పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నృగుడు యూసరవి ల్లగుట

  •  
  •  
  •  

10.2-476-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వేగంబున ద్రొబ్బించిన నేను బుడమిం బడునపు డీనికృష్టంబయిన యూసరవెల్లి రూపంబుఁ గైకొంటి; నింతకాలంబు దద్దోష నిమిత్తంబున నిద్దురవస్థం బొందవలసెఁ; బ్రాణులకుఁ బుణ్య పాపంబు లనుభావ్యంబులు గాని యూరక పోనేరవు; నేఁడు సమస్త దురితనిస్తారకంబయిన భవదీయ పాదారవింద సందర్శనంబునం జేసి యీ ఘోరదుర్దశలంబాసి నిర్మలాత్మకుండ నైతి" నని పునఃపునః ప్రణామంబు లాచరించి, మఱియు నిట్లనియె.

టీకా:

అని = అని; వేగంబునన్ = వడిగా; ద్రొబ్బించినన్ = తోయించగా; నేనున్ = నేను; పుడమిన్ = భూమిపై; పడున్ = పడిపోవు; అపుడు = సమయము నందు; ఈ = ఈ; నికృష్టంబు = నీచము; అయిన = ఐన; ఊసరవెల్లి = ఊసరవెల్లి; రూపంబున్ = స్వరూపమును; కైకొంటిని = గ్రహించితిని; ఇంత = ఇన్ని; కాలంబున్ = దినములు; తత్ = ఆ; దోష = పాపము; నిమిత్తంబునన్ = కారణముచేత; ఈ = ఈ; దురవస్థన్ = చెడ్డ అవస్థను; పొందవలసెన్ = అనుభవించ వలసి వచ్చెను; ప్రాణుల్ = జీవుల; కున్ = కు; పుణ్య = పుణ్యకర్మల ఫలము; పాపంబులన్ = పాపకర్మల ఫలము; అనుభావ్యంబులు = అనుభవించవలసినవే; కాని = అంతే తప్పించి; ఊరక = అనుభవించకుండగ; పోనేరవు = తొలగిపోలేవు; నేడు = ఇవాళ; సమస్త = ఎల్ల; దురిత = పాపములను; నిస్తారకంబు = పూర్తిగా దాటించునవి; అయిన = అగు; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అను; అరవింద = పద్మముల; సందర్శనంబునన్ = చూచుట; చేసి = వలన; ఈ = ఈ; ఘోర = భయంకరమైన; దుర్దశలన్ = నీచ అవస్థలను; పాసి = దూరమై; నిర్మల = విమలమైన; ఆత్మకుండను = మనస్సు కలవాడను; ఐతిని = అయ్యాను; అని = అని; పునఃపునః = మళ్ళీమళ్ళీ; ప్రణామంబులు = నమస్కారములు; ఆచరించి = చేసి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా పలికి యముడు నన్ను అక్కడ నుండి త్రోసివేయించాడు. భూమిపై పడేటప్పుడే నాకు ఈ ఊసరవెల్లి రూపం సంభవించింది. ఇంతకాలం ఆ దోషం పోవడానికే, ఈ దురవస్థ పొందవలసివచ్చింది, ప్రాణులు తమ తమ పుణ్యపాప ఫలాలను రెండింటినీ అనుభవించాలి తప్పదు. అవి ఊరకేపోవు. ఇదిగో ఇవాళ సమస్త దోషాలను పోగొట్టగల నీ పాదపద్మాలను దర్శించడంతో, ఆ ఘోరదుర్దశ నుండి బయటపడ్డాను. నిర్మల హృదయుడను అయ్యాను.” అని నమస్కరించి ఇంకా ఇలా ప్రార్థించాడు.