పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : భూసురుని దౌత్యంబు

  •  
  •  
  •  

10.2-654-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు తనపడిన బన్నములం దలంపక సింహంబు సమదదంతావళంబుల నరికట్టి కావరించు చందంబున మమ్ముం జెఱపట్టి బాధించుచున్న యప్పాపాత్ముని మర్దించి కారాగృహబద్ధుల మగు మా నిర్బంధంబులు వాపి, సుత దార మిత్ర వర్గంబులం గూర్చి యనన్యశరణ్యులమైన మమ్ము రక్షింపు”మని విన్నవించి" రని బ్రాహ్మణుండు విన్నపంబు సేయు సమయంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; తన = తాను; పడిన = పడిన; బన్నములన్ = భంగపడుటలను; తలపక = తలచక; సింహంబు = సింహము; సమద = మదించిన; దంతావళంబులన్ = ఏనుగులను; అరికట్టి = అడ్డగించి; కావరించు = అహంకరించు; చందంబునన్ = విధముగా; మమ్మున్ = మమ్ములను; చెఱపట్టి = బంధించి; బాధించుచున్న = బాధపెడుతున్న; ఆ = ఆ; పాపాత్ముని = పాపిష్ఠిబుద్ధి కలవానిని; మర్దించి = శిక్షించి; కారాగృహ = చెరసాలలో; బద్దులము = బంధీలము; అగు = ఐన; మా = మా యొక్క; నిర్బంధంబులున్ = నిర్బంధములను; పాపి = పోగొట్టి; సుత = కొడుకులు; దార = భార్యలు; మిత్ర = మిత్రులు; వర్గంబులన్ = సమూహములతో; కూర్చి = కలిపి; అనన్యశరణ్యులము = నీవుతప్పింకే దిక్కులేనివారము; ఐన = అయిన; మమ్మున్ = మమ్ములను; రక్షింపుము = కాపాడుము; అని = అని; విన్నవించిరి = మనవి చేసిరి; అని = అని; బ్రాహ్మణుండు = విప్రుడు; విన్నపంబున్ = మనవి; చేయు = చేస్తున్న; సమయంబునన్ = సమయము నందు.

భావము:

అయినా, వాడు తాను పడిన కష్టాలను నష్టాలను గుర్తు పెట్టుకోడంలేదు. మదపుటేనుగులను అరికట్టి విఱ్ఱవీగే సింహంలా మమ్మల్ని చెరపట్టి మిడిసిపడుతున్నాడు. వాడిని శిక్షించి చెరసాలలో మ్రగ్గుతున్న మా నిర్బంధాలను విడిపించు. మా భార్యాపుత్రులను కలుసుకొనేలా అనుగ్రహించి, మరో దిక్కులేని మమ్మల్ని కాపాడు” అని ఆ రాజులందరూ నీకు విన్నవించమన్నారు” అని బ్రాహ్మణుడు మనవి చేస్తున్న సమయంలో.... (విజ్ఞాన విశారదుడైన నారదుడు అచ్చటికి వేంచేసాడు.)