పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కాశీరాజు వధ

  •  
  •  
  •  

10.2-533-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అందుఁ దామ్రశ్మశ్రుకేశకలాపంబును, నశనిసంకాశంబులైన నిడుద కోఱలును, నిప్పులుప్పతిల్లు చూడ్కులును, ముడివడిన బొమలును, జేవురించిన మొగంబును గలిగి కృత్య యతి రౌద్రాకారంబునఁ బ్రజ్వరిల్లుచుఁ గుండంబు వెలువడి యనుదిన నిహన్య మాన ప్రాణిరక్తారుణ మృత్యుకరవాలంబు లీలం జూపట్టు నాలుకను సెలవుల నాకికొనుచు నగ్నికీలాభీలంబగు శూలంబు గేలం దాల్చి భువనకోలాహలంబుగా నార్చుచు, నుత్తాల తాలప్రమాణ పాదద్వయ హతులం దూలు పెంధూళి నింగిమ్రింగ, భూతంబులు సేవింప, నగ్నవేషయై, నిజవిలోచన సంజాత సముద్ధూత నిఖిల భయంకర జ్వాలికాజాలంబున దిశాజాలంబు నోలిం బ్రేల్చుచు, నుద్వేగగమనంబున నగధరు నగరంబున కరుగుదేరఁ, బౌరజనంబులు భయాకులమానసులై దావదహనునిం గని పఱచు వన మృగంబులచాడ్పునం బఱచి, సుధర్మాభ్యంతరంబున జూదమాడు దామోదరునిం గని “రక్షరక్షేతి”రవంబుల నార్తులయి “కృష్ణ! కృష్ణ! పెనుమంటలం బురంబు గాల్పం బ్రళయాగ్ని సనుదెంచె” నన వారిం జూచి “యోడకోడకుఁ” డని భయంబు నివారించి, సర్వరక్షకుండైన పుండరీకాక్షుండు జగదంతరాత్ముండు గావునం దద్వృత్తాంతం బంతయుఁ దన దివ్యచిత్తంబున నెఱింగి కాశీరాజపుత్త్ర ప్రేరితయైన యమ్మహాకృత్యను నిగ్రహింపం దలంచి నిజపార్శ్వవర్తి యయియున్న యద్దివ్యసాధనంబు గనుంగొని యప్పుడు.

టీకా:

అందున్ = దానిలోంచి; తామ్ర = రాగిరంగు; శ్మశ్రు = గడ్డము, మీసముల; కేశ = శిరోజముల; కలాపంబును = సమూహములు; అశని = వజ్రాయుధము; సంకాశంబులు = సరిపోలునవి; ఐనను = అయినట్టి; నిడుద = పొడవైన; కోఱలును = కోర పళ్ళు; నిప్పులు = నిప్పు (రవ్వలు); ఉప్పతిల్లు = రాలుతున్న, పుట్టుచున్న; చూడ్కులును = చూపులు; ముడిపడిన = కలిసిపోయిన; బొమలును = కనుబొమలు; జేవురించిన = ఎఱ్ఱబారిన; మొగంబును = ముఖము; కలిగి = కలిగినట్టి; కృత్య = కృత్య {కృత్య - సంహారార్థము ప్రయోగింపబడిన క్షుద్రదేవత}; అతి = మిక్కిలి; రౌద్ర = భయంకర; ఆకారంబునన్ = ఆకృతితో; ప్రజ్వరిల్లుచున్ = మండిపోతూ, ప్రకాశించుచు; గుండంబున్ = అగ్ని గుండము నుండి; వెలువడి = బయటకు వచ్చి; అనుదిన = ఎల్లప్పుడు; నిహన్యమాన = చంపబడుతున్న; ప్రాణి = ప్రాణుల; రక్త = నెత్తుటిచేత; అరుణ = ఎఱ్ఱగానైన; మృత్యు = మరణదేవత యొక్క; కరవాలంబు = కత్తి; లీలన్ = వలె; చూపట్టు = కనబడుతున్న; నాలుకను = నాలుకతో; సెలవులన్ = తన పెదవు మూలలను, ఓష్ఠ్యాంత భాగము, పెదవి (అధరము) మూల; నాకికొనుచున్ = నాకుతూ; అగ్ని = అగ్ని; కీలా = మంటల వలె; ఆభీలంబు = భయంకరము; అగు = ఐన; శూలంబున్ = శూలమును; కేలన్ = చేత; తాల్చి = ధరించి; భువన = లోకములను; కోలాహలంబు = అల్లకల్లోలము; కాన్ = అగునట్లు; ఆర్చుచున్ = అరుస్తూ; ఉత్తాల = ఎత్తైన; తాల = తాడిచెట్టుల వలె; ప్రమాణ = పొడవైన; పాద = కాళ్ళ; ద్వయ = జంట యొక్క; ఆహతులన్ = తాకుడులచే; తూలు = రేగుచున్న; పెంధూళి = మిక్కుటమైన; ధూళి = దుమ్ము; నింగిన్ = ఆకాశమును; మ్రింగన్ = కమ్ముకోగా; భూతంబులు = బేతాళాది భూతములు; సేవింపన్ = కొలుస్తుండగా; నగ్నవేష = దిసమొల కలది, దిగంబరి; ఐ = అయ్యి; నిజ = తన; విలోచన = కన్నులనుండి; సంజాత = పుట్టెడి; సముద్ధూత = మీది కెగురుతున్న; నిఖిల = ఎల్లరకు; భయంకర = భయము కలిగిస్తున్న; జ్వాలికా = మంటల; జాలంబున = సమూహముచేత; దిశా = దిక్కులు; జాలంబున్ = ఎల్ల; ఓలిన్ = క్రమముగా; ప్రేల్చుచున్ = మండింపజేచేస్తు, కాల్చుచు; ఉద్వేగ = మిక్కిలి వేగవంతమైన; గమనంబునన్ = నడకతో; నగధరు = కృష్ణుని; నగరంబున్ = పట్టణమున; కున్ = కు; అరుగుదేరన్ = రాగా; పౌరజనంబులు = ప్రజలు; భయ = భయముచేత; ఆకుల = కలత నొందిన; మానసులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; దావదహనునిన్ = కార్చిచ్చును; కని = చూసి; పఱచు = పారిపోయెడి; వన = అడవి; మృగంబులన్ = జంతువుల; చాడ్పునన్ = వలె; పఱచి = పారిపోయి; సుధర్మ = సుధర్మ సభ; అభ్యంతరంబునన్ = లోపల; జూదము = జూదము; ఆడు = ఆడుచున్న; దామోదరునిన్ = కృష్ణుని {దామోదరుడు - దామము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; కని = చూసి; రక్షరక్ష = కాపాడు కాపాడు; ఇతి = అను; రవంబులన్ = కేకలతో; ఆర్తులు = దుఃఖకంఠములతో; కృష్ణ = కృష్ణా కృష్ణా; పెను = పెద్ద పెద్ద; మంటలన్ = మంటలతో; పురంబున్ = పట్టణమును; కాల్పన్ = కల్చివేయుటకు; ప్రళయా = ప్రళయకాల; అగ్ని = అగ్ని; చనుదెంచెన్ = వచ్చినది; అనన్ = అనగా; వారిన్ = వారిని; చూచి = చూసి; ఓడకుడు = భయపడకండి; ఓడకుడు = భయపడకండి; అని = అని; భయంబున్ = భయమును; నివారించి = పోగొట్టి; సర్వరక్షకుండు = ఎల్లరను కాపాడువాడు; ఐన = అయిన; పుండరీకాక్షుండు = కృష్ణుడు; జగత్ = లోక మంతటికి; అంతరాత్ముడు = అంతరాత్మగా ఉన్నవాడు; కావునన్ = కాబట్టి; తత్ = ఆ; వృత్తాంతంబు = వర్తమానము; అంతయున్ = సమస్తమును; తన = తన యొక్క; దివ్య = దైవ సంబంధమైన; చిత్తంబునన్ = మనస్సు నందు; ఎఱింగి = తెలిసికొని; కాశీరాజపుత్ర = సుదక్షిణునిచేత; ప్రేరిత = ప్రేరేపింపబడినది; ఐన = అయిన; ఆ = ఆ; మహా = పెద్ద; కృత్యను = కృత్యను; నిగ్రహింపన్ = అణచివేయుటకు; నిజ = తన; పార్శ్వ = పక్కననే; వర్తి = మెలగెడి; అయి = ఐ; ఉన్న = ఉన్నట్టి; ఆ = ఆ; దివ్య = దివ్యమైన; సాధనంబున్ = ఆయుధమును; కనుంగొని = చూసి; అప్పుడు = అప్పుడు.

భావము:

ఆ అభిచారహోమ గుండంలోని అగ్నిజ్వాలల నుండి ఎఱ్ఱని జుట్టూ; పిడుగుల వంటి కోరలూ; నిప్పులు గ్రక్కే చూపులూ; ముడిపడిన కనుబొమలూ; జేవురించిన ముఖము; కలిగిన “కృత్య” అతిభయంకర ఆకారంతో వెలువడింది. ఆ కృత్య మృత్యుదేవత కరవాలంలా కనిపిస్తున్న నాలుకతో పెదవి మూలలు తడవుకుంటూ, అగ్నిజ్వాలవంటి శూలాన్ని చేతబట్టి, లోకం దద్దరిల్లేలా బొబ్బలు పెడుతూ, నింగినిండా దుమ్ము వ్యాపించేలా తాటిచెట్ల వంటి పాదాలతో అడుగులు వేస్తూ, భూతాలు సేవిస్తుండగా, కళ్ళ నుంచి రాలే నిప్పులతో దిక్కులను కాల్చివేస్తూ, అతివేగంగా శ్రీకృష్ణుని ద్వారకా నగరానికి దిగంబరంగా వచ్చింది. ద్వారకానగరవాసులు అంతా కృత్యను చూచి దావానలాన్ని చూసి పారిపోయే అడవిజంతువుల లాగా పారిపోయి “కాపాడు కాపాడు” అని అరుస్తూ, సుధర్మా సభామండపంలో జూదమాడుతున్న దామోదరుడు, శ్రీకృష్ణుడిని చేరారు. “మన పట్టణాన్ని దహించడానికి ప్రళయకాలాగ్ని వచ్చింది. మమ్మల్ని రక్షించు” అని ప్రార్థించారు. వారికి “భయపడకండి” అని చెప్పి, పుండరీకముల వంటి కన్నులున్న వాడు, విశ్వము అంతటిలోనూ ఆత్మరూపంలో వ్యాపించి ఉండేవాడు, సర్వరక్షకుడు, అయిన శ్రీకృష్ణుడు జరిగిన సంగతంతా దివ్యదృష్టితో తెలిసికొని, కాశీ రాకుమారుడు పంపించిన కృత్యను సంహరించాలని భావించి తన చక్రాయుధాన్ని పరికించి......