పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు

  •  
  •  
  •  

10.2-439-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం బ్రచండమార్తాండమండల ప్రభావిడంబితంబును, భీషణ శతసహస్రకోటి దంభోళినిష్ఠురనిబిడనిశితధారాసహస్ర ప్రభూతజ్వలన జ్వాలికాపాస్త సమస్తకుటిల పరిపంథి దుర్వార బాహాఖర్వ గర్వాంధకారంబును, సకల దిక్పాల దేవతాగణ జేగీయమానంబును, సమదదానవజన శోకకారణ భయంకర దర్శనంబును, సమంచిత సజ్జనలోకప్రియంకర స్పర్శనంబును నగు సుదర్శనం బసురాంతక ప్రేరితంబై చని, యారామకారుండు కదళికా కాండంబుల నేర్చు చందంబునం బేర్చి సమద వేదండ శుండాదండంబుల విడంబించుచుఁ గనకమణివలయ కేయూర కంకణాలంకృతంబు నగు తదీయ బాహా సహస్రంబుఁ గరచతుష్ట యావశిష్టంబుగాఁ దునుము నవసరంబున.

టీకా:

అదియును = అది; ప్రచండ = మిక్కిలి తీవ్రమైన; మార్తాండ = సూర్య; మండల = మండలము యొక్క; ప్రభా = ప్రకాశము; విడంబితంబును = మీరినది; భీషణ = భీకరమైన; శతసహస్ర = వందవేల, అనేక; కోటి = అంచులు కల; దంభోళి = వజ్రాయుధము వలె; నిష్ఠుర = కఠినమైన; నిబిడ = దట్టమైన; నిశిత = వాడియైన; ధారా = మొనలు, పళ్ళు; సహస్ర = వేయింటి యందు; ఫ్రభూత = పుట్టిన; జ్వలన = మండుతున్న; జ్వాలికా = చిరుమంటలతో; అపాస్త = తొలగింపబడిన; సమస్త = ఎల్ల; పరిపంథి = శత్రువుల; దుర్వార = వారింపరాని; బాహా = భుజబలము యొక్క; అఖర్వ = అధికమైన, చిన్నదికాని; గర్వ = గర్వము అను; అంధకారంబును = చీకటి కలది; సకల = ఎల్ల; దిక్పాల = అష్టదిక్పాలకుల చేత {అష్టదిక్పాలకులు - 1 ఇంద్రుడు - తూర్పు దిక్కునకు 2 అగ్ని - ఆగ్నేయ మూలకు 3 యముడు - దక్షిణ దిక్కునకు 4 నిరృతి - నైఋతి మూలకు 5 వరుణుడు - పడమటి దిక్కునకు 6 వాయువు - వాయవ్య మూలకు 7 కుబేరుడు - ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు - ఈశాన్య మూలకు పరిపాలకులు}; దేవతా = దేవతల; గణ = సమూహములచేత; జేగీయమానంబునున్ = కొనియాడబడునది {జేగీయమానము - జయజయ ధ్వానములు కలది, కొనియాడబడునది}; సమద = అహంకారము కల; దానవ = రాక్షస; జన = సమూహము యొక్క; శోక = దుఃఖమునకు; కారణ = కారణమై; భయంకర = భయము పుట్టించు; దర్శనంబును = కనబడుట కలది; సమంచిత = చక్కనైన; సజ్జన = మంచివారి; లోక = సమూహమునకు; ప్రియంకర = ప్రీతిని కలిగించు; స్పర్శనంబును = తాకుట కలది; అగు = ఐన; సుదర్శనంబు = సుదర్శనచక్రము; అసురాంతక = కృష్ణునిచేత; ప్రేరితంబు = ప్రేరేపింపబడినది; ఐ = అయ్యి; చని = వెళ్ళి; ఆరామకారుండు = తోటపనివాడు; కదళికా = అరటి చెట్ల; కాండంబులన్ = బోదెలను; ఏర్చు = చక్కగా నరికెడి; చందంబునన్ = విధముగా; పేర్చి = అతిశయించి; సమద = మదముతో కూడిన; వేదండ = ఏనుగు యొక్క; శుండా = తొండములు అను; దండంబులన్ = కఱ్ఱలను; విడంబించుచు = మీరుతూ; కనక = బంగారపు; మణి = రత్నాల; వలయ = కడియములు; కేయూర = భుజకీర్తులు; కంకణ = కంకణములచేత; అలంకృతంబున్ = అలంకరింపబడినవి; అగు = ఐన; తదీయ = అతని; బాహా = చేతులు; సహస్రంబున్ = వెయ్యింటిని (1000); కర = చేతులు; చతుష్టయ = నాలుగు (4); ఆవశిష్టంబు = మిగిలినవి; కాన్ = అగునట్లు; తునుము = నరకు; అవసరంబునన్ = సమయము నందు;

భావము:

సుదర్శనచక్రం ప్రచండ సూర్యమండలంలా శోభించేది; పదివేలకోట్ల వజ్రాయుధాల జ్వలన జ్వాలలతో శత్రువుల గర్వాంధకారాన్ని నివారించేది; సమస్త దేవతల స్తుతులను అందుకునేది; తన దర్శనంతో దానవులకు శోకం కలిగించేదీ; తన సంస్పర్శనంతో సజ్జనులకు ఆనందం కలిగించేదీ. శ్రీ కృష్ణుడు అట్టి సుదర్శనాన్ని బాణాసురుడి మీద ప్రయోగించగా, అది రత్నఖచితా లైన ఆభరణాలతో శోభిస్తూ, మదగజతుండాలలాగ వెలుగొందుతున్న బాణాసురుని వేయిచేతులలో నాల్గింటిని మాత్రం వదలి తక్కిన వాటిని తోటమాలి అరటిచెట్లను నరకివేసినట్లు నరికేసింది.