పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బలరాముని ఘోషయాత్ర

  •  
  •  
  •  

10.2-484-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నానందబాష్పధారాసిక్త కపోలయుగళంబులతోడం గుశలప్రశ్నంబుగా నిట్లని “రన్నా! నీవును నీ చిన్నతమ్ముండగు వెన్నుండును లెస్సయున్నవారె? మమ్మెప్పుడు నరసిరక్షింప వలయు; మాకు నేడుగడయ మీరకాక యొరులు గలరే?” యని సముచిత సంభాషణంబులం బ్రొద్దుపుచ్చుచుండి; రంత.

టీకా:

మఱియున్ = ఇంకను; ఆనంద = సంతోషముతోటి; బాష్ప = కన్నీటి; ధారా = ధారలతో; సిక్త = తడిసిన; కపోల = చెక్కిళ్ళ; యుగళంబుల = జంటల; తోడన్ = తోటి; కుశలప్రశ్నంబు = క్షేమసమాచార మడుగుచు; ఇట్లు = ఇలా; అనిరి = పలికిరి; అన్నా = నాయనా; నీవును = నీవు; నీ = నీ యొక్క; చిన్న = చిన్న; తమ్ముండు = తమ్ముడు; అగున్ = ఐన; వెన్నుండును = కృష్ణుడు; లెస్స = బాగా; ఉన్నవారె = ఉన్నారా; మమున్ = మమ్మలను; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; అరసి = చూసుకొని; రక్షింపవలయున్ = కాపాడవలెను; మా = మా; కున్ = కు; ఏడుగడయ = రక్షకులు, దిక్కు; మీర = మీరే; కాక = తప్పించి; ఒరులు = మరింకొకరు; కలరే = ఉన్నారా, లేరు; అని = అని; సముచిత = తగినట్టి; సంభాషణంబులన్ = మాటలతో; ప్రొద్దు = కాలము; పుచ్చుచున్ = గడపుచు; ఉండిరి = ఉన్నారు; అంత = అంతట.

భావము:

ఆనందబాష్పాలు జాలువారుతుండగా కుశలప్రశ్నలు వేశారు “బలరామా! నీవూ నీ ముద్దుల తమ్ముడు కృష్ణుడూ క్షేమంగా ఉన్నారా? మమ్మల్ని మీరే రక్షించాలి. మాకు దిక్కు మీరు కాక మరెవరు ఉన్నారు” అంటూ సంతోషంతో చక్కగా సంభాషించారు.