పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : హస్తిన గంగం ద్రోయబోవుట

  •  
  •  
  •  

10.2-588-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పూని కౌరవరాజధాని యైన కరినగరంబు కడతల హలాగ్రంబును జొనిపి యప్పుటభేదనవిస్తారంబగు గడ్డ భుజాగర్వ దుర్వారుండై పెకలించి తిగిచి గంగాప్రవాహంబునం బడఁద్రోయ గమకించిన నప్పుడు, మహాజలమధ్య విలోలంబగు నావ చందంబున నన్నగరంబు వడవడ వడంకుచు గోపుర వప్ర ప్రాకార సౌధా ట్టాలక తోరణ ధ్వజ ద్వార కవాట కుడ్య వీథీ యుతంబుగా నొడ్డ గెడవైనఁ బౌరజనంబులు పుడమి నడుగులిడంగరాక తడంబడుచు, నార్తులై కుయ్యిడుచుండి; రట్టియెడ నమ్మహోత్పాతంబులు గనుంగొని; తాలాంకుండు గినుక వొడమి కావించిన యుపద్రవంబుగా నెఱింగి; దానికిఁ బ్రతీకారంబు లేమిని; గళవళంబున భయాకులమానసు లై పుత్ర మిత్ర కళత్ర బంధు భృత్య పౌరజన సమేతంబుగా భీష్మ దుర్యోధనాది కౌరవులు వేగంబున నతని చరణంబుల శరణంబులుగాఁ దలంచి, సాంబునిఁ గన్యకాయుక్తంబుగా ననేక మణిమయ భూషణాంబర జాలంబుతోఁ గొనివచ్చి; దండప్రణామంబు లాచరించి కరకమలంబులు మొగిడ్చి యిట్లనిరి.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; పూని = సిద్ధమై; కౌరవ = కౌరవుల; రాజధాని = ముఖ్యపట్టణము; ఐన = అయిన; కరినగరంబున్ = హస్తినాపురమును; కడతల = చివరికొన నందు; హల = నాగేటి ఆయుధము యొక్క; అగ్రంబున్ = కొనను; చొనిపి = దూర్చి; ఆ = ఆ; పుటభేదన = పట్టణము అంత; విస్తారంబు = విస్తరించినది; అగు = ఐన; గడ్డన్ = నేలపలకను, నేలపెళ్ళను; భుజా = భుజబలము యొక్క; గర్వ = అధిక్యముచేత; దుర్వారుండు = వారింపరానివాడు; ఐ = అయ్యి; పెకలించి = పెళ్ళగించి; తిగిచి = లాగి; గంగా = గంగానదీ; ప్రవాహంబునన్ = ప్రవాహము నందు; పడ = పడునట్లు; త్రోయన్ = తోయుటకు; గమకించినన్ = ప్రయత్నిస్తుండగా; అప్పుడు = ఆ సమయము నందు; మహాజల = సముద్రపునీటి; మధ్యన్ = నడుమ; విలోలంబు = తూగునది; అగు = అయ్యెడి; నావ = పడవ; చందంబునన్ = వలె; ఆ = ఆ; నగరంబు = పట్టణము; వడవడ = వడవడ అనుచు; వడంకుచున్ = వణకిపోతూ; గోపుర = గోపురములు; వప్ర = కోట; ప్రాకార = ప్రహారీగోడలు; సౌధా = భవంతులు; అట్టాలక = మేడలు; తోరణ = తలవాకిళ్ళు; ధ్వజ = ధ్వజస్తంభములు; ద్వార = గుమ్మాలు; కవాట = తులుపులు; కుడ్య = గోడలు; వీథీ = ఇండ్లవరుసలు; యుతంబుగాన్ = కూడినదిగా; ఒడ్డగెడవు = ఒరిగినది; ఐనన్ = కాగా; పౌర = పురము నందలి; జనంబులున్ = ప్రజలు; పుడమిన్ = నేలమీద; అడుగు = అడుగులు; ఇడంగన్ = వేయుటకు; రాక = వీలుపడక; తడంబడుచున్ = తడబడుతు; ఆర్తులు = దుఃఖము నొందినవారు; ఐ = అయ్యి; కుయ్యిడుచుండిరి = మొరపెట్ట సాగిరి; అట్టి = అలాంటి; ఎడన్ = సమయము నందు; ఆ = ఆ; మహా = గొప్ప; ఉత్పాతంబులున్ = ఉపద్రవములను; కనుంగొని = చూసి; తాలంకుండు = బలరాముడు; కినుకన్ = కోపము; పొడమి = కలిగి; కావించిన = చేసిన; ఉపద్రవంబు = ప్రమాదము; కాన్ = అయినట్లు; ఎఱింగి = తెలిసికొని; దాని = ఆ ఉపద్రవమున; కిన్ = కు; ప్రతీకారంబున్ = ప్రతిక్రియ; లేమిని = లేకపోవుటచేత; కళవళంబునన్ = గాబరాతో, కంగారుతో; భయ = భయపడుటచే; ఆకుల = కలతచెందిన; మానసులు = మనస్సులు కలవారు; ఐ = అయ్యి; పుత్ర = కొడుకులు; మిత్ర = హితులు; కళత్ర = భార్యలు; బంధు = ఙ్ఞాతులు; భృత్య = సేవకులు; పౌరజన = పురప్రజలతో; సమేతంబుగా = కూడినవారై; భీష్మ = భీష్ముడు; దుర్యోధన = దుర్యోధనుడు; ఆది = మున్నగు; కౌరవులు = కౌరవులు; వేగంబునన్ = శీఘ్రమే; అతని = అతని యొక్క; చరణంబులన్ = పాదములను; శరణంబులు = రక్షకములు; కాన్ = అగునట్లు; తలంచి = విచారించుకొని; సాంబునిన్ = సాంబుడును; కన్యకా = బాలికతో; యుక్తంబుగా = కూడినవానిగా, సహా; మణి = రత్నాలు; మయ = పొదిగిన; భూషణ = అలంకారములు; అంబర = వస్త్రములు; జాలంబు = సమూహము; తోన్ = తోటి; కొనివచ్చి = తీసుకువచ్చి; దండప్రణామంబులు = సాగిలపడి మొక్కుటలు {దండప్రణామము - కఱ్ఱ వలె నేలపై పడి నమస్కరించుట, సాగిలపడి మొక్కుట}; ఆచరించి = చేసి; కర = చేతులు అను; కమలంబులున్ = కమలములను; మొగిడ్చి = జోడించి; ఇట్లు = ఈ విధముగా; అనిరి = పలికిరి.

భావము:

ఈ విధంగా చేబట్టిన తన హలాన్ని బలరాముడు, కౌరవరాజధాని అయిన హస్తినాపురం చిట్టచివరికొన భాగంలో తన నాగలి చివరి భాగాన్ని చొప్పించి, పట్టణం మొత్తం పెకలించి గంగలో కలపటానికి ఉద్యుక్తుడైనాడు. ఆ సమయంలో హస్తినాపురం సముద్రజలాల్లో ఊగిసలాడెడి పడవలాగ అయింది ఆ పట్టణం పరిస్థితి. గోపుర ప్రాకార సౌధాలతో సహా ఒక వైపుకు ఒరిగింది. పౌరులు హాహాకారాలు చేశారు. ఈ మహోపద్రవానికి భయపడిపోయారు. బలభద్రుని రౌద్రావేశం తగ్గించటానికి మరోమార్గం లేక భీష్మ దుర్యోధనాదు లందరూ పరుగెత్తుకుని వచ్చి బలరాముడిని శరణువేడారు. కన్యకను, సాంబుడిని తీసుకు వచ్చి అప్పజెప్పారు. అనేక మణిమయ భూషణాదులు కానుకగా ఇచ్చి, చేతులు జోడించి ఇలా ప్రార్థించారు...