పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శమంతకమణి పొందుట

  •  
  •  
  •  

10.2-51-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు పలికిన మూఢజనులఁ జూచి గోవిందుండు నగి మణి సమేతుండైన సత్రాజితుండుగాని సూర్యుండు గాఁడని పలికె; నంత సత్రాజితుండు శ్రీయుతంబయి మంగళాచారంబైన తన గృహంబునకుం జని, మహీసురులచేత నిజదేవతా మందిరంబున నమ్మణి శ్రేష్ఠంబు ప్రవేశంబు సేయించె; నదియును బ్రతిదినంబు నెనిమిది బారువుల సువర్ణంబు గలిగించు చుండు.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలికినన్ = అనగా; మూఢ = తెలియని; జనులన్ = వారిని; చూచి = చూసి; గోవిందుండు = కృష్ణుడు; నగి = నవ్వి; మణి = రత్నము; సమేతుండు = కలిగినవాడు; ఐన = అయిన; సత్రాజితుండు = సత్రాజిత్తు; కాని = తప్పించి; సూర్యుండు = సూర్యుడు; కాడు = కాడు; అని = అని; పలికెన్ = చెప్పెను; అంతన్ = అప్పుడు; సత్రాజితుండు = సత్రాజిత్తు; శ్రీయుతంబు = కలిమితో కూడినది; అయి = అయ్యి; మంగళా = శుభ; ఆచారంబు = కార్యాచరణములు కలది; ఐన = అయిన; తన = తన యొక్క; గృహంబున్ = ఇంటి; కున్ = కి; చని = వెళ్ళి; మహీసురుల = బ్రాహ్మణుల {మహీసురులు - భూమికి దేవతలు, విప్రులు}; చేత = చేత; నిజ = తన యొక్క; దేవతా = దేవుడి; మందిరంబునన్ = స్థానము నందు; ఆ = ఆ యొక్క; మణిన్ = రత్నములలో; శ్రేష్ఠంబున్ = ఉత్తమమైన దానిని; ప్రవేశంబు = లోనుంచుట; చేయించి = చేయించెను; అదియున్ = అది; ప్రతి = ప్రతి యొక్క; దినంబున్ = రోజుల; ఎనిమిది = ఎనిమిది (8); బారువుల = బారువుల {బారువ - ఇరవై (20) మణుగుల బరువు, మణుగు - ఎనిమిది వీశల బరువు}; సువర్ణంబు = బంగారమును; కలిగించుచుండున్ = ఇచ్చుచుండును.

భావము:

అని తనకు చెప్తున్న అమాయకుల మాటలకు నవ్వి శ్రీకృష్ణుడు “అతడు సత్రాజిత్తు మణిని ధరించి వస్తున్నాడు. అంతే తప్ప, సూర్యుడు కాదు” అని చెప్పాడు. అనంతరం సత్రాజిత్తు మంగళ ఆచారాలతో శ్రీమంతమైన తన ఇంటికి వెళ్ళి, దేవతామందిరంలో శమంతకమణిని బ్రాహ్మణుల చేత ప్రవేశపెట్టించాడు. ఆ మణి రోజుకి ఎనిమిది బారువుల చొప్పున ప్రతి రోజు బంగారాన్ని ఇస్తూ ఉంటుంది.