పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శివ కృష్ణులకు యుద్ధ మగుట

  •  
  •  
  •  

10.2-418-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టియెడ సైన్యంబు దైన్యంబు నొంది యనాథం బయి చెడి, విఱిగి పాఱినం గని బాణుండు సాత్యకిం గేడించి ప్రళయాగ్నియుం బోలె విజృంభించి చెయి వీచి బలంబుల మరలం బురిగొల్పి తానును ముంగలి యై నడచె; నప్పు డుభయసైన్యంబు లన్యోన్య జయకాంక్షం దలపడు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబున వీఁకం దాఁకినం బోరు ఘోరం బయ్యె; నట్టియెడ గదల నడిచియుఁ, గుఠారంబులఁ బొడిచియు; సురియలం గ్రుమ్మియు, శూలంబులం జిమ్మియు; శక్తుల నొంచియుఁ, జక్రంబులం ద్రుంచియు, ముసలంబుల మొత్తియు, ముద్గరంబుల నొత్తియుఁ; గుంతంబుల గ్రుచ్చియుఁ, బంతంబు లిచ్చియుఁ; బరిఘంబుల నొంచియుఁ, బట్టిసంబులం ద్రుంచియు శరంబుల నేసియుఁ, గరవాలంబుల వ్రేసియు, సత్రాసులై పాసియు, విత్రాసులై డాసియుఁ బెనఁగినం దునిసిన శిరంబులును, దునుకలైన కరంబులును, దెగిన కాళ్ళును, ద్రెస్సిన వ్రేళ్ళును; దుమురులైన యెముకలును, బ్రోవులైన ప్రేవులును, నులిసిన మేనులును, నలిసిన జానువులును, నొగిలిన వర్మంబులును, బగిలిన చర్మంబులును, వికలంబు లయిన సకలావయవంబులును, వికీర్ణంబులయిన కర్ణంబులును, విచ్ఛిన్నంబులైన నయనంబులును, వెడలు రుధిరంబులును, బడలుపడు బలంబులును, గొండల వడువునంబడు మాంసఖండంబులును, వాచఱచు కొఱప్రాణంబులును, వ్రాలిన తేరులును,గూలిన కరులును, నొఱగిన గుఱ్ఱంబులును, దెరలిన కాలుబలంబులును గలిగి; పలలఖాదన కుతూహల జనిత మదాంధీభూత పిశాచ డాకినీ భూత బేతాళ సమాలోల కోలాహల భయంకరారావ బధిరీకృత సకలదిశావకాశం బయి సంగరాంగణంబు భీషణంబయ్యె; నయ్యవసరంబున.

టీకా:

అట్టి = అటువంటి; ఎడన్ = సమయమ నందు; సైన్యంబు = సేనలు; దైన్యంబున్ = దీనత్వమును; ఒంది = పొంది; అనాథంబు = దిక్కులేనిది; ఐ = అయ్యి; చెడి = ఓడి; విఱిగి = వెనుదీసి; పాఱినన్ = పారిపోగా; కని = చూసి; బాణుండు = బాణుడు; సాత్యకిన్ = సాత్యకిని; కేడించి = పరిహాసముచేసి; ప్రళయ = ప్రళయకాలపు; అగ్నియున్ = అగ్ని; పోలెన్ = వలె; విజృంభించి = రెచ్చిపోయి; చెయి = చేతిని; వీచి = ఊపి; బలంబులన్ = సైన్యమును; మరలన్ = తిరిగి; పురిగొల్పి = ప్రేరేపించి; తానును = తనే; ముంగలి = ముందుండువాడు; ఐ = అయ్యి; నడచెన్ = వెళ్ళగా; అప్పుడు = అప్పుడు; ఉభయ = ఇద్దరి; సైన్యంబులున్ = సేనలు; అన్యోన్య = ఒకరి నొకరు; జయ = గెలవవలెను; కాంక్షన్ = కోరికలతో; తలపడు = పోరెడి; దక్షిణ = దక్షిణపు; ఉత్తర = ఉత్తరపు; సముద్రంబులన్ = సముద్రముల; రౌద్రంబునన్ = భీకరత్వములతో; వీకన్ = ఉత్సాహముగా; తాకినన్ = పోరగా; పోరు = యుద్ధము; ఘోరంబు = భీకరము; అయ్యెన్ = అయినది; అట్టి = ఆ; ఎడన్ = సమయము నందు; గదలన్ = గదలతో; నడచియున్ = అణచి; కుఠారంబులన్ = గొడ్డళ్ళతో; పొడిచియున్ = నరికి; సురియలన్ = చురకత్తులతో; క్రుమ్మియున్ = పొడిచి; శూలంబులన్ = శూలములతో; చిమ్మియున్ = ఎగరగొట్టి; శక్తులన్ = శక్తి అను ఆయుధాలతో; నొంచియున్ = నొప్పించి; చక్రంబులన్ = చక్రములతో; త్రుంచియున్ = కోసి; ముసలంబులన్ = రోకళ్ళతో; మొత్తి = మొత్తి; ముద్గరంబులన్ = ఇనపగుదియలతో; ఒత్తియున్ = కొట్టి; కుంతలంబులన్ = ఈటెలతో; గ్రుచ్చియున్ = గుచ్చి; పంతంబులున్ = పంతములు; ఇచ్చియున్ = పెట్టుత; పరిఘంబులన్ = ఇనపకట్లగుదియలతో; నొంచియున్ = కొట్టి; పట్టిసంబులన్ = అడ్డకత్తులతో; త్రుంచియున్ = నరికి; శరంబులన్ = బాణములను; ఏసియు = వేసి; కరవాలంబులన్ = కత్తులతో; వ్రేసియున్ = నరికి; సత్రాసులు = భయముకలవారు; ఐ = అయ్యి; పాసియు = పారిపోయి; విత్రాసులు = భయములేనివారు; ఐ = అయ్యి; డాసియున్ = సమీపించి; పెనగినన్ = పోరాడగా; తునిసిన = తెగిన; శిరంబులును = తలలు; తునకలు = విరిగినవి; ఐన = అయిన; కరంబులునున్ = చేతులు; తెగిన = తెగినట్టి; కాళ్ళునున్ = కాళ్ళు; త్రెస్సిన = తెగిన; వ్రేళ్ళునున్ = వేళ్ళు; తుమురులు = పొడిపొడి; ఐన = అయిన; ఎముకలును = ఎముకలు; ప్రోవులు = పోగులుపడినవి; ఐన = అయిన; ప్రేవులును = పేగులు; నులిసిన = తూలిన; మేనులును = దేహములు; నలిసిన = నలిగిన; జానువులును = మోకాళ్ళును; నొగిలిన = వికలములైన; వర్మంబులునున్ = కవచములు; పగిలిన = చిట్లిన; చర్మంబులును = చర్మములు; వికలంబులు = విరిగిపోయినవి; అయిన = ఐన; సకల = ఎల్ల; అవయవంబులును = అవయవములు; వికీర్ణంబులు = తెగిపోయినవి; అయిన = ఐన; కర్ణంబులునున్ = చెవులు; విచ్చిన్నంబులు = పగిలినవి; ఐన = అయిన; నయనంబులునున్ = కళ్ళు; వెడలు = కారుతున్న; రుధిరంబులు = రక్తములు; పడలుపడు = కుప్పకూలెడి; బలంబులును = సేనలు; కొండల = పర్వతాల; వడువునన్ = వలె; పడు = పడిపోవు; మాంస = మాంసము; ఖండంబులును = ముక్కలు; వాచఱుచు = వా అని అరచెడి; కొఱప్రాణంబులును = కొనప్రాణమున్నవారు; వ్రాలిన = ఒరిగిన; తేరులును = రథములు; కూలిన = పడిన; కరులునున్ = ఏనుగులు; ఒఱగిన = పడిపోయిన; గుఱ్ఱంబులును = గుఱ్ఱములు; తెరలిన్ = తుళ్ళిన; కాలుబలంబులును = భటులు; కలిగి = కలిగి; పలల = మాంసమును; ఖాదన = తినుట యందు; కుతూహల = వేడుకల వలన; జనిత = పుట్టిన; మద = కొవ్వుచేత; అంధీభూత = గుడ్డివైన; పిశాచ = పిశాచములు; డాకినీ = డాకినీలు; భూత = భూతములు; బేతాళ = బేతాళములు {బేతాళము - పిశాచ భేదము}; సమాలోల = విహరించుటలవలన; కోలాహల = కలకలలతో; భయంకర = భయంకరమైన; ఆరావ = అరుపులతో; బధిరీకృత = చెవుడుకలుగజేయబడిన; సకల = ఎల్ల; దిశా = దిక్కులలోని; అవకాశంబున్ = ప్రదేశము కలది; అయి = అయ్యి; సంగరా = యుద్ధ; అంగణంబు = భూమి; భీషణంబు = భయముగొల్పునది; అయ్యెన్ = అయినది; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.

భావము:

ఆ సమయంలో, బాణుడి సైన్యం దీనత్వంతో అనాథ యై, పారిపోసాగింది, అది చూసి బాణాసురుడు సాత్యకిని అలక్ష్యం చేసి ప్రళయాగ్ని వలె విజృంభించి తన సైన్యాన్ని పురికొల్పి తానే సేనకు నాయకత్వం వహించాడు. అప్పుడు ఉభయసైన్యాలూ అన్యోన్య జయకాంక్షతో తలపడిన ఉత్తర దక్షిణ సముద్రాలవలె విజృంభించి యుద్ధానికి సిద్ధపడ్డాయి. సంకులయుద్ధం సాగింది. గదలు, ఖడ్గాలు, సురియలు, శూలాలు, చక్రాలు, శక్తులు, బల్లెములు, పట్టిసములు మున్నగు ఆయుధాలతో ఇరుపక్షాల సైనికులు యుద్ధం చేసారు; కొందరు భయంతో పారిపోయారు; కొందరు ధైర్యంతో ఎదిరించారు; కాళ్ళు, వేళ్ళు, తలలు, చేతులు తెగిపోయాయి; ఎముకలు ముక్కలు అయ్యాయి; ప్రేగులు కుప్పలు పడ్డాయి; చెవులు తెగిపోయాయి; కళ్ళు విచ్ఛిన్నమయ్యాయి; మాంసఖండాలు కొండలవలె యుద్ధరంగంలో పడ్డాయి; రథాలు కుప్పకూలాయి; గజాలు నేలవ్రాలాయి; గుఱ్ఱాలు కూలబడ్డాయి; కాల్బలం మట్టికరచింది; యుద్ధరంగంలో పడిన ఈ శవాల మాంసాన్ని భక్షించడానికి గుమికూడిన భూత, పిశాచ, బేతాళుల భయంకర ధ్వనులతో సకల దిశలు మారుమ్రోగాయి. ఆ రణరంగం ఈతీరున మహాభీషణమై ఘోరాతిఘోరంగా మారిపోయింది.