పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : పౌండ్రకవాసుదేవుని వధ

  •  
  •  
  •  

10.2-521-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నుజేంద్రాధమ! పౌండ్రభూపసుత! నీ మానంబు బీరంబు నేఁ
నిలో మాపుదు; నెద్దు క్రొవ్వి పెలుచన్నాఁబోతుపై ఱంకెవై
చి చందంబున దూతచేత నను నాక్షేపించి వల్దన్న పే
రునుఁ జిహ్నంబులు నీపయిన్ విడుతునర్చుల్‌ పర్వనేఁడాజిలోన్

టీకా:

మనుజేంద్ర = రాజులలో; అధమ = నీచుడా; పౌండ్ర = పౌండ్రక దేశపు; భూపసుత = రాకుమార; నీ = నీ యొక్క; మానంబున్ = గౌరవమును; బీరంబున్ = శౌర్యమును; నేడు = ఈనాడు; అని = యుద్ధము; లోన్ = అందున్; మాపుదున్ = పోగొట్టెదను; ఎద్దు = ఎద్దు; క్రొవ్వి = గర్వించి; పెలుచన్ = గట్టిగా; ఆబోతు = ఆబోతు; పై = మీది; ఱంకె = రంకె; వైచిన = వైచిన; చందంబున = విధముగ; దూత = దూత; చేతన్ = ద్వారా; ననున్ = నన్ను; ఆక్షేపించి = పరిహసించి; వల్దు = వదలి వేయుము; అన్న = అనిన; పేరునున్ = పేరును; చిహ్నంబులును = గుఱుతులు; నీ = నీ; పయిన్ = మీద; విడుతున్ = ప్రయోగించెదను; అర్చుల్ = మంటలు; పర్వన్ = వ్యాపించగా; నేడు = ఇవాళ; ఆజి = యుద్ధము; లోన్ = అందున్.

భావము:

“ఓ రాజాధమా! పౌండ్రకా! ఈరోజు యుద్ధంలో నీ మానం అంతా మంటగలుపుతాను. పౌరుషం అంతా పటాపంచలు చేస్తాను. ఎద్దు క్రొవ్వెక్కి ఆబోతుపై రంకెవేసినట్లు, నా దగ్గరకు దూతను పంపి నన్ను ఆక్షేపించావు. నన్ను వదలివేయమనిన ఆ చక్రాది చిహ్నాలనే నీ మీద నిప్పులు చెలరేగేలా యుద్ధంలో ప్రయోగిస్తాను.