పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నృగుడు యూసరవి ల్లగుట

  •  
  •  
  •  

10.2-478-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యనేకభంగులం గొనియాడి గోవిందుని పదంబులు దన కిరీటంబు సోఁకం బ్రణమిల్లి “దేవా! భవదీయ పాదారవిందంబులు నా హృదయారవిందంబును బాయకుండునట్లుగాఁ బ్రసాదింపవే?” యని తదనుజ్ఞాతుండై యచ్చటి జనంబులు సూచి యద్భుతానందంబులం బొంద నతుల తేజోవిరాజిత దివ్యవిమానారూఢుండై దివంబున కరిగె; నంత నమ్మాధవుండు నచ్చట నున్న పార్థివోత్తములకు ధర్మబోధంబుగా నిట్లనియె.

టీకా:

అని = అని; అనేక = నానా; భంగులన్ = విధములుగా; కొనియాడి = స్తుతించి; గోవిందున్ = కృష్ణుని {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; పదంబులున్ = పాదములను; తన = తన యొక్క; కిరీటంబున్ = కిరీటము; సోకన్ = తగులునట్లు; ప్రణమిల్లి = నమస్కరించి; దేవా = భగవంతుడా; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అను; అరవిందంబులు = పద్మములు; నా = నా యొక్క; హృదయ = అంతరంగము అను; అరవిందంబున్ = పద్మమును; పాయక = విడువకుండా; ఉండునట్లుగా = ఉండేటట్లుగా; ప్రసాదింపవే = అనుగ్రహింపుము; అని = అని పలికి; తత్ = అతని (కృష్ణుని); అనుఙ్ఞాతుండు = అనుమతి పొందినవాడు; ఐ = అయ్యి; అచ్చటి = అక్కడున్న; జనంబులు = వారు; చూచి = చూసి; అద్భుత = ఆశ్చర్యమును; ఆనందంబులన్ = సంతోషములను; పొందన్ = పొందుతుండగా; అతుల = సాటిలేని; తేజః = తేజస్సుచేత; విరాజిత = విరాజిల్లుచున్న; దివ్య = దేవసంబంధమైన; విమాన = విమానము నందు; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; దివంబున్ = స్వర్గలోకమున; కున్ = కు; అరిగెన్ = వెళ్ళెను; అంత = అంతట; ఆ = ఆ ప్రసిద్ధుడైన; మాధవుండు = కృష్ణుడు; అచ్చటన్ = అక్కడ; ఉన్న = ఉన్నట్టి; పార్థివ = రాజులలో; ఉత్తములు = శ్రేష్ఠుల; కున్ = కు; ధర్మ = ధర్మమును; బోధంబు = బోధించుట; కాన్ = అగుటకు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా అనేక విధాలుగా స్తుతించి ఆ నృగుడు గోపాల ప్రభువు శ్రీకృష్ణుడి చరణారవిందాలకు నమస్కరించాడు. “దేవా! నీ పాదపద్మాలు నా హృదయ పద్మ మందు స్థిరపడునట్లు అనుగ్రహింపుము.” అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుని అనుజ్ఞ గైకొని అక్కడ చేరిన వారందరూ ఆశ్చర్యానందాలు పొందుతుండగా నృగమహారాజు ఒక దివ్యవిమానాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న రాకుమార శ్రేష్ఠులకు ఇలా ధర్మబోధ గావించాడు.