు గుఱ్ఱాలు గజాలు ఎక్కింపించి, వారి వారి రాజ్యాలకు పంపించాడు.