పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రతీ ప్రద్యుమ్ను లాగమనంబు

  •  
  •  
  •  

10.2-24-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు శంబరుని వధియించి విలసిల్లుచున్న యించువిలుకానిం గొంచు నాకాశచారిణియైన యా రతీదేవి, గగనపథంబుఁ బట్టి ద్వారకా నగరోపరిభాగమునకుం జనుదెంచిన.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; శంబరుని = శంబరాసురుని; వధియించి = సంహరించి; విలసిల్లుచున్న = ప్రకాశించుచున్న; ఇంచువిలుకాడు = ప్రద్యుమ్నుడిని {ఇంచువిలుకాడు - ఇంచు (ఇక్షు, చెరకు) విలుకాడు (విల్లు కలవాడు), మన్మథుడు}; కొంచున్ = తీసుకొని; ఆకాశచారిణి = ఆకాశగమనస్తురాలు; ఐన = అయిన; ఆ = ఆ ప్రసిద్ధురాలైన; రతీదేవి = మాయాదేవి; గగన = ఆకాశ; పథంబున్ = మార్గమును; పట్టి = వెంబడి; ద్వారకానగర = ద్వారకానగరపు; ఉపరి = మీది; భాగమున్ = భాగమున; కున్ = కు; చనుదెంచిన = రాగా.

భావము:

ఈ విధంగా శంబరుడిని సంహరించి శోభిస్తున్న ప్రద్యుమ్నుడిని తీసుకుని, ఖేచరి అయిన రతీదేవి ఆకాశమార్గం గుండా ద్వారకానగరం దగ్గరికి వచ్చింది.