పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కాశీరాజు వధ

  •  
  •  
  •  

10.2-535-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియును, బ్రళయవేళాసంభూత జీమూతసంఘాత ప్రభూత ఘుమఘుమాటోప నినదాధరీకృత మహాదుస్సహ కహకహ నిబిడనిస్వననిర్ఘోషపరిపూరిత బ్రహ్మాండకుహరంబును, నభ్రంలిహ కీలాసముత్కట పటు చిటపట స్ఫుట ద్విస్ఫులింగచ్ఛటాభీలంబును, సకలదేవతాగణ జయజయశబ్ద కలితంబును, ననంతతేజో విరాజితంబును నగుచుం గదిసినం బంటింపక కంటగించు కృత్యను గెంటి వెంటనంటిన నది తన తొంటిరౌద్రంబు విడిచి మరలి కాశీపురంబు సొచ్చి పౌరలోకంబు భయాకులతంబొంది వాపోవ, రోషభీషణాకారంబుతో నప్పుడు ఋత్విఙ్నికాయయుతంబుగ సుదక్షిణుని దహించె; నత్తఱిఁ జక్రంబును దన్నగరంబు సౌధ ప్రాకార గోపురాట్టాల కాది వివిధ వస్తు వాహన నికరంబుతో భస్మంబు గావించి మరలి యమరులు వెఱఁగందఁ గమలలోచన పార్శ్వవర్తి యై నిజ ప్రభాపుంజంబు వెలుఁగొందఁ గొల్చియుండె" నని చెప్పి; మఱియు నిట్లనియె.

టీకా:

అదియును = ఆ చక్రము; ప్రళయ = ప్రళయ; వేళా = కాలము నందు; సంభూత = పుట్టు; జీమూత = మేఘముల; సంఘాత = సమూహము లందు; ప్రభూత = జనించు; ఘుమఘుమ = ఘుమఘుమ అను శబ్దము యొక్క; ఆటోప = విజృంభణము గల; నినద = ధ్వనిని; అధరీకృత = కించపరచెడి; మహా = మిక్కిలి; దుస్సహ = సహింపరాని; కహకహ = కహకహ అను; నిబిడ = దట్టమైన, గట్టి; నిస్వన = ధ్వని యొక్క; నిర్ఘోష = మోతచేత; పరిపూరిత = పూర్తిగా నిండిపోయిన; బ్రహ్మాండ = బ్రహ్మాండము అను; కుహరంబును = బిలము కలది; అభ్రన్ = ఆకాశమును; లిహ = ఒరయుచున్న; కీలా = మంటలచేత; సముత్కట = అతిశయించిన; పటు = వేండ్రములైన; చిటపట = చిటపట అను; స్ఫుటత్ = స్పష్టమైన; విస్ఫులింగత్ = మిణుగురుల, అగ్నికణముల; ఛటా = సమూహములచే; ఆభీలంబును = మిక్కిలి భయంకరమైనది; సకల = సర్వ; దేవతా = దేవతల; గణ = సమూహముచేత; జయజయ = జయముజయము అను; శబ్ద = శబ్దములతో; కలితంబును = కూడినది; అనంత = అంతులేని; తేజస్ = తేజస్సుచేత; విరాజితంబును = ప్రకాశించునది; అగుచున్ = ఔతు; కదిసిన = సమీపించగా; పంటింపక = వెనుదీయకుండ; కంటగించు = విరోధించు నట్టి; కృత్యను = కృత్యను; గెంటి = తోసివేసి; వెంటనంటినన్ = వెంబడించగా; అది = ఆ కృత్య; తన = తన యొక్క; తొంటి = మునుపటి; రౌద్రంబును = భీకరత్వమును; విడిచి = వదలిపెట్టి; మరలి = వెనుదిరిగి; కాశీ = కాశీ; పురంబున్ = పట్టణమును; చొచ్చి = ప్రవేశించి; పౌర = పురజనులు; లోకంబు = సర్వము; భయ = భయముచేత; ఆకులతన్ = కలతను; పొంది = పొంది; వాపోవన్ = మొరపెట్టగా; రోష = క్రోధముతో కూడిన; భీషణ = భయంకరమైన; ఆకారంబు = ఆకృతితో; అప్పుడు = అప్పుడు; ఋత్విక్ = ఋత్విక్కుల; నికాయ = సమూహములతో; యుతంబుగన్ = సహా; సుదక్షిణుని = సుదక్షిణుడిని; దహించెన్ = దహించివేసెను; ఆ = ఆ; తఱిన్ = సమయము నందు; చక్రంబునున్ = చక్రము; తత్ = ఆ; నగరంబున్ = పట్టణము; సౌధ = మేడలతో; ప్రాకార = కోటగోడలు; గోపుర = గోపురములు; అట్టాలక = కోటబురుజులు; ఆది = మున్నగు; వివిధ = నానావిధ; వస్తు = పదార్థములు; వాహన = వాహనముల; నికరంబున్ = సమూహము; తోన్ = తోటి; భస్మంబు = బూడిద; కావించి = చేసి; మరలి = వెనుతిరిగి; అమరులు = దేవతలు; వెఱగందన్ = ఆశ్చర్యపోతుండగా; కమలలోచన = కృష్ణుని; పార్శ్వవర్తి = పక్క నుండునది; ఐ = అయ్యి; నిజ = తన యొక్క; ప్రభా = కాంతి; పుంజంబున్ = సమూహమును; వెలుగొందన్ = ప్రకాశించుచుండగా; కొల్చి = సేవించుచు; ఉండెను = ఉండెను; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ చక్రాయుధం ప్రళయకాలంనాటి మేఘాల నుండి పుట్టిన ఘుమ ఘుమ అంటూ భయంకరంగా ధ్వనించే గర్జనల వంటి ధ్వనితో, ఆకాశాన్ని అంటుతున్న అగ్నిజ్వాలలతో, అమిత తేజస్సుతో వెలుగొందుతూ, సకల దేవతలు జయజయ ధ్వానాలు చేస్తుండగా, కృత్యను సమీపించింది. తనను చూసి తడబడకుండా కంటగిస్తున్న కృత్యను గెంటివేసి, వెంటబడింది. అప్పుడు, కృత్య తన పూర్వపు రౌద్రరూపాన్ని వదలి తిరిగి కాశీపురం వచ్చింది. మరలి వచ్చిన కృత్యను చూసి పౌరులంతా భయపడి శోకిస్తుండగా, ఆ కృత్య రోషభీషణమైన ఆకారంతో ఋత్విజులతోపాటు సుదక్షిణుని దహించి వేసింది. అప్పుడు, శ్రీకృష్ణుడి చక్రాయుధం సౌధ, గోపుర, ప్రాకారాలతోపాటు ఆ నగరాన్ని భస్మీపటలం చేసింది. దేవతలంతా ఆశ్చర్యపడేలా శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి చేరి, తన నిజప్రభావంతో ప్రకాశిస్తూ ఉంది.” అని శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో చెప్పి కృష్ణగాథను ఇంకా ఇలా కొనసాగించాడు.