పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : షోడశసహస్ర స్త్రీ సంగతంబు

  •  
  •  
  •  

10.2-619-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కచోట నుచితసంధ్యోపాపనాసక్తు-
నొకచోటఁ బౌరాణికోక్తికలితు
నొకచోటఁ బంచయజ్ఞోచితకర్ముని-
నొకచోట నమృతోపయోగలోలు
నొకచోట మజ్జనోద్యోగానుషక్తుని-
నొకచోట దివ్యభూషోజ్జ్వలాంగు
నొకచోట ధేనుదానోత్కలితాత్ముని-
నొకచోట నిజసుతప్రకరయుక్తు

10.2-619.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నొక్క చోటను సంగీతయుక్త చిత్తు
నొక్కచోటను జలకేళియుతవిహారు
నొక్కచోటను సన్మంచకోపయుక్తు
నొక్కచోటను బలభద్రయుక్తచరితు.

టీకా:

ఒక = ఒకానొక; చోటన్ = తావునందు; ఉచిత = తగినవిధంగా; సంధ్యోపాసనా = సంధ్యావందనముచేయుటందు; ఆసక్తున్ = ఆసక్తికనబరచువానిని; ఒక = ఒకానొక; చోటన్ = ప్రదేశమున; పౌరాణిక = పురాణముచెప్పువాని; ఉక్తిన్ = ప్రసంగమువినుటను; కలితున్ = కూడినవానిని; ఒక = ఒకానొక; చోటన్ = చోటునందు; పంచయజ్ఞ = పంచమహాయజ్ఞములుచేయుటకు {పంచమహాయజ్ఞములు - 1దేవయజ్ఞము 2పితృయజ్ఞము 3భూతయజ్ఞము 4మనుష్యయజ్ఞము 5బ్రహ్మయజ్ఞము, చూ. అనుయుక్తములు}; ఉచిత = తగిన; కర్ముని = పనులుచేయువానిని; ఒక = ఒకానొక; చోటన్ = స్థలమునందు; అమృత = నీటిని; ఉపయోగ = తాగుటందు; లోలున్ = లగ్నమైనవానిని; ఒక = ఒకానొక; చోటన్ = తావునందు; మజ్జన = స్నానముచేయు; ఉద్యోగ = ప్రయత్నమున; అనుషక్తుని = నిమగ్నమైనవానిని; ఒక = ఒకానొక; చోటన్ = తావున; దివ్య = గొప్ప; భూష = ఆభరణములచే; ఉజ్వల = మెరిసిపోతున్న; అంగున్ = దేహము కలవానిని; ఒక = ఒకానొక; చోటన్ = తావున; ధేను = పాడియావులను; దాన = దానముచేయుటందు; ఉత్కలిక = ఉత్సాహముకల; ఆత్మునిన్ = మనస్సుకలవానిని; ఒక = ఒకానొక; చోటన్ = తావున; నిజ = తన; సుత = పిల్లల; ప్రకర = సమూహముతో; యుక్తున్ = కూడి ఉన్నవానిని; ఒక్క = ఒకానొక; చోటన్ = తావున; సంగీత = పాటల కార్యక్రమమున; యుక్త = కూడిన; చిత్తున్ = మనస్సుకలవానిని; ఒక = ఒకానొక; చోటును = తావున; జలకేళీ = జలక్రీడ యందు; యుత = కూడిన; విహారున్ = విహారము కలవానిని; ఒక్క = ఒకానొక; చోటను = తావున; సన్మంచక = మంచి మంచయందు, సత్సంగమమున; ఉపయుక్తున్ = పాల్గొనుచున్నవానిని; ఒక్క = ఒకానొక; చోటను = తావున; బలభద్ర = బలరామునితో; యుక్త = కూడి; చరితున్ = చరించువానిని.

భావము:

ఒక ఇంటిలో సంధ్యావందనం చేస్తూ ఉన్న వాడిని; మరొక గృహంలో పురాణశ్రవణం చేస్తూ ఉన్న వాడిని; ఒక చోట పంచయజ్ఞాలు ఆచరిస్తున్నవాడిని; మరొక తావున యోగసమాధి నిమగ్నమై ఉన్న వాడిని; ఒక స్థలంలో స్నానానికి సిద్ధమవుతూ ఉన్న వాడిని; ఇంకొక చోట ప్రశస్త భూషణాలతో ప్రకాశిస్తున్న వాడిని; మరొక ప్రదేశంలో గోదానం చేయాలని కుతూహలపడుతూ ఉన్న వాడిని; ఇంకొక ప్రదేశంలో తన కుమారులతో ఆడుకుంటున్న వాడినీ; ఒకచోట సంగీతం మీద ఆసక్తిని చూపుతున్న వాడిని; మరొక చోట జలకేళి ఆడుతున్నవాడిని; ఇంకొక చోట మంచం మీద కుర్చున్న వాడిని; మరొకచోట బలరాముడి తో కలిసి ఉన్న వాడిని, యిలా పలుస్థలములలో పలుక్రియలలో నిమగ్నుడై యున్న శ్రీకృష్ణుడిని నారదమహర్షి సందర్శించాడు.