పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రాజ బంధ మోక్షంబు

  •  
  •  
  •  

10.2-746-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యవసరంబునఁ గృష్ణుండు దన దివ్యచిత్తంబున మఱవ నవధరింపక చెఱలు విడిపించిన, వారలు పెద్దకాలంబు కారాగృహంబులఁ బెక్కు బాధలం బడి కృశీభూతశరీరు లగుటంజేసి, రక్తమాంస శూన్యంబులై త్వగస్థిమాత్రావశిష్టంబులును, ధూళిధూసరంబులు నైన దేహంబులు గలిగి, కేశపాశంబులు మాసి, జటాబంధంబు లైన శిరంబులతో మలినవస్త్రులై చనుదెంచి; యప్పుడు.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; కృష్ణుండు = కృష్ణుడు; తన = తన యొక్క; దివ్య = గొప్ప; చిత్తంబునన్ = మనసు నందు; మఱవన్ = మరచుటను; అవధరింపక = చేపట్టకుండా; చెఱలు = చెరసాలలనుండి; విడిపించినన్ = విడుదల చేయించగా; వారలు = వారు; పెద్ద = చాలా; కాలంబున్ = కాలమునుండి; కారాగృహంబులన్ = చెరసాలలలో; పెక్కు = అనేకమైన; బాధలన్ = బాధలను; పడి = అనుభవించి; కృశీభూత = చిక్కిపోయిన; శరీరులు = దేహములు కలవారు; అగుటన్ = అగుట; చేసి = వలన; రక్త = నెత్తురు; మాంస = కండలు; శూన్యంబులు = లేనివి; ఐ = అయ్యి; త్వక్ = చర్మము; అస్థి = ఎముకలు; మాత్ర = మాత్రమే; అవశిష్టంబులు = మిగిలినవి; ధూళిధూసరంబులున్ = దుమ్ము కమ్ముకొనినవి; ఐన = అయిన; దేహంబులున్ = శరీరములు; కలిగి = ఉండి; కేశపాశంబులు = జుట్టుముళ్ళు; మాసి = మకిలిపట్టి; జటాబంధంబులు = జటలు కట్టినవి; ఐన = అయిన; శిరంబుల్ = తలలు; తోన్ = తోటి; మలిన = మురికి పట్టిన; వస్త్రులు = బట్టలు కలవారు; ఐ = అయ్యి; చనుదెంచి = వచ్చి; అప్పుడు = అప్పుడు.

భావము:

అలా ఆ సమయంలో శ్రీకృష్ణుడు మరచిపోకుండా ఆ రాజులు అందరిని కారాగారం నుండి విముక్తులను చేసాడు. వారు చాలాకాలం పాటు చెరసాలలో బంధించబడి అనేక బాధలు పడుతూ ఉండడం వలన రక్తమాంసాలు క్షీణించి, చిక్కిశల్యమై, దుమ్ముకొట్టుకున్న శరీరాలతో, జడలు కట్టిన తలలతో, మాసిన బట్టలతో వాసుదేవుడి వద్దకు వచ్చారు.