పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శివ కృష్ణులకు యుద్ధ మగుట

  •  
  •  
  •  

10.2-416-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పంబి రణక్షితిన్ శరవిపాటిత శాత్రవవీరుఁ డైన యా
సాంబుఁడు హేమపుంఖశిత సాయకజాలము లేర్చి భూరి కో
పంబున నేసినన్ బెదరి బాణతనూభవుఁ డోడి పాఱె శౌ
ర్యంబును బీరముం దగవు నాఱడివోవ బలంబు లార్వఁగన్.

టీకా:

పంబి = అతిశయించి; రణ = యుద్ధ; క్షితిన్ = భూమి యందు; శర = బాణములచే; విపాటిత = పడగొట్టబడిన; శాత్రవ = శత్రువుల; వీరుడు = యోధులు కలవాడు; ఐన = అయిన; ఆ = ఆ ప్రసిద్ధుడైన; సాంబుడు = సాంబుడు; హేమ = బంగారపు; పుంఖ = పింజలు గల, పిడులు గల; శిత = వాడియైన; సాయక = బాణముల; జాలముల్ = సమూహములు; ఏర్చి = సంధించి; భూరి = మిక్కుటమైన; కోపంబునన్ = రోషముతో; ఏసినన్ = ప్రయోగించగా; బెదిరి = భయపడి; బాణతనూభవుడు = బలుడు; ఓడి = ఓడిపోయి; పాఱెన్ = పారిపోయెను; శౌర్యంబును = వీరత్వము; బీరమున్ = పౌరుషము; తగవును = పద్ధతి, యుద్ధము; ఆఱడిపోవన్ = వ్యర్థముకాగా; బలంబులు = సేనలు; ఆర్వగన్ = బొబ్బలు పెట్టగా.

భావము:

శత్రు భయంకరుడైన సాంబుడు విజృంభించి తీవ్రక్రోధంతో వాడి బాణాలను ప్రయోగించగా, బాణుడి కొడుకు బెదరి శౌర్యం కోల్పోయి శత్రువీరులు హేళనచేస్తుండగా పలాయనం చిత్తగించాడు.