పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు

  •  
  •  
  •  

10.2-430-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక లోకంబున దైవం బనేక ప్రకారంబులై యుండు; నది యెట్టిదనినం గళాకాష్ఠాముహూర్తంబులనంగల కాలంబును, సుకృత దుష్కృతానుభవ రూపంబు లైన జీవకర్మంబులును స్వభావంబును, సత్త్వరజస్తమోగుణాత్మకంబైన ప్రకృతియును, సుఖదుఃఖాశ్రయంబైన శరీరంబును, జగజ్జంతు నిర్వాహకంబైన ప్రాణంబును, సకలపదార్థ పరిజ్ఞాన కారణం బైన యంతఃకరణంబును, మహదహంకార శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్ర తత్కార్యభూత గగన పవ నానల సలిల ధరాది పంచభూతంబు లాదిగాఁ గల ప్రకృతి వికారంబులును, నన్నింటి సంఘాతంబును, బీజాంకుర న్యాయంబునం గార్యకారణరూప ప్రవాహంబును నై, జగత్కారణ శంకితం బై యుండు; నది యంతయు భవదీయ మాయా విడంబనంబు గాని యున్నయది కాదు; తదీయ మాయానివర్తకుండవైన నీవు నానావిధ దివ్యావతారాదిలీలలం జేసి దేవగణంబులను, సత్పురుషులను, లోకనిర్మాణచణులైన బ్రహ్మాదులను బరిరక్షించుచు లోకహింసాప్రవర్తకులైన దుష్టమార్గ గతులం గ్రూరాత్ముల హింసించుచుందువు; విశ్వ! విశ్వంభరాభార నివారణంబు సేయుటకుఁ గదా భవదీయ దివ్యావతార ప్రయోజనంబు; గావున నిన్ను శరణంబు వేఁడెద.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండ; లోకంబునన్ = లోకము నందు; దైవంబు = దేవుళ్ళు; అనేక = బహు; ప్రకారంబులు = విధములు; ఐ = అయ్యి; ఉండున్ = ఉంటారు; అది = అది; ఎట్టిది = ఎలాగ; అనినన్ = అన్నచో; కళ = కళ {కళ - ముప్పది కాష్ఠల కాలము}; కాష్ఠ = కాష్ఠ {కాష్ఠ - పదునెనిమిది రెప్పపాటుల కాలము}; ముహుర్తంబులు = ముహుర్తములు {ముహుర్తము - 2 గడియల కాలము, 12 క్షణముల కాలము}; అనన్ = అని; కల = ఉన్న; కాలంబునున్ = కాలము; సుకృత = పుణ్యము, సుఖములను; దుష్కృత = పాపము, కష్టములను; అనుభవ = అనుభవించుటయే; రూపంబులు = స్వరూపములుగా గలవి; ఐన = అయినట్టి; జీవ = జీవుల, మానవుల; కర్మంబులును = కర్మములు; స్వ = నేను అను; భావంబును = భావములు; సత్వ = సత్వగుణము; రజస్ = రజోగుణము; తమోగుణ = తమోగుణములతో; ఆత్మకంబు = కలది; ఐన = అయిన; ప్రకృతియును = మాయ; సుఖ = సుఖములను; దుఃఖ = దుఃఖములను; ఆశ్రయంబు = అనుభవించుటకు ఆధారం; ఐన = అయిన; శరీరంబును = స్థూల దేహము; జగత్ = లోకములలోని; జంతు = జంతువులను; నిర్వాహకంబు = నిర్వహించునది; ఐన = అయిన; ప్రాణంబును = ప్రాణము; సకల = ఎల్ల; పదార్థ = పదార్థములను; పరిఙ్ఞాన = తెలుసుకొనుటకు; కారణంబు = కారణము; ఐన = అయిన; అంతఃకరణంబును = అంతరంగము; మహత్ = మహత్తత్వము; అహంకార = భూతాదియైన అహంకారము; శబ్ద = ధ్వని; స్పర్శ = తాకుట; రూప = ఆకృతి; రస = రుచి; గంధ = వాసన; తన్మాత్ర = అను పంచ తన్మాత్రలు; తత్ = వాటికి; కార్యభూత = కార్యము లగుచున్న; గగన = ఆకాశము; పవన = వాయువు; అనల = అగ్ని; సలిల = నీరు; ధర = భూమి; ఆది = మున్నగు; పంచభూతంబులు = పంచభూతములు; ఆదిగాగల = మొదలైనవి; ప్రకృతి = మాయ వలన కలిగిన; వికారంబులును = వికారములు; అన్నింటి = వీటన్నిటి; సంఘాతంబును = సముదాయము; బీజాంకుర = బీజము అంకురము అను; న్యాయంబునన్ = న్యాయము ప్రకారము; కార్య = కార్యము; కారణ = కారణము లు అను; రూప = స్వరూపము కల; ప్రవాహంబునున్ = ఎడతెగక నడచునది; ఐ = అయ్యి; జగత్ = లోకములకు; కారణ = కారణమై ఉండును అను; శంకితంబు = శంక కలది; ఐ = అయ్యి; ఉండునది = ఉండెడిది; అంతయున్ = సర్వము; భవదీయ = నీ యొక్క; మాయా = మాయ యొక్క; విడంబనంబ = ఆడంబరము మాత్రమే; కాని = తప్పించి; ఉన్నయది = ఉన్నది; కాదు = కాదు; తదీయ = నీ యొక్క; మాయా = మాయను; నివర్తకుండవు = తొలగించువాడవు; ఐన = అయిన; నీవు = నీవు; నానావిధ = అనేక విధములైన; దివ్య = దివ్యములైన; అవతార = అవతారములెత్తుట; ఆది = మొదలైన; లీలలన్ = విలాసముల; చేసి = వలన; దేవ = దేవతా; గణంబులను = సమూహములు; సత్పురుషులను = సజ్జనులను, మంచివారిని; లోక = లోకములను; నిర్మాణ = సృష్టించు; చణులు = చాతుర్యము కలవారు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులను = మున్నగువారిని; పరిరక్షించుచున్ = కాపాడుతు; లోక = లోకులకు; హింసా = బాధను కలిగించు; ప్రవర్తకులు = ప్రవర్తన కలవారు; ఐన = అయిన; దుష్ట = చెడ్డ; మార్గ = దారిని; గతులన్ = అవలంబించువారిని; క్రూర = కఠినమైన; ఆత్ములన్ = మనసు కలవారిని; హింసించుచుందువు = చంపుచుందువు; విశ్వ = సమస్తమైన; విశ్వంభర = భూమి యొక్క; భారన్ = బరువును; నివారణంబు = అణచుట; చేయుట = చేయుట; కున్ = కోసమే; కదా = కదా; భవదీయ = నీ యొక్క; దివ్య = గొప్ప; అవతార = అవతరించుటల యొక్క; ప్రయోజనంబు = ప్రయోజనము; కావునన్ = కాబట్టి; నిన్నున్ = నిన్ను; శరణంబు = రక్షణము; వేడెదన్ = ప్రార్థించెదను.

భావము:

ఓ దేవా! లోకంలో భగవంతుడు అనేక రీతులలో గోచరిస్తాడు. ముహూర్తము మున్నగు రూపాలలో తెలియబడు కాలంగాను; సుకృతాలు దుష్కృతాల రూపంలోను జీవకర్మలుగాను,స్వభావాలుగాను; త్రిగుణాత్మకమైన ప్రకృతిగాను; సుఖదుఖాలకు ఆశ్రయం అయిన శరీరంగానూ; జీవకోటికి ఆధారమైన ప్రాణంగాను; పదార్థాల గురించిన జ్ఞానాన్ని అందించే అంతఃకరణంగాను; మహత్తుగాను, అహంకారంగాను, పంచతన్మాత్రలుగాను, వాటి కారణభూతములు ఐన పంచభూతాలుగానూ; వీటి అన్నింటి సంఘాతంగాను; బీజాంకుర న్యాయంతో కార్యకారణరూప మైన ప్రవాహమై; ఈ జగత్తుకు కారణమేమో అని సందేహం కలిగిస్తుంది. కానీ, ఇది అంతా నీ మాయయే తప్ప వాస్తవం కాదు. ఆ మాయను నివారించగలవాడ వైన నీవు అనేకమైన దివ్యావతారాలను ధరించి లోకనిర్మాణ చణులైన బ్రహ్మాదిదేవతలనూ, పుణ్యపురుషులనూ, దేవగణాలనూ రక్షిస్తూ హింసారూప మైన చెడుమార్గాన్ని అనుసరించే దుష్టాత్ములను శిక్షిస్తూ ఉంటావు. ఈ భూభారాన్ని తొలగించడమే కదా నీ దివ్యావతారాల ప్రయోజనం అందువలన నిన్ను శరణు కోరుతున్నాను.