పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శమంతకమణి పొందుట

  •  
  •  
  •  

10.2-48-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని శుకయోగివర్యుం డిట్లనియె. "సత్రాజిత్తనువాఁడు సూర్యునకు భక్తుండై చెలిమి, సేయ నతనివలన సంతసించి సూర్యుండు శమంతకమణి నిచ్చె; నా మణి కంఠంబున ధరియించి సత్రాజిత్తు భాస్కరుని భంగి భాసమానుం డై ద్వారకానగరంబునకు వచ్చిన; దూరంబున నతనిం జూచి జనులు మణిప్రభాపటల తేజోహృతదృష్టులయి సూర్యుం డని శంకించి వచ్చి; హరి కిట్లనిరి.

టీకా:

అనినన్ = అని అడుగగా; విని = విని; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; వర్యుండు = స్తుతింప దగినవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; సత్రాజిత్తు = సత్రాజిత్తు; అను = అనెడి; వాడు = అతను; సూర్యున్ = సూర్యుడి; కున్ = కి; భక్తుండు = భక్తుడు; ఐ = అయ్యి; చెలిమి = స్నేహము; చేయన్ = చేయగా; అతని = అతని; వలన = ఎడల; సంతసించి = తృప్తిచెంది; సూర్యుండు = సూర్యుడు; శమంతక = శమంతకము అను; మణిన్ = రత్నమును; ఇచ్చెన్ = ఇచ్చెను; ఆ = ఆ యొక్క; మణిన్ = రత్నమును; కంఠమునన్ = మెడలో; ధరియించి = వేసుకొని; సత్రాజిత్తు = సత్రాజిత్తు; భాస్కరుని = సూర్యుని; భంగిన్ = వలె; భాసమానుండు = ప్రకాశించువాడు; ఐ = అయ్యి; ద్వారకానగరంబున్ = ద్వారకానగరమున; కున్ = కు; వచ్చినన్ = రాగా; దూరంబునన్ = దూరమునుండి; అతనిన్ = అతనిని; చూచి = చూసి; జనులు = ప్రజలు; మణి = రత్నము యొక్క; ప్రభా = కాంతి; పటల = సమూహముల; తేజః = తేజస్సుచేత; హృత = హరింపబడిన; దృష్టులు = చూపులు కలవారు; అయి = ఐ; సూర్యుండు = సూర్యుడు; అని = అని; శంకించి = సందేహించి; వచ్చి = వచ్చి; హరి = కృష్ణుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

రాజు పరీక్షిత్తు ఇలా అడుగగా శుకయోగి ఈలా చెప్పసాగాడు. ”సత్రాజిత్తు సూర్యుడిని భక్తితో ఆరాధించాడు. సూర్యుడు అతడి భక్తికి మెచ్చి సంతోషించి అతడికి శమంతకమణిని ఇచ్చాడు. ఆ మణిని కంఠంలో ధరించి సత్రాజిత్తు సూర్యునిలా వెలిగిపోతూ ద్వారకకి వచ్చాడు. ద్వారకానివాసులు ఆ మణి కాంతులకు కన్నులుమిరుమిట్లు గొలుపగా సూర్యుడని భ్రాంతిపడి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి ఇలా విన్నవించారు.