పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట

  •  
  •  
  •  

10.2-694-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదనంతరంబ శోభనపదార్థంబులు కొనివచ్చి ధరామర ధరావర వణిక్పుంగవులు దామోదరునకు కానుక లిచ్చిరి; పుణ్యాంగనా జనంబులు పసిండిపళ్లెరంబులఁ గర్పూరనీరాజనంబులు నివాళింప నంతఃపురంబు సొత్తెంచె; నంతం గుంతిభోజనందనయుం గృష్ణునిం గని పర్యంకంబు డిగ్గి కౌఁగిలింప నా యదువల్లభుఁడు మేనత్తకుం బ్రణామం బాచరించెఁ; బాంచాలియు ముకుందునకు నభివందనం బొనరించి కుంతిపంపున గోవిందు భామినులగు రుక్మిణి మొదలగువారికి గంధాక్షత కుసుమ తాంబూలంబులిడి లలిత దుకూల మణి భూషణంబులం బూజించె; యుధిష్ఠిరుండును గమలనయనుని వధూజనుల ననుగత బంధుమిత్ర పుత్త్ర సచివ పురోహిత పరిచారక సముదయంబుల నుచితంబు లగు స్థలంబుల విడియింప నియమించి దినదినంబును నభినవంబు లగు వివిధోపచారంబులు గావించుచుండె.

టీకా:

తదనంతరంబ = ఆ తరువాత; శోభన = మంగళ; పదార్థంబులున్ = ద్రవ్యములను; కొనివచ్చి = తీసుకొనివచ్చి; ధరామర = విప్రులు; ధరావర = రాజులు; వణిక్ = వ్యాపారములుచేయు; పుంగవులు = ఉత్తములు; దామోదరు = కృష్ణుని; కున్ = కి; కానుకలు = బహుమతులు; ఇచ్చిరి = ఇచ్చారు; పుణ్యాంగనా = ముత్తైదులల; జనంబులు = సమూహములు; పసిండి = బంగారు; పళ్ళెరంబులన్ = పళ్ళేలలో; కర్పూర = కర్పూరపు; నీరాజనంబులు = హారతులు; నివాళింపన్ = దిగదుడువగా; అంతఃపురంబున్ = అంతఃపురమును; చొత్తెంచెన్ = ప్రవేశించెను; అంతన్ = అంతట; కుంతిభోజనందనయున్ = కుంతీదేవి {కుంతిభోజనందన - కుంతిభోజుని కూతురు, కుంతీదేవి}; కృష్ణునిన్ = కృష్ణుడుని; కని = చూసి; పర్యంకంబున్ = మంచమును; డిగ్గి = దిగి; కౌగలింపన్ = ఆలింగనము చేసికొనగా; ఆ = ఆ; యదువల్లభుడు = కృష్ణుడు {యదువల్లభుడు - యాదవుల ప్రభువు, కృష్ణుడు}; మేనత్త = మేనత్త {మేనత్త - తండ్రికి చెల్లెలు}; కున్ = కు; ప్రణామంబులున్ = నమస్కారములు; ఆచరించెన్ = చేసెను; పాంచాలియున్ = ద్రౌపది {పాంచాలి - పాంచాల దేశ రాకుమారి, ద్రౌపది}; ముకుందున్ = కృష్ణుని; కున్ = కు; అభివందనంబున్ = నమస్కారము; ఒనరించి = చేసి; కుంతి = కుంతీదేవి; పంపునన్ = చెప్పినట్లు; గోవిందు = కృష్ణుని; భామినులు = భార్యలు; అగు = ఐన; రుక్మిణి = రుక్మిణీదేవి; మొదలగు = మొదలైన; వారి = వారల; కిన్ = కు; గంధ = చందనము; అక్షత = అక్షింతలు; కుసుమ = పూలు; తాంబూలంబులున్ = తాంబూలములు; ఇడి = ఇచ్చి; లలిత = చక్కటి; దుకూల = మంచిబట్టలు; మణి = రత్నాల; భూషణంబులన్ = అలంకారములతో; పూజించెన్ = సత్కరించెను; యుధిష్ఠిరుండును = ధర్మరాజు; కమలనయనుని = కృష్ణుని; వధూ = భార్యలు; జనులన్ = అందరను; అనుగత = కూడావచ్చిన; బంధు = బంధువులు; మిత్ర = మిత్రులు; పుత్ర = కొడుకులు; సచివ = మంత్రులు; పురోహిత = పురోహితులు; పరిచారక = సేవకురాళ్ళు; సముదయంబులను = సమూహములను; ఉచితంబులు = తగినట్టివి; అగు = ఐన; స్థలంబులన్ = తావులందు; విడియించి = విడిదులలో ఉండమని; నియమించి = ఆఙ్ఞాపించి; దినదినంబును = ఏరోజు కారోజు; అభినవంబులు = సరికొత్తలైనవి; అగు = ఐన; వివిధ = నానారకముల; ఉపచారంబులున్ = సేవలు; కావించుచుండెన్ = చేయించసాగెను.

భావము:

అటు పిమ్మట బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు నుండి మంగళ పదార్థాలు కానుకలుగా స్వీకరించాడు. ముత్తైదువలు బంగారుపళ్ళెరాలతో కర్పూరహారతులు ఇస్తూ ఉండగా శ్రీకృష్ణుడు అంతఃపురం ప్రవేశించాడు. కుంతిభోజమహారాజు పుత్రిక, శ్రీకృష్ణుని మేనత్త అయిన కుంతీదేవి కృష్ణుడిని చూసి పాన్పుదిగి వచ్చి కౌగలించుకుంది. కృష్ణుడు ఆమెకు వందనం చేసాడు. ద్రౌపది పాంచాల రాకుమారి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి, కుంతీదేవి ఆజ్ఞ ప్రకారం కృష్ణుడి భార్యలైన రుక్మిణి మున్నగువారికి గంధాక్షతలూ, పువ్వులూ, తాంబూలాలూ, పట్టుచీరలూ, మణిభూషణాలు ఇచ్చి గౌరవించింది. ధర్మరాజు శ్రీకృష్ణుడికీ, ఆయన అంతఃపుర కాంతలకూ, పరివారానికీ అందరికీ వారి వారి యోగ్యతలకు అనుకూలమైన స్థలాలలో విడుదులు ఏర్పాటు చేయించి, సకల నవ్య సౌకర్యాలూ సమకూర్చాడు.