పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రతీ ప్రద్యుమ్ను లాగమనంబు

  •  
  •  
  •  

10.2-30-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

" కంజేక్షణుఁ డీ కుమారతిలకుం డీ యిందుబింబాననుం
డీ కంఠీరవమధ్యుఁ డిచ్చటికి నేఁ డెందుండి యేతెంచెనో
యీ ల్యాణునిఁ గన్న భాగ్యవతి మున్నే నోములన్ నోఁచెనో
యే కాంతామణియందు వీని కనెనో యేకాంతుఁ డీ కాంతునిన్.

టీకా:

ఈ = ఈ; కంజ = కమలముల వంటి; ఈక్షణుడు = కన్నులు కలవాడు; ఈ = ఈ; కుమార = బాలురలో; తిలకుడు = శ్రేష్ఠుడు; ఈ = ఈ; ఇందుబింబా = చంద్రబింబము వంటి; ఆననుండు = ముఖము కలవాడు; ఈ = ఈ; కంఠీరవ = సింహమువంటి; మధ్యుడు = నడుము కలవాడు; ఇచ్చటి = ఇక్కడ; కిన్ = కి; నేడు = ఇవాళ; ఎందుండి = ఎక్కడనుండి; ఏతెంచెనో = వచ్చెనో; ఈ = ఈ; కల్యాణునిన్ = శుభలక్షణుని; కన్న = కనినట్టి; భాగ్యవతి = అదృష్టవంతురాలు; మున్ను = మునుపు; ఏ = ఎట్టి; నోములన్ = వ్రతములను; నోచెనో = ఆచరించెనో; ఏ = ఏ; కాంతా = స్త్రీలలో; మణి = ఉత్తమురాలు; అందున్ = అందు; వీనిన్ = ఇతనిని; కనెనో = పొందెనో; ఏ = ఏ; కాంతుడు = పురుషుడు; ఈ = ఈ; కాంతునిన్ = అందగానిని.

భావము:

ఈ చక్కటి పిల్లాడు, పద్మనేత్రుడు, చంద్రముఖుడు, సింహమధ్యముడు ఇక్కడకు ఎక్కడ నుండి వచ్చాడో. ఈ బాలుడిని కన్న భాగ్యవతి పూర్వజన్మలో ఏ నోములు నోచిందో? ఏ అందగాడు ఏ అందగత్తె యందు ఈ అందగాడిని కన్నాడో?