పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : షోడశసహస్ర స్త్రీ సంగతంబు

  •  
  •  
  •  

10.2-612-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యభ్యర్థించి యద్దేవునివలనం బ్రసన్నత వడసి, తన్మందిరంబు వెడలి మునివరుం డమ్మహాత్ముని యోగమాయాప్రభావంబు దెలియంగోరి, వేఱొక చంద్రబింబాననాగేహంబునకుం జని యందు నెత్తమాడుచున్న పురుషోత్తము నుద్ధవ యుతుం గని యద్భుతంబు నొందుచు నతనిచేత సత్కృతుండై యచ్చోట వాసి చని.

టీకా:

అని = అని; అభ్యర్దించి = వేడుకొని; ఆ = ఆ; దేవుని = భగవంతుని; వలనన్ = వలన; ప్రసన్నతన్ = అనుగ్రహమును; పడసి = పొంది; తత్ = ఆ; మందిరంబున్ = ఇంటినుండి; వెడలి = బయటకువచ్చి; ముని = యోగి; వరుండు = ఉత్తముడు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; మహాత్ముని = గొప్పమహిమ కలవాని యొక్క; యోగ = యోగము యొక్క; మాయా = మహిమల; ప్రభావంబున్ = ప్రభావమును; తెలియన్ = తెలిసికొన; కోరి = తలచి; వేఱు = మరింక; ఒక = ఒక; చంద్రబింబాననా = స్త్రీ యొక్క; గేహంబున్ = ఇంటి; కున్ = కి; చని = వెళ్ళి; అందున్ = దానిలో; నెత్తము = పాచికలు; ఆడుచున్న = ఆడుతున్నట్టి; పురుషోత్తమునున్ = కృష్ణుని; ఉద్ధద్దవ = ఉద్ధవునితో; యుతున్ = కూడి ఉన్నవానిని; కని = చూసి; అద్భుతంబున్ = ఆశ్చర్యమును; ఒందుచున్ = పొందుతు; అతని = ఆ కృష్ణుని; చేత = చేత; సత్కృతుండు = సన్మానింపబడినవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; చోటన్ = తావును; పాసి = విడిచి; చని = పోయి.

భావము:

ఆ విధంగా ప్రార్థించి నారదుడు శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాడు. ఆ మందిరం నుంచి బయటకు వచ్చిన ఆ దేవర్షి వాసుదేవుడి యోగమాయా ప్రభావం తెలుసుకోదలచాడు. వేరొక వాల్గంటి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఉద్ధవునితో కలసి జూదమాడుతూ ఉన్న శ్రీకృష్ణుడిని తిలకించి ఆశ్చర్యచకితుడు అయ్యాడు. అక్కడ కృష్ణుడిచేత పూజించబడి ఆ భవనం నుండి బయటకు వెళ్ళాడు.