పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బలుడు నాగనగరం బేగుట

  •  
  •  
  •  

10.2-578-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సితచ్ఛత్ర చామర శంఖ కిరీట చిత్రశయ్యా సౌధ సింహాసనంబులు గైకొనుట మన మందెమేలంబునం గాదె? యిట్టిచో సరివారునుం బోలె నూరక గర్వించు యదుకులులతోడి సంబంధ సఖ్యంబులు సాలుఁ; బాములకుఁ బాలు వోసి పెంచిన విషంబు దప్పునే? మమ్ముం దమ పంపుసేయ మనుట సిగ్గులేకుంటఁ గాదె! యదియునుంగాక దివ్యాస్త్రకోవిదులైన గంగానందన గురు కృపాశ్వత్థామ కర్ణాది యోధవీరులకున్ లోఁబడ్డవానిని మహేంద్రునకైనను విడిపింపఁవచ్చునే? యహహ! వృథాజల్పంబుల కేమిపని?” యని దుర్భాషలాడుచు దిగ్గున లేచి నిజమందిరంబునకుం జనియె; నప్పుడు హలాయుధుం డమ్మాటల కదిరిపడి.

టీకా:

సిత = తెల్లని; ఛత్ర = గొడుగు; చామర = వింజామర; శంఖ = శంఖము; కిరీట = కిరీటము; చిత్రశయ్య = విశిష్టమైన పాన్పులు; సౌధ = భవనములు; సింహాసనంబులు = సింహాసనములు; కైకొనుట = చేపట్టగలుగుట; మనమున్ = మన; మందెమేలంబునన్ = ఉపేక్షచేత; కాదె = కాదా; ఇట్టిచో = ఇలా ఉండగా; సరి = సమానస్థాయి; వారునున్ = వారి; పోలెన్ = వలె; ఊరక = ఉత్తినే; గర్వించు = అహంకరించు; యదుకులుల = యాదవ వంశస్థుల; తోడి = తోటి; సంబంధ = సంబంధాలు; సఖ్యంబులు = మిత్రత్వములు; చాలున్ = ఇక చాలు; పాములు = సర్పముల; కున్ = కు; పాలు = క్షీరములు; పోసి = ఇచ్చి; పెంచినన్ = పోషించినను; విషంబున్ = విషము; తప్పునే = పోవునా; మమ్మున్ = మమ్మల్ని; తమ = వారి; పంపున్ = ఉత్తరువులు అనుసరించుట; చేయుము = చేయమని; అనుట = అని చెప్పుట; సిగ్గు = సిగ్గు {సిగ్గు - స్తుత్యాదులచే కలుగు సంకోచము}; లేకుంటన్ = లేకపోవుటచేత; కాదె = కాదా; అదియునున్ = అంతే; కాక = కాకుండ; దివ్య = బహుగొప్ప; అస్త్ర = అస్త్రవిద్య లందు; కోవిదులు = పండితులు; ఐన = అగు; గంగానందన = భీష్ముడు; గురు = ద్రోణాచార్యుడు; కృప = కృపాచార్యుడు; అశ్వత్థామ = అశ్వత్థాముడు; కర్ణ = కర్ణుడు; ఆది = మొదలగు; యోధ = శూరులైన; వీరులు = వీరులు; కున్ = కు; లోబడ్డ = చిక్కిన; వానినిన్ = వాడిని; మహేంద్రు = మహేంద్రుడి; కు = కి; ఐననున్ = అయినను; విడిపింపన్ = విడిపించుట; వచ్చునే = శక్యమగునా, కాదు; అహహ = ఔరా; వృథా = అనవసరపు; జల్పంబుల్ = డంబాల; కిన్ = కు; ఏమి = ఏమిటి; పని = అవసరము; అని = అని; దుర్భాషలు = నిందలు; ఆడుచున్ = పలుకుతు; దిగ్గునన్ = చటుక్కున; లేచి = లేచిపోయి; నిజ = తన; మందిరంబున్ = నివాసమున; కున్ = కు; చనియె = వెళ్ళెపోయెను; అప్పుడు = అప్పుడు; హలాయుధుండు = బలరాముడు {హలాయుధుడు - నాగలి ఆయుధము కలవాడు, బలరాముడు}; ఆ = ఆ; మాటలు = పలుకులు; కున్ = కు; అదిరిపడి = కోపంతో ఉలికిపడి.

భావము:

పోనీలెమ్మని మనం ఉపేక్షించడం వలన యాదవులు శంఖ, కిరీట, పాన్పు, సౌధ, సింహాసనాది భోగాలను అనుభవిస్తున్నారు. మనతో సమానుల్లాగా విఱ్ఱవీగే యాదవులతో స్నేహసంబంధాలు ఇక చాలు. పాములకు పాలు పోసి పెంచినంత మాత్రాన విషం తగ్గుతుందా? తమ మాట వినవలసిందిగా మమ్ము ఆజ్ఞాపించడం సిగ్గులేనితనం కాదా? అంతేకాకుండా, భీష్మ ద్రోణ కర్ణాది యోధుల వర్గానికి చిక్కి లోబడినవాడిని విడిపించడం దేవేంద్రుడికైనా సాధ్యమా? పనికిరాని డంబాల మాటలతో పని ఏముంది.” అని పరుషంగా మట్లాడుతూ దిగ్గునలేచి తన సౌధానికి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడి పరుషవాక్కులకు బలరాముడు ఆగ్రహంతో అదిరిపడి.